తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Adipurush Row: ‘‘ఖురాన్ ను తప్పుగా చూపిస్తూ డాక్యుమెంటరీ తీయగలరా?’’: ఆదిపురుష్ టీమ్ పై హై కోర్టు ఆగ్రహం

Adipurush Row: ‘‘ఖురాన్ ను తప్పుగా చూపిస్తూ డాక్యుమెంటరీ తీయగలరా?’’: ఆదిపురుష్ టీమ్ పై హై కోర్టు ఆగ్రహం

HT Telugu Desk HT Telugu

29 June 2023, 12:13 IST

google News
  • Adipurush Row: ‘ఆదిపురుష్’ సినిమా టీమ్ పై అలహాబాద్ హై కోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ దేవుళ్లు, హిందూ దేవతలను హాస్యాస్పదంగా చిత్రీకరిస్తూ సినిమాలు తీయడం ఎక్కువైపోయిందంటూ మండిపడింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Adipurush Row: రామాయణాన్ని తప్పుగా చూపి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆదిపురుష్ (Adipurush) సినిమాను నిషేధించాలని దాఖలైన పిటిషన్ పై అలహాబాద్ హై కోర్టులో విచారణ కొనసాగుతోంది. సినిమా టీమ్ పై ఇప్పటికే పలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన హై కోర్టు.. మరోసారి వారిపై కఠిన పదజాలంతో విరుచుకుపడింది.

ఖురాన్ పై తీయగలరా?

హిందూ మత విశ్వాసాలను అవమానిస్తూ, అవహేళన చేస్తూ సినిమాలు తీయడం ఆదిపురుష్ తోనే ప్రారంభం కాలేదని, గతంలో హిందూ దేవుళ్లు, హిందూ దేవతలను హాస్యాస్పదంగా చూపుతూ చాలా సినిమాలు వచ్చాయని కోర్టు వ్యాఖ్యానించింది. త్రిశూల్ సినిమాలో శివుడు త్రిశూలంతో పరుగులు పెడ్తున్న సీన్ ను గుర్తు చేస్తూ, ‘ అలా తీస్తారా? అదేమన్న జోక్ నా?’ అని ఆగ్రహంగా ప్రశ్నించింది. ఈ రోజు ఆదిపురుష్ ను వదిలేస్తే, ఇలాంటి మరిన్ని వస్తాయని వ్యాఖ్యానించింది. ‘‘ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ ను తప్పుగా చూపుతూ డాక్యమెంటరీ తీయగలరా? అలా తీస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

కోర్టుకు మతం లేదు..

అయితే, కోర్టుకు మతం ఉండదని, న్యాయస్థానం మతాతీతమైనదని కోర్టు వ్యాఖ్యానించింది. ఏ ఒక్క మతాన్ని కోర్టు సమర్ధించదని, అలాగే, ఏ ఒక్క మతాన్ని కోర్టు వ్యతిరేకించదని అలహాబాద్ హై కోర్టు లక్నో బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ రాజేశ్ సింగ్ చౌహాన్, జస్టిస్ శ్రీ ప్రకాశ్ సింగ్ ల ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని మతాలకు చెందినవారి మనోభావాలను గౌరవించాలని స్పష్టం చేసింది. ఏ మతాన్నైనా చెడుగా, తప్పుగా చూపడాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పింది.

ఎలా సమర్ధిస్తారు?

ఆదిపురుష్ సినిమాను ఎలా సమర్ధించగలుగుతున్నారని కేంద్రం తరఫున హాజరైన డెప్యూటీ సొలిసిటర జనరల్ ఎస్బీ పాండే ను కోర్టు ప్రశ్నించింది. ఈ సినిమాను సెన్సార్ బోర్డులోని ఉన్న సంస్కారవంతమైన సభ్యులు చూసి, ఆమోదించారని ఎస్బీ పాండే కోర్టుకు తెలిపారు. ఆ సమాధానంతో అవాక్కైన కోర్టు.. ‘‘ఈ సినిమాను అంత సంస్కారులైన సెన్సార్ బోర్డు సభ్యులు పాస్ చేశారంటే.. వారు చాలా గొప్పోళ్లు’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

తదుపరి వ్యాసం