MLA's with criminal cases : తెలంగాణలో 61శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు!
16 July 2023, 17:12 IST
MLA's with criminal cases in India : తెలంగాణలోని మొత్తం ఎమ్మెల్యేల్లో 61శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 44శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నట్టు స్పష్టం చేసింది.
తెలంగాణాలో 61శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు!
MLA's with criminal cases in India : దేశంలో ఎంత మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి? అన్న అంశంపై ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) విశ్లేషణ జరిపింది. మొత్తం మీద 44శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నట్టు తేలింది!
నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ)తో కలిసి ఈ విశ్లేషణ జరిపింది ఏడీఆర్. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి, ఈ రిపోర్టును తయారు చేశారు.
28 రాష్ట్ర అసెంబ్లీలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీల్లోని 4,001 ఎమ్మెల్యేల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. వీరిలో 1,136 మంది.. అంటే 28శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు తేలింది. మర్డర్, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి కేసులు సంబంధిత ఎమ్మెల్యేలపై ఉన్నాయి.
రాష్ట్రాలవారిగా పరిస్థితి ఇలా..
కేరళలోని 135ఎమ్మెల్యేల్లో 95మందిపై కేసులు ఉన్నాయి. ఇది 70శాతం! బిహార్లోని 242 ఎమ్మెల్యేల్లోని 161మందిపై (67శాతం), దిల్లీలోని 70మంది ఎమ్మెల్యేల్లో 44మందిపై (63శాతం), మహారాష్ట్రలోని 284మంది ఎమ్మెల్యేల్లో 175మందిపై (62శాతం), తెలంగాణలోని 118మంది ఎమ్మెల్యేల్లోని 72మందిపై (61శాతం), తమిళనాడులోని 224 ఎమ్మెల్యేల్లోని 134మందిపై (60శాతం) కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను ఎమ్మెల్యేలే స్వయంగా వారి అఫిడవిట్లలో పేర్కొన్నారు.
Telangana MLA's with criminal cases : ఇక అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసుల విషయంలో దిల్లీ టాప్లో ఉంది! దిల్లీలోని 53శాతం మంది ఎమ్మెల్యేలపై ఈ తరహా కేసులు ఉన్నాయి. బిహార్ (50శాతం), మహారాష్ట్ర (40శాతం), ఝార్ఖండ్ (39శాతం), తెలంగాణ (39శాతం), ఉత్తర్ ప్రదేశ్ (38శాతం) మంది ఎమ్మేల్యేలు అత్యంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఏడీఆర్ విశ్లేషణలో.. మహిళలపై నేరాలకు సంబంధించి ఆందోళనకరమైన విషయం బయపడింది. 114మంది ఎమ్మెల్యేలపై ఈ తరహా కేసులు ఉండగా.. వీరిలో 14మందిపై రేప్ కేసులు నమోదయ్యాయి!