Laptop in Lap: లాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా? అది చాలా ప్రమాదకరం
15 December 2023, 10:57 IST
- Laptop in Lap: లాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని వర్క్ చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరం.
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుంటే ప్రమాదం
Laptop in Lap: ఒకప్పుడు డెస్క్‌టాప్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లే విధంగా లాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో వీటి పాత్ర కీలకంగా మారింది. ఈ పోర్టబుల్ కంప్యూటర్లు రోజువారీ జీవితంలో అంతర్భాగం అయ్యాయి. కేవలం ఐటి, సాప్ట్ వేర్ రంగంలో ఉన్న వారికే కాదు, మిగతా రంగాల వారికి కూడా లాప్‌టాప్ అవసరమైన గాడ్జెట్‌గా మారింది.
ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అధికంగా ఉంది. దీంతో ఎక్కువమంది లాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇలా దీర్ఘకాలం ఒడిలో పెట్టుకుని పని చేయడం వల్ల శరీరంపై హానికరమైన ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది చర్మకాన్సర్ కి కూడా కారణం కావచ్చు అని వివరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు భాగాలకు దగ్గరగా ఈ లాప్‌టాప్ ఉండడం వల్ల అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు అధ్యయనకర్తలు.
లాప్‌టాప్ ఒడిలో పెట్టుకుంటే...
అంతే కాదు లాప్‌టాప్‌ను మీ ఒడిలో పెట్టుకొని పనిచేయడం వల్ల వెన్ను, మెడ ఒకే కోణంలో వంగి ఉండాల్సి వస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో నొప్పి పెరిగిపోతుంది. అందుకే టేబుల్ పైనే ఉంచి పనిచేయడం అనేది ఉత్తమ మార్గంగా చెబుతున్నారు అధ్యయనకర్తలు. లాప్‌టాప్‌లు విభిన్న ఫ్రిక్వెన్సీలలో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్‌ను విడుదల చేస్తాయి.వీటిని EMF అని పిలుస్తారు. ఇవి మన ఆరోగ్యానికి చాలా హానికరం. లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం వల్ల చర్మంపై, అవయవాలపైనే ప్రభావం పడుతుంది. లాప్‌టాప్ నుంచి వచ్చే ఎలెక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ విడుదలవుతాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి.
అధ్యయనాల ప్రకారం లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఉపయోగించే స్త్రీలకు... పిల్లలు పుట్టడం కష్టంగా మారుతుంది. అలాగే లాప్‌టాప్‌ను దగ్గరగా పెట్టుకొని పని చేసే గర్భిణీ స్త్రీలలో గర్భస్థ శిశువులపై ప్రభావం పడవచ్చు. అలాగే మగవారిలో వీర్యకణాలపై ఈ లాప్‌టాప్ వేడి ప్రభావం పడుతుంది. దీని వల్ల వారి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి ఎవరైనా సరే దీర్ఘకాలం పాటు లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పని చేయడం మంచిది కాదు. టేబుల్ పై పెట్టి పని చేయడమే కరెక్ట్, లేదా లాప్‌టాప్ షీల్డ్‌ను ఉపయోగిస్తే రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
టాపిక్