World Day Against Child Labour | పసి పిల్లలు వారు.. పని పిల్లలు కాదు!
12 June 2022, 12:07 IST
- ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఉచితం అయినా కొంత మంది బాలలు మాత్రమే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది మాత్రమే బడికి వెళ్తున్నారు, ఎంతో మంది బాలలు పనికి వెళ్తున్నారు. ఈ అసమానతలకు కారణమేంటి? ఈ స్టోరీ చదవండి.
World day against child labour:
బాలల విషయంలో మనకు రెండు ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకరేమో స్కూల్ బ్యాగ్ వేసుకొని బడికి వెళ్తే, మరొకరు బరువైన బస్తాలు మోసుకుంటూ కూలి పనికి వెళ్తారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులు తమ కనీస హక్కులైన విద్య, ఆరోగ్యం, ఆటపాటలు కోల్పోయి పొట్టకూటికోసం తమ చిట్టి చేతులతో వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎంతో మంది బాలల బాల్యం ఒకరి ఇంట్లో అంట్లు తోమడంలో, రెస్టారెంటుల్లో చాయ్ సమోసాలు అందించడంలోనో మగ్గిపోతుంది. పంక్చర్ షాపుల్లో, మెకానిక్ షెడ్లలో మసకబారుతుంది.
బాలలకు కూడా ఓటు హక్కు ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే వారి ఓటు కోసమైనా వారి హక్కులను కాపాడేందుకు నేతల నుండి బలమైన రక్షణ ఉండేది. బాల కార్మికుల నిర్మూలనకు మరింత పటిష్ఠమైన చట్టాలు వచ్చేవి, బాలలు చదువుకునేందుకు, ఎదిగేందుకు మరిన్ని ప్రోత్సహకాలు లభించేవి. ఇలా సంవత్సరానికోసారి బాల కార్మికుల గురించి చర్చించుకోవాల్సిన అవసరం రాకపోయేది.
ప్రతీ ఏడాది జూన్ 12న 'ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం' గా నిర్వహిస్తారు. బాల కార్మికులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం దీని ముఖ్యఉద్దేశ్యం. "ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల నిర్మూలన, బాలలకు సార్వత్రిక సామాజిక రక్షణ" అనే థీమ్ తో ఈ ఏడాది బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం నిర్వహించాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ఐక్యరాజ్య సమితి ఆధీనంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) పిలుపునిచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా 152 మిలియన్ల మంది బాలలు ఇంకా కార్మికులుగానే ఉన్నారని, వీరిలో 72 మిలియన్ల మంది బాలలు అత్యంత ప్రమాదకర విధులను నిర్వహిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది.
బాల కార్మికులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఉద్యమాన్ని నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఐరాస 2002లో బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజున అన్ని అన్ని దేశాల ప్రభుత్వాలు, స్థానిక అధికారులు, పౌర సమాజం అలాగే వివిధ అంతర్జాతీయ సంస్థలు బాల కార్మికులను పని నుంచి విముక్తి చేసి వారికి సరైన ఆర్థిక, సామాజిక భరోసాను కల్పించే దిశగా అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని ఐరాస సూచించింది.
బాలలు కార్మికులుగా మారడానికి ప్రధాన కారణాలు ఒకటి పేదరికం కాగా, మరొకటి వారిని చేరదీసేవారు ఎవరూ లేకపోవడం. దీంతో గత్యంతరం లేక ఆ బాలలు తమ కడుపు నింపుకోవడానికి పనుల్లో చేరడం తప్ప వేరే గత్యంతరం లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించాలి, సమాజం చొరవ తీసుకోవాలి బాలల్ని పనుల్లో పెట్టుకోకుండా వారికి అందమైన బాల్యాన్ని అందించాలి. అప్పుడే బాల కార్మికులు లేని సమాజం సాధ్యమవుతుంది.