Jump Day । మీ దూకుడు.. సాటెవ్వడు.. జంపింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?!
20 July 2022, 17:10 IST
- World Jumping Day 2022 : జూలై 20న ప్రపంచ జంపింగ్ డేగా నిర్వహిస్తున్నారు. అందరూ జంప్ చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. మరి జంపింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? జంప్ చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూడండి.
World Jumping Day
ప్రతి ఏడాది జూలై 20న ప్రపంచ దుముకుడు దినోత్సవం (World Jump Day)గా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా భూమిపై ఉన్న అందరూ ఏకకాలంలో దుమికితే అది భూమి తిరిగే కక్ష్యను మార్చవచ్చు. ఇది వాతావరణ మార్పులను ప్రభావితం చేయటానికి, గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అని శాస్త్రజ్ఞుల్లో ఒక ఆలోచన ఉండేది. భూకక్ష్యను మార్చడం, పగటి వేళలను పొడిగించడం, ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికమైన వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా, జనాలు అందరూ ఒకే సమయంలో దూకటానికి World Jump Dayనే రూపొందించారు. అయితే అదేమి జరగలేదు. అంతేకాకుండా ఈ ఆలోచన కొంతవరకు అశాస్త్రీయంగా అనిపించడం, సత్యదూరంలో ఉండటం కారణంగా ప్రాథమిక ఆలోచనకు ముగింపుపడింది.
అయితే జంపింగ్ చేయటం వలన వ్యక్తులకు వారి ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జంపింగ్ చేయటం వలన కలిగే ప్రయోజనాలు తెలియజేసేందుకు ఈరోజు ఉపయోగపడుతుంది.
జంపింగ్ చేస్తే.. జీవక్రియ మెరుగుపడుతుంది, ఆక్సిజన్ ప్రసరణ పెరుగుతుంది., కండరాలు దృఢంగా మారతాయి, గుండెను ఆరోగ్యంగా ఉంటుంది, ఎముకలు బలంగా మారతాయి. అంతేకాదు జంపింగ్ చేయడం ఒక సరదా యాక్టివిటీ. కొద్దిసేపు ఉల్లాసంగా గడపటానికి కూడా జంపింగ్ చేయవచ్చు.
జంపింగ్‌లో రకాలు
జంపింగ్ లలో చాలా రకాలు ఉన్నాయి. ఇవి సరదాగా ఉంటాయి. మంచి వ్యాయామం కూడా అవుతుంది. అవేంటో తెలుసుకోండి.
ఫ్రాగ్ జంప్స్
చిన్నప్పుడు స్కూళ్లలో పిల్లలు ఫ్రాగ్ జంప్స్ చేసేవారు. దీనిని కప్ప దుముకుడు ఆట అని పిలిచేవారు. నిజానికి ఇది కూడా ఒక వ్యాయామం. ఫ్రాగ్ జంప్స్ మీ కార్డియో ఫిట్‌నెస్ స్థాయిని మెరుగుపరుస్తాయి, మీ హృదయ స్పందన రేటును పెంచుతాయి.
అయితే ఒకరిని వంగపెట్టి వారి పైనుంచి జంప్ చేయడం కాకుండా మీకు మీరుగా చేతులు భూమిపై పెట్టి చేయొచ్చు. యూట్యూబ్లో ఈ తరహా శిక్షణ వీడియోలు చాలా ఉన్నాయి.
జంపింగ్ రోప్
దీనినే స్కిపింగ్ అని కూడా అంటారు. తాడుతో రోజు ఉదయం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు స్కిపింగ్ చేయాలి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి వ్యాయామం.
జంపింగ్ జాక్స్ చేయండి
జంపింగ్ జాక్స్ ఒక మంచి వార్మప్ ఎక్సర్‌సైజ్. జిమ్ కు వెళ్లినపుడు కూడా శిక్షకులు జంపింగ్ జాక్స్ చేయమని సలహా ఇస్తారు. ఇది కూడా బరువు తగ్గటానికి చేసే ఒక మంచి కార్డియో వ్యాయామం. జంపింగ్ జాక్స్ కండరాలను సక్రియం చేస్తాయి.
ఇంకా క్రీడాకారులుగా రాణించాలంటే హై జంప్, లాంగ్ జంప్, పోల్ వాల్ట్ జంప్ ప్రాక్టీస్ చేయవచ్చు. సరదా అడ్వెంచర్స్ కోసం బంగీ జంప్, స్విమ్మింగ్ పూల్ జంప్ చేయవచ్చు.
టాపిక్