Women Health: పెళ్లయిన మహిళలకు హైబీపీ త్వరగా వచ్చేస్తుందట, ఎందుకో తెలుసా
31 January 2024, 7:00 IST
- Women Health:పెళ్లి చేసుకున్నాక మహిళలకే హైబీపీ త్వరగా వచ్చేస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది. ఎందుకో కూడా ఆ అధ్యయనం వివరిస్తుంది.
మహిళల్లో హైబీపీ ఎందుకు వస్తుంది?
Women Health: మన ఆరోగ్యం గురించి నిత్యం అధ్యయనాలు జరుగుతూనే ఉంటాయి. ఆ అధ్యయన ఫలితాలు బయటపెడుతూ ఉంటారు పరిశోధనకర్తలు. అలాంటి అధ్యయనంలో ఇప్పుడు ఒక కొత్త విషయం తెలిసింది. పెళ్లికాని మహిళలతో పోలిస్తే పెళ్లయిన మహిళలకు హైబీపీ త్వరగా వచ్చేస్తుందట. ఈ అధ్యయనాన్ని దాదాపు నాలుగేళ్ల పాటు నిర్వహించారు. ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, చైనా దేశాల్లోని 10,000 మందికి పైగా జంటలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అమెరికాకు చెందిన పరిశోధనకర్తలు ఆ జంటల హృదయ స్పందన రేటును, ఆల్కహాల్ వినియోగాన్ని, బరువును, శారీరక శ్రమను, ఇలా అన్ని డేటాలను తీసుకొని పరిశీలించారు. దాని ద్వారా పెళ్లయిన మహిళలకు ఇతరులతో పోలిస్తే హైబీపీ త్వరగా వచ్చే అవకాశం ఉన్నట్టు తేలింది.
ఎందుకు వస్తుంది?
హైబీపీ లేదా అధిక రక్తపోటు అనేది శరీరంలోని ధమనులను ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. ఇది గుండెను ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తాజా అధ్యయనంలో పెళ్లయిన మహిళలకు త్వరగా హై బీపీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా భర్తకు హైబీపీ ఉంటే భార్య కూడా వచ్చే అవకాశం ఎక్కువ. ఇది నాన్ కమ్యూనికేషన్ వ్యాధి అయినప్పటికీ వారితో జీవించే భాగస్వామికి ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువే. జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. భర్తలకు అధిక రక్త పోటు ఉంటే భార్యలకు కూడా అది వచ్చే అవకాశం 19 శాతం ఎక్కువని తేలింది. మన దేశమే కాదు అమెరికా, ఇంగ్లాండ్, చైనాలో కూడా ఇదే సహ సంబంధం కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.
భార్యాభర్తలిద్దరూ ఒకే విధమైన అభిరుచులు, జీవన విధానం, జీవనశైలి అలవాట్లు కలిగి ఉండడం వల్ల వారి ఆరోగ్య ఫలితాలు కూడా ఒకేలా ఉన్నట్టు తెలుస్తున్నాయి. 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న జంటలలో 35 శాతం మందిలో అధిక రక్తపోటు ఉన్నట్టు తేలింది. మహిళలకు హైబీపీ లేకపోయినా పెళ్లయిన తర్వాత వారి భర్తలకు హైబీపీ వస్తే వీరికి కూడా వచ్చే అవకాశం పెరిగిపోతోంది.
అధికరక్తపోటు వచ్చిన వారిలో తలనొప్పి రావడం, గుండెదడ వంటివి తరచూ కనిపిస్తాయి. వీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. సోడియం ఉన్న పదార్థాలను తగ్గించాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తినాలి. తరచూ వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం వంటివి మానేయాలి. బరువు పెరగకుండా అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే రక్తపోటు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.