తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aditya-l1: రేపే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం; ప్రతిష్టాత్మక మిషన్ కు సర్వం సిద్ధం

Aditya-L1: రేపే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం; ప్రతిష్టాత్మక మిషన్ కు సర్వం సిద్ధం

HT Telugu Desk HT Telugu

01 September 2023, 15:19 IST

google News
  • Aditya-L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రయోగం ఆదిత్య ఎల్ 1 (Aditya-L1) కు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 2 మధ్యాహ్నం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 సూర్యుడి వైపు తన ప్రయాణం ప్రారంభించనుంది. ఇందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.

ప్రయోగానికి సిద్ధంగా ఉన్న ఆదిత్య ఎల్ 1
ప్రయోగానికి సిద్ధంగా ఉన్న ఆదిత్య ఎల్ 1 (PTI)

ప్రయోగానికి సిద్ధంగా ఉన్న ఆదిత్య ఎల్ 1

Aditya-L1: సెప్టెంబర్ 2 మధ్యాహ్నం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 ను ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభించింది. ఈ ప్రయోగం విజయవంతం అవుతుందన్న విశ్వాసం తనకు ఉందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సూళ్లూరు పేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నారు.

సూర్యుడి పైకి తొలి ప్రయోగం..

ఆదిత్య ఎల్ 1 సూర్యుడి కొరోనా, సౌర తుపాన్ల వంటి ఇతర వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. ప్రయోగించిన నాటి నుంచి నిర్ధారిత కక్ష్య (Lagrange point 1)లోకి ఆదిత్య ఎల్ 1 చేరడానికి 125 రోజులు పడుతుంది. పీఎస్ఎల్వీ సీ 57 (PSLV-C57) రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపడ్తున్నారు. సూర్యుడి అధ్యయనం కోసం భారత్ చేపట్టిన తొలి ప్రయోగం ఇది. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి దిశగా భూమికి సుమారు 1.5 మిలియన్ కిమీల దూరంలోని ఎల్ 1 కక్ష్యలో ఈ వ్యోమ నౌకను ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ భూమి, మరియు సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు దాదాపు సమానంగా ఉండి, వ్యోమ నౌక బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. ఈ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం 46 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది.

ప్రత్యక్ష ప్రసారం..

ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇస్రో అధికారిక వెబ్ సైట్ https://isro.gov.in ద్వారా, అలాగే, ఇస్రో ఫేస్ బుక్ పేజ్, యూట్యూబ్ చానెల్, దూరదర్శన్ సహా పలు వార్తా చానెల్స్ ద్వారా ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆదిత్య ఎల్ 1 తరువాత గగన్ యాన్ ప్రయోగం చేపడ్తామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి ముగ్గురు వ్యక్తులను మూడు రోజుల పాటు పంపించనున్నామని వెల్లడించారు. గగన్ యాన్ కోసం ప్రభుత్వం రూ. 90.23 బిలియన్లను కేటాయించింది.

తదుపరి వ్యాసం