Karimnagar Crime: గంజాయి మత్తులో అత్యాచారం, బెట్టింగ్ లతో ఆత్మహత్యలు.. కరీంనగర్‌లో పెడదారి పడుతున్న యువత
Karimnagar Crime: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యువత పెడదారి పడుతోంది. రెండు జాఢ్యాలు చీడల్లా యువతను వెంటాడుతున్నాయి. వాటిలో ఒకటి గంజాయి. మరొకటి బెట్టింగ్...
Karimnagar Crime: జగిత్యాలలో Jagityal Minor girl బాలిక గంజాయికి narcotics బానిసై అత్యాచారానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. తక్కువ కాలంలో కోటీశ్వరులు కావాలన్న అత్యాశతో బెట్టింగ్ betting వైపు కొందరు, మత్తులో విహరించి లోకాన్ని ఏలాలన్న కోరికతో మరికొందరు గంజాయి, మత్తు పదార్ధాలకు బానిసకావడం ఆందోళన కలిగిస్తోంది.

జగిత్యాల లో గంజాయికి బాలిక బానిసై మతిస్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మత్తులో బిడ్డ ప్రవర్తనపై తండ్రీ పోలీసులకు పిర్యాదుతో చేయడంతో వెలుగులోకి వచ్చిన ఘటనతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు.
మైనర్ ను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అదుపులోకి తీసుకుని కరీంనగర్ లోని స్వదార్ హోంకు తరలించారు. జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
గంజాయిని ఎరగా చూపి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని నిర్ధారించిన పోలీసులు మైనర్ బాలుడితో పాటు ఇద్దరు యువకులు వెంకటేష్, ప్రేమ్ పై పోక్సో కేసుతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ ప్రకటించారు.
మత్తులో ప్రేమ…
టెన్త్ మధ్యలో చదువు మానేసి ఇంటి వద్ద ఉంటున్న బాలికకు 2018-19లో ప్రేమ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని అతడు ప్రేమ పేరిట బాలికను నమ్మించాడు.
ఆమెతో గంజాయి తాగించి, బలవంతంగా అత్యాచారానికి పాల్పడేవాడు. ఏడాది తర్వాత ప్రేమ్ ఆ బాలికను దూరం పెట్టగా.. ఈ క్రమంలోనే మెట్ పల్లి ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరిట లొంగదీసుకున్నాడు. బాలికకు గంజాయి తాగించి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
వెంకటేశ్ దూరమయ్యాక ఓ బాలుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అతడికి కూడా అప్పటికే గంజాయి తీసుకునే అలవాటు ఉంది. ఆ బాలుడు కూడా గంజాయిని ఎరగా చూపి బాలికను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తండ్రి అనుమానంతో ఆరా తీశాడు.
మత్తుమందుకు బానిసైన బాలిక మానసిక ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదని గుర్తించి డీ అడిక్షన్ సెంటర్ లో చేర్పించి, ట్రీట్ మెంట్ చేయించారు. తల్లిదండ్రులు, సీడబ్ల్యూసీ అధికారులు, డీ అడిక్షన్ సెంటర్ నిర్వాహకుల వాంగ్మూలం మేరకు నిందితులు బాలికకు బలవంతంగా మత్తు పదార్థాలు ఇచ్చి, వివిధ ప్రదేశాల్లో వేర్వేరు సమయాల్లో లైంగికంగా వేధించినట్టు పోలీసులు గుర్తించారు.
మొన్న ఐదుగురు...నేడు ముగ్గురు
గంజాయి మత్తుపై పోలీసులు మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ముగ్గురు, మూడు రోజుల క్రితం ఐదుగురిని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి సప్లై చేసే ముఠాకు చెందిన ఐదుగురి నుంచి పది కిలోల గంజాయి, 6 సెల్ ఫోన్ లు, రెండు బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.
రాయికల్, మల్లాపూర్ మండలాలకు చెందిన పెనుగొండ గణేష్, మాలవత్ సతీష్ కుమార్, రావులకరి నితిన్, తోట అజయ్, ఆవుల సాగర్ లు జల్సాలకు అలవాటు పడి చదువు మానేసి ఆంద్రాలోని సీలేరు నుంచి జగిత్యాల కు గంజాయి సప్లై చేసి చిన్నచిన్న ప్యాకెట్లలో జిల్లాలో విక్రయిస్తు పోలీసులకు చిక్కారు. గంజాయి మత్తుగాళ్ళు పట్టుబడ్డడం చూస్తే ఏవిదంగా ఆ దందా సాగిందో అర్థమవుతోంది.
ఆన్ లైన్ బెట్టింగ్…
ఉమ్మడి జిల్లా యువతలో కొందరు ఎదుర్కొంటున్న ప్రాణాంతక జాఢ్యం బెట్టింగ్. దీంతోపాటు ఆన్లైన్ గేమింగ్స్ కూడా, ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో ఇప్పటికే తెలివిగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రచారం ప్రారంభించారు.
ఫలానా కూలీకి బెట్టింగ్ లో ఇన్ని రూ.కోట్లు వచ్చాయని, బిచ్చగాళ్ల బిలియనీర్లు అయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం. వాస్తవానికి యువతను యాప్స్ వైపు లాగేందుకు ఇదో ఎత్తుగడ. ఇందులో వీరు ప్రతీసారి సక్సెస్ అవుతుండటం గమనార్హం.
బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేశాక.. బెట్టింగ్ కోసం డబ్బు ఎలా? చేతిలో ఉన్నా డబ్బు సరిపోదు. అందుకే ఈ సమయంలోనే ఎలాంటి సంపాదన లేకుండా రూ. లక్షల కొద్దీ లిమిట్ ఇస్తూ ఉత్తపుణ్యానికి అంటగడుతున్న క్రెడిట్ కార్డ్స్, ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ. లక్ష లు అప్పు ఇస్తున్న మనీలోన్ యాప్స్ ను ఆశ్రయిస్తున్నారు.
ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ కు చేతిలో డబ్బులు లేకున్నా.. లోన్ యాప్స్, క్రెడిట్ కార్డ్స్ ను వాడీ రూ.లక్షలు అప్పులు చేస్తున్నారు. వాటిని తిరిగి తీర్చాలన్నపుడు అసలు కథ మొదలవుతుంది. కొందరు మరోచోట అప్పుచేసి కడుతుండగా మరికొందరు పాగొట్టుకున్న చోటే రాబట్టుకునే ఉద్దేశంతో మరింత అప్పు చేసి పీకల్లోతు ఊబిలోకి కూరుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
అప్పులతో ఆత్మహత్య….
అన్ లైన్ బెట్టింగ్..లోన్ యాప్ లతో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వివాహితుల్లో కొందరు పెళ్లాం పిల్లలను చంపి తాము చావడం లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్ లో ఆన్లైన్ గేమ్స్ లో మితిమీరిన అప్పులు చేసి, తీర్చే మార్గం తెలియక ఓ యువకుడు ఆత్మ హత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు వాస్తవాలు వెల్లడించకపోయినా.. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. రూ.లక్షలు అప్పు చేస్తున్న వారంతా ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
(హిందుస్తాన్ టైమ్స్, ఉమ్మడి కరీం నగర్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం