తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amarnath Yatra: 16 మంది మృతి.. 15వేల మందిని రక్షించిన సైన్యం

Amarnath Yatra: 16 మంది మృతి.. 15వేల మందిని రక్షించిన సైన్యం

Sharath Chitturi HT Telugu

09 July 2022, 10:58 IST

google News
  • Amarnath Yatra : అమర్​నాథ్​ యాత్ర మార్గాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 15వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించింది సైన్యం.

యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సైన్యం
యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సైన్యం (PTI)

యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సైన్యం

Amarnath Yatra : అమర్​నాథ్​ యాత్రలో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న 15వేల మందిని సైన్యం రక్షించింది. వరదల ధాటికి 16మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 40మందికిపైగా ప్రజలు గల్లంతయ్యారు.

దక్షిణ కశ్మీర్​ హిమాలయాల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయి. కుంభవృష్టి కారణంగా అమర్​నాథ్​ యాత్ర మార్గాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో అనేకమంది యాత్రికులు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటికే 16మంది మరణించారు. కొండచరియలు విరిగిపడకపోయినా, భారీ వర్షాలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం 100మందితో కూడిన నాలుగు ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సైన్యం, సీఆర్​పీఎఫ్​ దళాలు సైతం రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే 15వేలమంది యాత్రికులను అమర్​నాథ్​ యాత్ర బేస్​ క్యాంప్​ అయిన పంచతర్నికి శనివారం ఉదయం తరలించారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను సమీక్షించారు.

Amarnath Yatra cloudburst : రెండు గంటల వ్యవధిలో ఆ ప్రాంతంలో 31ఎంఎం వర్షపాతం నమోదైంది. సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లిన యాత్రికులు.. అమర్​నాథ్​ యాత్రలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘటనను గుర్తుతెచ్చుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.

"10 నిమిషాల్లో అంతా మారిపోయింది. ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చాయి. నా కళ్ల ముందే 8-10మంది గాయపడ్డారు. వరదలతో పాటు బండ రాళ్లు కూడా దూసుకొచ్చాయి. టెంట్లు కొట్టుకుపోయాయి. వంట సామాగ్రి నీటమునిగింది. ఆకస్మిక వరదలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దాదాపు తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడింది. మాకు సైన్యం సహాయం చేసింది." అని ఓ యాత్రికుడు వివరించాడు.

వర్షం పడుతున్నప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నట్టు ఐటీబీపీ వెల్లడించింది. తాజా పరిణామాలతో అమర్​నాథ్​ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు వివరించింది.

టాపిక్

తదుపరి వ్యాసం