Crime news: ఏడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య; మొక్కజొన్న చేనులో మృతదేహం
06 April 2024, 16:34 IST
Bihar Crime news: బిహార్ లో మరో దారుణం చోటు చేసుకుంది. ఏడు సంవత్సరాల చిన్నారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన దుండగులు, ఆ తరువాత ఆ బాలికను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం, మృతదేహాన్ని మొక్క జొన్న చేనులో పడేసి పారిపోయారు. బాలికను దారుణంగా హింసించినట్లుగా మృతదేహంపై ఆనవాళ్లున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
7-year-old girl gang raped: బిహార్ లోని పూర్ణియా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రూపౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివాసం ఉండే ఒక ఏడేళ్ల బాలిక అదృశ్యమైన మరుసటి రోజే మొక్కజొన్న చేనులో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైంది. ప్రాథమికంగా ఇది అత్యాచారం, హత్య కేసుగా కనిపిస్తోందని, అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఇది నిర్ధారణ అవుతుందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అంజాద్ అలీ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
చిత్రహింసలు
బాలికపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు, చిత్రహింసలకు గురిచేసి గొంతు నులిమి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె కళ్లు కూడా దెబ్బతిన్నాయని, తమ ఇంటి పొరుగువారే ఈ దారుణానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. గురువారం మొక్కజొన్న పొలానికి వెళ్లిన బాలిక తిరిగి రాలేదని వారు తెలిపారు. మొదట ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు నమోదు చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు.
అదుపులో ఇద్దరు నిందితులు
కుటుంబ సభ్యులు ఇచ్చిన క్లూ ఆధారంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘‘అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందం సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించింది’’ అని పోలీసులు తెలిపారు.