Teacher job scam : టీచర్స్​ జాబ్​ స్కామ్​లో రాష్ట్ర మంత్రి అరెస్ట్​-minister arrested over teacher job scam in west bengal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Teacher Job Scam : టీచర్స్​ జాబ్​ స్కామ్​లో రాష్ట్ర మంత్రి అరెస్ట్​

Teacher job scam : టీచర్స్​ జాబ్​ స్కామ్​లో రాష్ట్ర మంత్రి అరెస్ట్​

Sharath Chitturi HT Telugu
Jul 23, 2022 10:54 AM IST

Teacher job scam : టీచర్స్​ జాబ్​ స్కామ్​పై విచారణ చేపట్టిన ఈడీ.. పశ్చిమ్​ బెంగాల్​ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్​ చేసింది. దాదాపు 26గంటల విచారణ అనంతరం ఆయన్ని అదుపులోకి తీసుకుంది.

పార్థ ఛటర్జీ
పార్థ ఛటర్జీ (ANI)

Teacher job scam : టీచర్స్​ జాబ్​ స్కామ్​ వ్యవహారం పశ్చిమ్​ బెంగాల్​లో తీవ్ర దుమారం రేపింది. ఈ స్కామ్​కు సంబంధించి.. ఆ రాష్ట్రమంత్రి, తృణమూల్​ కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీని ఈడీ శనివారం ఉదయం అరెస్ట్​ చేసింది. స్కామ్​పై ఆయన్ని దాదాపు 26గంటల పాటు విచారించిన అనంతరం.. ఈడీ ఈ చర్యలు చేపట్టింది.

పార్థ ఛటర్జీని తొలుత ఈడీ కార్యాలయానికి తీసుకెళతారని, అక్కడి నుంచి ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఛటర్జీ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారలు.. శనివారం ఉదయం వరకు ఆయన్ని విచారించారు.

అంతేకాకుండా.. ఛటర్జీ సన్నిహితురాలిగా పేరొందిన అర్పిత ముఖర్జీ నివాసంలో నుంచి రూ. 20కోట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. అదే సమయంలో ముఖర్జీ ఇంట్లో నుంచి 20ఫోన్లను జప్తు చేశారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుప్పలుతెప్పలుగా పడి ఉన్న నోట్ల కట్టల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఈ క్రమంలో ఛటర్జీపై ఒత్తిడి మరింత పెరిగింది.

టీచర్స్​ జాబ్​ స్కామ్​..

Partha Chatterjee Arpita Mukherjee : గ్రూప్​ సీ, గ్రూప్​ డీ సిబ్బంది, టీచర్లు, 11-12 తరగతులకు అసిస్టెంట్​ టీచర్ల నియామకంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. టీచర్స్​ జాబ్​ స్కామ్​పై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది కోల్​కతా హైకోర్టు. ఈక్రమంలోనే ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది సీబీఐ. ఆ ఎఫ్​ఐఆర్​ ఆధారంగా.. ఈ పూర్తి వ్యవహారంలో మనీలాండరింగ్​ కోణాన్ని పరిశీలించేందుకు ఈడీ దర్యాప్తు చేపట్టింది.

స్కామ్​ జరిగిందని అంటున్న సమయంలో పార్థ ఛటర్జీ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా.. పార్థ ఛటర్జీతో పాటు అనేకమంది ఎమ్మెల్యేలు, టీఎంసీ నేతల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది ఈడీ.

బీజేపీ ఫైర్​..

టీచర్స్​ జాబ్​ స్కామ్​పై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 'ఇది ట్రైలర్​ మాత్రమే.. అసలు సినిమా ఇంకా ఉంది,' అంటూ బీజేపీ సీనియర్​ నేత సువేందు అధికారి ట్వీట్​ చేశారు. అర్పిత ముఖర్జీ- పార్థ ఛటర్జీ- బెంగాల్​ సీఎం మమతా బెనర్జీలు కలిసి ఉన్న అనేక ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. ఈ స్కామ్​లో మమతా బెనర్జీ పాత్ర కూడా ఉన్నట్టు ఆయన ఈ విధంగా ఆరోపించారు.

టీచర్స్​ జాబ్​ స్కామ్​పై టీఎంసీ స్పందించింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. నేతలను హింసించేందుకే ఈడీతో కుట్రలకు పాల్పడుతోందని మండిపడింది. ఈడీ చర్యలను ఖండించింది. కేంద్ర వైఖరిపై నిరసన చేస్తామని తేల్చిచెప్పింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం