World Hypertension Day । ఇది ఒక సైలెంట్ కిల్లర్.. ఈ 6 లక్షణాలు విస్మరించొద్దు!
17 May 2022, 10:55 IST
- ఇటీవల కాలంగా అధిక రక్తపోటు సమస్య చాలా మందికి తలెత్తుతుంది. లక్షణాలు తెలియవు. మామూలు తలనొప్పి, అలసట అనిపిస్తుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
Blood Pressure - Hyper tension
అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు. ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్భాల్లో రక్తపోటు లక్షణాలు బయటపడవు. కొన్ని లక్షణాలు తెలిసినా మీరు దానిని సాధారణ అలసట, పని ఒత్తిడి లేదా శ్రమ అని కొట్టివేయవచ్చు. BP సమస్యలను విస్మరించడం ప్రాణాంతకం అని నిరూపితమైంది. ఇది గుండెపోటు, గుండె వైఫల్యం, అనూరిజం, స్ట్రోక్, జ్ఞాపకశక్తి సమస్యలు లేదా చిత్తవైకల్యానికి కారణమవుతుంది. కాబట్టి రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ఎంతో అవసరం.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.13 బిలియన్ల మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. వీరి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. స్త్రీల కంటే కూడా పురుషులలో ఎక్కువగా హైపర్ టెన్షన్ తలెత్తుతుంది. అయితే ప్రతి 5 మందిలో ఒకరు మాత్రమే దీనిని నియంత్రించుకోగలుగుతున్నారు. మిగతా వారు ప్రమాదాన్ని వృద్ధి చేసుకుంటున్నట్లు సర్వేలో తేలింది. హైపర్ టెన్షన్ లక్షణాల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది మే 17న ప్రపంచ హైపర్ టెన్షన్ అవగాహన దినోత్సవంగా పాటిస్తున్నారు.
అధిక రక్తపోటు చాలా ప్రమాదమైనది, సరైన చికిత్స తీసుకోకుండా వదిలేస్తే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది అని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసోసియేట్ డైరెక్టర్ అయిన డాక్టర్ రాజేష్ బుద్ధిరాజా పేర్కొన్నారు. అధిక రక్తపోటు లక్షణాలను ఆయన వివరించారు.
అధిక రక్తపోటు లక్షణాలు ఇలా ఉంటాయి..
1.ముక్కు నుండి రక్తస్రావం:
సాధారణంగా సైనసైటిస్ ఉన్నప్పుడు ముక్కు నుండి రక్తం కారడం అనేది జరుగుతుంది. అయితే అధిక రక్తపోటు కలిగినపుడు కూడా రక్తస్రావం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ముక్కు నుండి రక్తం కారితే వైదుడిని సంప్రదించి దానికి కారణం ఏంటో నిర్ధారించుకోవాలి.
2. తలనొప్పులు:
మీకు నిరంతరం తలనొప్పి బాధిస్తుంటే మీ రక్తపోటు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. రక్తపోటు ఉన్నవారిలో చాలా మందికి తలనొప్పి ఉంటుంది. తీవ్రమైన తలనొప్పులు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, సకాలంలో చికిత్స పొందండి.
3. అలసట:
మీరు మీ ఆఫీసు పని లేదా ఇంటి పనులను సులభంగా చేయలేకపోతున్నారా? ఏదైనా పనిచేయాలంటే అలసటగా అనిపిస్తుందా? ఇది కూడా అధిక రక్తపోటుకు సంబంధించిన ఒక లక్షణం.
4. ఊపిరి ఆడకపోవడం:
రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. అధిక రక్తపోటుకు సంబంధించి ఇది అతి సాధారణ లక్షణం.
5. అస్పష్టమైన దృష్టి:
అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తూ వస్తే అది దృష్టిపై కూడా ప్రభావం చూపిస్తుంది. దృష్టి మసకబారుతుంది. ఏదీ స్పష్టంగా కనిపించకపోతే అది అధిక రక్తపోటు ఒక లక్షణం.
6. ఛాతి నొప్పి:
అధిక రక్తపోటు ఉన్నప్పుడు ఛాతిలో నొప్పి పుడుతుంది. ఈ లక్షణం బయటపడితే వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం ఉత్తమం.
టాపిక్