కరాచీ యూనివర్సిటీలో భారీ బాంబు పేలుడు.. చైనీయులు లక్ష్యంగా దాడి
26 April 2022, 19:24 IST
కరాచీలోని యూనివర్సిటీ ఆఫ్ కరాచీలో మంగళవారం భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది. యూనివర్సిటీలోని చైనీయులు లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఈ దాడిలో ముగ్గురు చైనీయులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
బాంబు దాడిలో ధ్వంసమైన వ్యాన్
పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని ప్రతిష్టాత్మక కరాచీ యూనివర్సిటీలో మంగళవారం బాంబుదాడి జరిగింది. వర్సిటీ ప్రాంగణంలో నిలిపిన ఒక వ్యాన్‌లో ఉంచిన శక్తిమంతమైన బాంబు పేలడంతో నలుగురు చనిపోయారు. వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చైనా దేశం వారు. చైనా ప్రజలు లక్ష్యంగా ఇటీవల పాకిస్తాన్‌లో పలు దాడులు జరిగాయి.
రిమోట్ కంట్రోల్‌తో..
యూనివర్సిటీలో చైనా సహకారంతో నిర్మించిన కన్ఫ్యూషియస్ సెంటర్ దగ్గరలో ఈ బాంబు పేలుడు జరిగింది. ఈ కన్ఫ్యూషియస్ సెంటర్‌లో స్థానిక విద్యార్థులకు చైనా బాష నేర్పిస్తారు. బాంబు పేలుడులో చనిపోయిన ఇద్దరు చైనా యువతులు లక్ష్యంగానే ఈ బాంబు దాడి జరిగిందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. చైనా దేశీయులైన కన్ఫ్యూషియస్ సెంటర్ డైరెక్టర్ హ్యూవాంగ్ గ్యూపింగ్, డింగ్ ముపెంగ్, చెన్ సాలతో పాటు స్థానికుడైన వ్యాన్ డ్రైవర్ ఖాలిద్ ఈ దాడిలో చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ దాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యాన్‌లో కానీ, వ్యాన్‌కు దగ్గరలో కానీ ముందే పెట్టిన శక్తిమంతమైన బాంబును రిమోట్ కంట్రోల్తో పేల్చి ఉంటారని భావిస్తున్నామని కరాచీ పోలీస్ చీఫ్ హైదర్ వెల్లడించారు.
ఫస్ట్ ఫిమేల్ బాంబర్
కరాచీ యూనివర్సిటీలో బాంబు పేలుడు తమ పనేనని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. ఈ మిలిటెంట్ గ్రూప్ గతంలో కూడా చైనా దేశీయులు లక్ష్యంగా బలోచిస్తాన్‌లో పలు దాడులు చేసింది. ఈ దాడి చేసింది తమ మొట్టమొదటి మహిళా ఆత్మాహుతి బాంబర్ అని బీఎల్ఏ ప్రకటించింది. తన పేరు షారీ బలోచ్ అలియాస్ బ్రమ్‌ష్ అని. తమ గ్రూప్‌లో తను తొలి మహిళా సూయిసైడ్ బాంబర్ అని బీఎల్ఏ వెల్లడించింది. ఈ దాడితో తమ పోరులో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రకటించింది.