ఆదిపురుష్ (Adipurush) సినిమాపై, ఆ సినిమాను రూపొందించిన వారిపై అలహాబాద్ హై కోర్టు (Allahabad High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము తీసింది రామాయణం కాదంటూ ఇచ్చిన వివరణపై స్పందిస్తూ.. ‘‘ప్రజలు తెలివి లేని దద్దమ్మలా, మూర్ఖుల్లా కనిపిస్తున్నారా?’’ అని మండిపడింది. ఇది చాలా సీరియస్ విషయమని వ్యాఖ్యలు చేసింది.
ఆదిపురుష్ (Adipurush) సినిమాను నిషేధించాలని కరుతూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం అలహాబాద్ హై కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు ఆ సినిమాపై, ఆ సినిమాను రూపొందించిన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాలోని డైలాగ్ లు చాలా దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మనకు రామాయణం పవిత్రమైన గ్రంధం. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్లేముందు రామచరిత మానస్’ను చదువుతారు. అలాంటి పవిత్ర గాధను అవమానకరంగా చిత్రిస్తారా? ’ అని కోర్టు మండిపడింది. ‘కొన్ని అంశాలను సినిమాలు అసలు టచ్ చేయకూడదు’ అని స్పష్టం చేసింది. సంభాషణల రచయిత మనోజ్ శుక్లా ను కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది.
ఇలాంటి సినిమాలు తీసి మా ఓపికను పరీక్షిస్తున్నారా? అని అలహాబాద్ హై కోర్టు ఆగ్రహంతో ప్రశ్నించింది. ఈ విషయంలో కూడా సహనం వహిస్తూ, కళ్లు మూసుకుని ఉండడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి సినిమాను సెన్సార్ బోర్డు ఎలా ఆమోదించిందని, ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డ్ ఏం చేసిందని ప్రశ్నించింది. ఈ విషయంపై వెంటనే సెన్సార్ బోర్డు నుంచి నివేదిక తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ ను ఆదేశించింది. డిస్క్లెయిమర్ వేశామన్న వాదనపై స్పందిస్తూ.. ‘‘దేశ ప్రజలు, దేశ యువత మూర్ఖులు, తెలివిలేని వారు అని భావిస్తున్నారా?’’ అని ప్రశ్నించింది. ‘‘రాముడిని, లక్ష్మణుడిని, సీతను, హనుమంతుడిని, రావణుడిని, లంకను చూపిస్తూ.. అయినా, ఇది రామాయణం కాదు అని చెప్తే నమ్మేస్తారా?’’ అని మండిపడింది.
సినిమా చూసిన తరువాత ప్రజలు శాంతి భద్రతలకు భంగం కలిగించకపోవడం, ఆస్తులను ధ్వంసం చేయకపోవడం సంతోషకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ‘సినిమాలో సీతను, హనుమాన్ ను దారుణంగా చిత్రీకరించారు. కొన్ని సీన్లయితే దారుణంగా ఏ కేటగిరీ దృశ్యాల్లా ఉన్నాయి. ఇలాంటి సినిమాలు చూడడం చాలా కష్టం’ అని వ్యాఖ్యానించింది. అభ్యంతరకర సంభాషణలను సినిమా నుంచి తొలగించారని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. డైలాగులు తీసేస్తే సరిపోదు. ఆ సీన్ల మాటేమిటి? వాటినేమి చేస్తారు? సినిమాను నిషేధిస్తే తప్ప ఈ సినిమా వల్ల మనోభావాలు దెబ్బతిన్న ప్రజలు శాంతించరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, విచారణను బుధవారానికి వాయిదా వేసింది.