తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amritpal Singh Chase: అమృత్‍పాల్ కోసం చేజ్ జరిగిందిలా: వెల్లడించిన పోలీసు అధికారి.. విదేశాలకు పరారీపై అనుమానాలు!

Amritpal Singh Chase: అమృత్‍పాల్ కోసం చేజ్ జరిగిందిలా: వెల్లడించిన పోలీసు అధికారి.. విదేశాలకు పరారీపై అనుమానాలు!

19 March 2023, 18:17 IST

    • Amritpal Singh Chase: పంజాబ్ మొత్తం హైఅలర్ట్ కొనసాగుతోంది. ఖలీస్థానీ వేర్పాటువాద సానుభూతిపరుడు అమృత్‍పాల్ సింగ్‍ పట్టుకునేందుకు చేసిన చేజ్ ఎలా జరిగిందో ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. కాస్తలో ఆయన తప్పించుకున్నారని తెలిపారు. ఆ వివరాలివే..
Amritpal Singh Chase: సోదాలు చేస్తున్న పోలీసులు
Amritpal Singh Chase: సోదాలు చేస్తున్న పోలీసులు (AFP)

Amritpal Singh Chase: సోదాలు చేస్తున్న పోలీసులు

Amritpal Singh Chase: ఖలిస్థానీ సానుభూతిపరుడు, అతివాద సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ హెడ్ అమృత్‍పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పంజాబ్ పోలీసులు (Punjab Police) వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. శనివారం భారీ చేజ్ చేసినా అమృత్‍పాల్‍ తమకు చిక్కకపోవటంతో.. ఆదివారం(మార్చి 19) కూడా ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన అనుచరులను 80 మందికిపైగా అరెస్ట్ చేశారు. కాగా, శనివారం జరిగిన చేజ్ వివరాలను జలంధర్ డీఐజీ స్వపన్ శర్మ (Jalandhar DIG Swapan Sharma).. ఆదివారం వెల్లడించారు. రూట్లను మారుస్తూ అమృత్‍పాల్ కారులో తప్పించుకున్నారని పేర్కొన్నారు. 16 - 17 కిలోమీటర్ల పాటు ఆయన కోసం చేజ్ చేసినట్టు తెలిపారు. మరికొన్ని వివరాలను వెల్లడించారు.

బైకర్ల సాయం

Amritpal Singh Chase: జలంధర్ జిల్లా షాకోట్ (Shahkot) ప్రాంతంలో ముందుగా అమృత్‍పాల్ సింగ్‍ను పోలీసులు గుర్తించి.. చేజ్ ప్రారంభించారని డీఐజీ స్వపన్ చెప్పారు. కారులో అమృత్‍పాల్ కనిపించారని వెల్లడించారు. పోలీసులు వెంబడించడం మొదలుపెట్టాక.. అమృత్‍పాల్ ఉన్న కారు.. ఫ్లైఓవర్ కింది నుంచి వన్ లేన్ లింక్ రోడ్డుపై ఎక్కిందని తెలిపారు. ఆ లింక్ రోడ్డు 12 నుంచి 13 కిలోమీటర్ల వరకు ఉందని తెలిపారు. అమృత్‍పాల్ వెళ్లే మార్గంలో ఆరు, ఏడు బైక్‍లు వచ్చాయని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆ బైకర్లు ప్రయత్నించారని డీఐజీ చెప్పారు. అమృత్‍పాల్ తరచూ రోడ్లను మార్చుతూ వెళ్లటంతో దొరకకుండా వెళ్లారని వెల్లడించారు. తమ చేజింగ్‍లో ఎలాంటి తప్పు దొర్లలేదని పేర్కొన్నారు. ఈ చేజ్ మొత్తంగా 16-17 కిలోమీటర్లు సాగిందని స్పష్టం చేశారు.

అమృత్‍పాల్ పరారైన కారులో ఆయనతో పాటు మరో ముగ్గురు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.

విదేశాలకు వెళ్లే ఛాన్స్!

Amritpal Singh Chase: వేరే దేశానికి పరారయ్యే ప్లాన్‍లో అమృత్‍పాల్ సింగ్ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమృత్‍పాల్ సింగ్ భార్య కెనడా వీసాకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈ విషయంపై డీఐజీకి ప్రశ్న ఎదురైంది. నేపాల్ గుండా కెనడాకు వెళ్లేందుకు అమృత్‍పాల్ ప్రయత్నిస్తున్నారన్న సమాచారంపై డీఐజీ స్వపన్ శర్మ స్పందించారు. దానికి కూడా అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంపై కూడా విచారణ చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు అసలు ప్రస్తుతం అమృత్‍పాల్ పంజాబ్‍లో ఉన్నారా.. రాష్ట్రం దాటి వెళ్లిపోయారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్ అయినందున ఆ ఇన్పర్మేషన్ ఇవ్వలేమని స్పష్టం చేశారు.

Amritpal Singh Chase: పంజాబ్ సరిహద్దులో శనివారం హైడ్రామా నడిచింది. పోలీసులు సుమారు 100 కార్లతో.. అమృత్‍పాల్‍ సింగ్‍ను పట్టుకునేందుకు చేజ్ చేశారు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఆ తర్వాత కూడా పంజాబ్ పోలీసులు ఆపరేషన్ కొనసాగించారు. ఇప్పటి వరకు 80 మందికి పైగా అమృత్‍పాల్ అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కూడా ఆయుధాల చట్టం కింద అమృత్‍పాల్‍పై కేసు నమోదు చేశారు. ఆయనను పట్టుకునే వరకు ఆపరేషన్ కొనసాగుతోందని పంజాబ్ పోలీసులు స్పష్టం చేశారు.

లవ్‍ప్రీత్ సింగ్‍ను పోలీసులు అరెస్ట్ చేసిన కారణంగా ఫిబ్రవరి 24వ తేదీన అమృత్‍సర్ జిల్లాలో అమృత్‍పాల్ అనుచరులు ఆయుధాలతో హంగామా చేశారు. అజ్‌నాలా పోలీస్ స్టేషన్‍పై దాడి చేశారు. అమృత్‍పాల్ రెచ్చగొట్టడంతోనే యువత ఇలా చేశారని కేసు నమోదైంది. అయితే ఖలిస్థాన్ వేర్పాటువేదంతో హింసను అమృత్‍పాల్ ప్రోత్సహిస్తున్నారని, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, అమృత్‍పాల్ వల్ల పంజాబ్‍లో శాంతి భద్రతలు దెబ్బ తింటున్నాయని వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్‍ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం.. ఇక ఆయనను పట్టుకునేందుకే నిర్ణయించుకుంది.

ఇంటర్నెట్ బంద్ పొడిగింపు

Amritpal Singh Chase: అమృత్‍పాల్‍ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్‍ను ప్రభుత్వం నిలిపివేసింది. ఇంటర్నెట్‍ సేవలపై ఆంక్షలను సోమవారం 12 గంటల వరకు పొడిగించింది.

టాపిక్