Weight Loss: జిమ్‍లో చేరకుండా, స్ట్రిక్ట్ డైట్ ప్లాన్ లేకుండా 20 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఆమె పాటించిన రూల్స్ ఇవే
06 November 2024, 12:30 IST
- Weight Loss Journey: ఓ ఫిట్‍నెస్ ఇన్‍ఫ్లుయెన్సర్ 20 కేజీల బరువు తగ్గారు. జిమ్‍కు వెళ్లకుండానే ఎలా ఇంత బరువు తగ్గానో ఆమె వెల్లడించారు. పాటించిన ఆరు రూల్స్ గురించి వెల్లడించారు.
Weight Loss: జిమ్‍లో చేరకుండా, కఠినమైన డైట్ లేకుండా 20 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఆమె పాటించిన రూల్స్ ఇవే
ఇంట్లో చేసుకున్న ఫుడ్ తింటూనే.. జిమ్‍కు వెళ్లకుండానే ఓ ఫిట్‍నెస్ ఇన్‍ఫ్లుయెన్సర్ ఏకంగా 20 కేజీల బరువు తగ్గారు. తన వెయిట్ లాస్ జర్నీ గురించి రిధి శర్మ వెల్లడించారు. ఇన్‍స్టాగ్రామ్‍లో ఈ విషయాలను షేర్ చేశారు. తాను ఆరు రూల్స్ పాటించినట్టు వివరించారు. జిమ్‍కు వెళ్లకుండా, కఠినమైన డైట్ ప్లాన్ పాటించకుండానే తాను బరువు తగ్గానని వెల్లడించారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆమె చెప్పిన రూల్స్ ఇవే
ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ, ఇంట్లో చేసి ఫుడ్ తింటూ తాను బరువు తగ్గానని రిధి శర్మ వెల్లడించారు. ఒకప్పుడు తాను పీసీఓఎస్‍కు చికిత్స కూడా తీసుకున్నట్టు వెల్లడించారు. తాను బరువు తగ్గేందుకు పాటించిన రూల్స్ గురించి వివరించారు. తాను ప్రతీ రోజు 30 నుంచి 40 నిమిషాల పాటు ఇంట్లో వర్కౌట్స్ చేశానని చెప్పారు. వారంలో 5 నుంచి 6 రోజులు వర్కౌట్స్ చేసినట్టు వెల్లడించారు. స్ట్రెంత్ ట్రైనింగ్, పైలేట్స్ కూడా ఎక్సర్‌సైజ్‍లో ఉండేవని తెలిపారు. ఓ యోగా మ్యాట్, రెండు డంబెల్స్, ఓ రెస్టెంట్ బ్యాండ్‍తో తాను వెయిట్ లాస్ జర్నీని మొదలుపెట్టానని చెప్పారు.
తినడం ఇలా..
బరువు తగ్గేందుకు తాను కఠినమైన డైట్ ప్లాన్ ఏదీ విధించుకోలేదని రిధి శర్మ వెల్లడించారు. ఇంట్లో చేసిన సింపుల్ ఫుడ్ తిన్నానని అన్నారు. అయితే, పోషకాలు ఉండే ఆహారం తిన్నట్టు వెల్లడించారు. “నేను నిర్దిష్టమైన డైట్ ప్లాన్ ఏదీ ఫాలో కాలేదు. నాకు ఏది తినాలనిపిస్తుందో అదే తీసుకున్నా. కానీ నేను ఎంత తినాలనే దానిపై ఫోకస్ పెట్టా. ప్రోటీన్ ఎక్కువగా ఉండే టోఫు, పన్నీర్, సోయా, కాయధాన్యాలు, బీన్స్ తిన్నా. వాటి వల్ల ఎనర్జీతో ఉండొచ్చు. కడుపు నిండుగా ఉన్నట్టు ఫీల్ ఉంటుంది” అని రిధి శర్మ వివరించారు.
వీటికి దూరం
తీపి పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్‍లకు దూరంగా ఉన్నట్టు తన మరో రూల్‍ను రిధి వెల్లడించారు. అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారమే తిన్నానని చెప్పారు.
ప్రతీ రోజు యాక్టివ్‍గా ఉండేందుకు, క్యాలరీలు బర్న్ చేసేందుకు తాను 7 వేల నుంచి 10 వేల అడుగులు నడిచానని రిధి తెలిపారు. నడక అనేది గేమ్ ఛేంజర్ అని చెప్పారు. “విశ్రాంతి తీసుకోవాలని అనుకున్న రోజుల్లోనూ.. నేను వీలైనంత ఎక్కువగా నడిచేందుకు ప్రయత్నించా. ఇది ఓ గేమ్ ఛేంజర్” అని రిధి తెలిపారు.
సరైన నిద్ర
వెయిట్ లాస్ జర్నీలో నిద్ర విషయంలో తాను రాజీ పడలేదని రిధి శర్మ వెల్లడించారు. ప్రతీ రోజు 7 నుంచి 8 గంటలు నిద్రించానని తెలిపారు. “ప్రతీ రాత్రి 7-8 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా నేను జాగ్రత్త పడ్డా. బరువు తగ్గే నా ప్రయాణంలో, రికవరీలో ఇది కీలకమైన పాత్ర పోషించింది” అని రిధి వివరించారు.
రిధి శర్మ ఈ రూల్స్ పాటించి 20 కేజీల బరువు తగ్గారు. అయితే, ప్రతీ ఒక్కరి శరీర పరిస్థితులు, ఆరోగ్యం, పరిమితులు వేర్వేరుగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని మీరు అనుకుంటున్నప్పుడు మీకు తగ్గట్టుగా అన్నీ ప్లాన్ చేసుకోవాలి. వెయిట్ లాస్ జర్నీని మొదలుపెట్టే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకుంటే మేలు.