తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amarnath Cloudburst: అమ‌ర్‌నాథ్‌లో కుండ‌పోత‌; 15 మంది మృతి

Amarnath Cloudburst: అమ‌ర్‌నాథ్‌లో కుండ‌పోత‌; 15 మంది మృతి

HT Telugu Desk HT Telugu

08 July 2022, 21:39 IST

google News
  • Amarnath Cloudburst: అమ‌ర్‌నాథ్ యాత్ర‌లో విషాదం చోటు చేసుకుంది. ఒక్క‌సారిగా యాత్ర మార్గంలో ఒక్క‌సారిగా భారీ వ‌ర్షం కురిసింది. వ‌ర‌ద పోటెత్తింది. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ధాటికి 15 మంది చ‌నిపోయారు. ఇంకా 40 మంది గ‌ల్లంత‌య్యారు.

అమ‌ర్‌నాథ్ యాత్ర మార్గంలో వ‌ర‌ద బీభ‌త్సం
అమ‌ర్‌నాథ్ యాత్ర మార్గంలో వ‌ర‌ద బీభ‌త్సం (ANI)

అమ‌ర్‌నాథ్ యాత్ర మార్గంలో వ‌ర‌ద బీభ‌త్సం

Amarnath Cloudburst: శుక్ర‌వారం సాయంత్రం ఐదున్నర గంట‌ల ప్రాంతంలో జ‌మ్మూక‌శ్మీర్‌లోని అమ‌ర్‌నాథ్ యాత్ర మార్గంలో ఒక్క‌సారిగా భారీ వ‌ర్షం ప్రారంభ‌మైంది. కొన్ని గంట‌ల పాటు ఆ వ‌ర్షం కొన‌సాగింది. మార్గంలో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. దాంతో, యాత్రీకులు చెల్లాచెదుర‌య్యారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌లతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది గల్లంత‌య్యారు.

Amarnath Cloudburst: తీవ్ర విధ్వంసం

భారీ వ‌ర్షాల‌తో అమ‌ర్‌నాథ్ మార్గంలో సామూహిక వంట శాల‌లు, తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్లు ధ్వంస‌మ‌య్యాయి. వంట సామ‌గ్రి పాడైపోయింది. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. ఐటీబీపీ(Indo-Tibetan Border Police) సిబ్బంది స‌హాయ చ‌ర్య‌ల్లో పాలు పంచుకుంటున్నారు. అమ‌ర్‌నాథ్ గుహ‌కు ద‌గ్గ‌ర‌లోని ఎత్తైన రెండు ప్ర‌దేశాల మ‌ధ్య ఈ తాత్కాలిక క్యాంప్ ఉండ‌డంతో, పై నుంచి వ‌ర‌ద నీరు ఒక్క‌సారిగా ముంచెత్తింద‌ని ఐటీబీపీ అధికారులు వివ‌రించారు. ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా 15 మంది చ‌నిపోయార‌ని తెలిపారు. గ‌ల్లంతైన 40 మంది కోసం గాలింపు జ‌రుపుతున్నామ‌న్నారు. స‌హాయ చ‌ర్య‌ల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష జ‌రిపారు.

Amarnath Cloudburst: యాత్ర‌కు విరామం

వ‌ర్షాల బీభ‌త్సం కార‌ణంగా అమ‌ర్‌నాథ్ యాత్ర‌కు తాత్కాలికంగా విరామం ప్ర‌క‌టించారు. అయితే, ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని, గ‌ల్లంతైన వారి కోసం గాలింపు కొన‌సాగుతోంద‌ని ఐటీబీపీ అధికారులు తెలిపారు. ఒక‌వేళ వాతావ‌ర‌ణం అనుకూలిస్తే, శ‌నివారం అమ‌ర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు. వ‌ర‌ద‌ల్లో గాయ‌ప‌డిన వారిని హెలీకాప్ట‌ర్ల‌లో శ్రీన‌గ‌ర్‌కు తీసుకువ‌చ్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టివ‌ర‌కు 72 వేల మంది అమ‌ర్‌నాథుడిని ద‌ర్శించుకున్నారు.

తదుపరి వ్యాసం