Anti-Modi Posters: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వేలాది పోస్టర్లు: 100 ఎఫ్ఐఆర్‌లు నమోదు: అరెస్టులు
22 March 2023, 10:46 IST
Anti-Modi Posters in Delhi: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఉన్న వేలాది పోస్టర్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై సుమారు 100కుపైగా కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీ పోలీసులు
Anti-Modi Posters in Delhi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)కి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు ఏర్పాటయ్యాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తరలిస్తున్న వేలాది పోస్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ పోస్టర్ల ఘటనపై బుధవారం ఇప్పటి వరకు 100 కేసులను నమోదు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రింటింగ్ ప్రెస్ యజమానులైన ఇద్దరు ఉన్నారు. కాగా, ఈ విషయంపై ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP) ఘాటు విమర్శలు చేసింది. వివరాలివే.
ఆ నినాదంతో..
Anti-Modi Posters in Delhi: 2,000కు పైగా పోస్టర్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎక్కువ పోస్టర్లపై మోదీ హఠావో, దేశ్ బచావో (మోదీని తప్పించండి, దేశాన్ని కాపాడండి) అని రాసి ఉంది.
ఆమ్ఆద్మీ పార్టీ ఆఫీసుకు తరలిస్తున్నట్టు ఆరోపణలతో 2వేల పోస్టర్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతంలో వ్యాన్‍ను అడ్డుకున్న సమయంలో పోస్టర్లు పట్టుబడినట్టు పోలీసులు చెప్పారు. ఈ పోస్టర్లను ఆమ్ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళుతున్న ఆ వ్యాన్ డ్రైవర్ చెప్పాడని వెల్లడించారు. ఇలాంటి పోస్టర్లే సోమవారం కూడా వెళ్లాయని ఓ పోలీసు అధికారి చెప్పారు.
భయమెందుకు?
Anti-Modi Posters in Delhi: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టర్ల అంశంలో కేసులు నమోదు చేయడంపై ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ఆద్మీ స్పందించింది. ఇండియా ప్రజాస్వామ్య దేశమని మోదీకి బహుషా తెలియనట్టుంది అంటూ ఆప్ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.
“మోదీ ప్రభుత్వ నియంతృత్వం తారస్థాయికి చేరింది. మోదీ జీ.. 100 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసేంత అభ్యంతరకరం ఈ పోస్టర్లలో ఏముంది? ప్రధాని మోదీ.. మీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ.. ఇండియా ప్రజాస్వామ్య దేశం. పోస్టర్‌కు ఇంత భయమా! ఎందుకు?” అని ఆమ్ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది.
నేడు ఢిల్లీ బడ్జెట్
Delhi Budget: మరోవైపు, ఢిల్లీ వార్షిక బడ్జెట్‍ను ఆమ్ఆద్మీ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలపటంతో బడ్జెట్‍ను తీసుకురానుంది. బడ్జెట్‍ను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. అనంతరం మంగళవారం ఢిల్లీ బడ్జెట్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.