World Chocolate Day 2022 : చాక్లెట్స్ తినండి.. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి..
07 July 2022, 9:21 IST
- Chocolate Day : చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టపడతారు. చాక్లెట్ టేస్టీగా ఉండటమే కాదండోయ్.. వాటిని నిత్యం తింటే కొన్ని వ్యాధులు నయమవుతాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా చాక్లెట్ తింటే కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాక్లెట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
World Chocolate Day 2022 : పిల్లలకి చాక్లెట్స్కి విడదీయలేని సంబంధం ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు. పిల్లలు మాత్రమేనా అంటే కాదు. పెద్దలు కూడా చాక్లెట్స్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే చాక్లెట్స్ తింటే బరువు పెరిగిపోతారు.. పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలామంది భావించి.. తినాలనే కోరికను చంపుకుంటారు. కానీ డార్కె చాక్లెట్స్ తినడం వల్ల అనేక రోగాలను దూరం చేసుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా.. అపోహలను పక్కన పెట్టి.. చాక్లెట్స్ని లాగించేద్దాం.
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో..
యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయన నివేదిక ప్రకారం.. డార్క్ చాక్లెట్ గుండెపోటును నివారించడంలో, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా చాక్లెట్స్ మీ అవగాహన శక్తిని మెరుగుపరిచి.. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. FASEB జర్నల్ 2016 సంచికలో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రంలో దీని గురించి వివరించారు.
మధుమేహం ప్రమాద నివారణకై..
డార్క్ చాక్లెట్ రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ పెర్స్పెక్టివ్స్ 2016లో ప్రచురించిన సంచికలో దీనిగురించి స్పష్టంగా ఉంది.
కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండేందుకు..
చాక్లెట్ జీర్ణాశయానికి మంచిది. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుంది. చాక్లెట్ తినడం వల్ల జీవక్రియ పెరుగుతుందని హార్వర్డ్ టి. హెచ్. చైన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు నిరూపించారు. డార్క్ చాక్లెట్ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2016 జర్నల్‌లో దీని గురించి ప్రస్తావించింది.
క్యాన్సర్‌ను నివారించడానికి..
శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి చాక్లెట్ సహాయపడుతుంది. అలాగే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధనలు క్యాన్సర్‌ను నివారించడంలో చాక్లెట్స్ ముఖ్యపాత్ర పోషించాయని రుజువు చేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
మెరిసే చర్మం కోసం..
మెరిసే చర్మం కావాలంటే చాక్లెట్స్ తినాల్సిందే. ఇది UV కిరణాల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. హార్వర్డ్ టి. హెచ్. చైన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. చాక్లెట్‌లో చర్మ కాంతిని మెరుగుపరచడానికి అవసరమైన అన్ని పోషకాలు ఉన్నాయని తేల్చింది.
అన్ని పోషకాలు ఉన్నాయి..
డార్క్ చాక్లెట్ అనేక పోషకాలతో నిండి ఉంటుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్‌లో 2019లో చేసిన అధ్యయనం నివేదిక ప్రకారం డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం, కాల్షియం, కాపర్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.