తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Knee Arthritis: మోకాలి ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందండిలా

knee arthritis: మోకాలి ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందండిలా

HT Telugu Desk HT Telugu

21 November 2022, 15:02 IST

google News
    • Knee arthritis: మోకాలి ఆర్థరైటిస్ నిరంతరం నొప్పితో బాధపడేలా చేస్తుంది. కొన్ని లైఫ్‌స్టైల్ మార్పులతో దీని నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Knee arthritis: మోకాలి ఆర్థరైటిస్ సర్వసాధారణమైన ఆర్థరైటిస్‌లలో ఒకటి
Knee arthritis: మోకాలి ఆర్థరైటిస్ సర్వసాధారణమైన ఆర్థరైటిస్‌లలో ఒకటి (Pixabay)

Knee arthritis: మోకాలి ఆర్థరైటిస్ సర్వసాధారణమైన ఆర్థరైటిస్‌లలో ఒకటి

ఆర్థరైటిస్ రోజువారీ కదలికను పరిమితం చేస్తుంది. అప్పుడప్పుడు తీవ్రంగా బాధించే నొప్పిని కలిగిస్తుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారిలో కీళ్ల వాపు సర్వసాధారణం. దురదృష్టవశాత్తూ ఈ పరిస్థితికి నివారణ లేదు. ఆర్థరైటిస్‌ను మేనేజ్ చేయడానికి ఉత్తమ మార్గాలు బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన తినే అలవాట్లు మెరుగుపరుచుకోవడం, చురుకుగా ఉండటం. నొప్పి సమయంలో హీటింగ్ ప్యాడ్‌, ఐస్ ప్యాక్‌లను ఉపయోగించడం వంటి కొన్ని జీవనశైలి మార్పులను చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు.

మోకాలి ఆర్థరైటిస్ అనేది అత్యంత సాధారణ ఆర్థరైటిస్ రకాల్లో ఒకటి. ఫ్యామిలీ హిస్టరీ, ఎముక అసాధారణతల వల్ల మాత్రమే కాకుండా, మోకాలి కీలుకు కలిగిన గాయం కొన్నిసార్లు మోకాలి ఆర్థరైటిస్‌కు దారితీస్తుంది. వయసు పెరిగే కొద్దీ మోకాలి ఎముకల చుట్టూ ఉండే మృదులాస్థి తగ్గిపోయి, ఎముకలు ఒకదానికొకటి రుద్దుకోడంతోపాటు నొప్పి, మంటను కలిగించడం వల్ల మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ రావడం సర్వసాధారణం.

‘నొప్పి, వాపు, స్టిఫ్‌నెస్ ఆర్థరైటిస్ లక్షణాలు. శరీరంలోని ఏదైనా జాయింట్‌ను ఇవి ప్రభావితం చేయవచ్చు. అయితే మోకాలు చాలా తరచుగా వీటి ప్రభావానికి లోనవుతుంది. జన్యువులు, ఎముకల్లో అసాధారణతలు, వృద్ధాప్యం, గాయాలు మొదలైనవి మోకాలి ఆర్థరైటిస్‌కు కొన్ని అనివార్య కారణాలు. మోకాలి ఆర్థరైటిస్‌ను పూర్తిగా నివారించే మార్గం లేనప్పటికీ, లక్షణాలను తగ్గించడానికి, వ్యాధి పురోగతిని తగ్గించడానికి చేయగలిగే మార్పులు ఉన్నాయి’ అని ఫోర్టిస్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ నిపుణులు డాక్టర్ వినయ్ కుమారస్వామి చెప్పారు.

మోకాలి ఆర్థరైటిస్‌ నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్ కుమారస్వామి సూచించిన కొన్ని జీవనశైలి మార్పులు ఇవే.

1. బరువును అదుపులో ఉంచండి

ఒక మోస్తరు బరువు ఉన్నవారి కంటే అధిక శరీర బరువు కలిగిన వ్యక్తులు 4.55 రెట్లు ఎక్కువగా మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌ కలిగి ఉంటారు. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసేందుకు తగిన ఆహారం, వ్యాయామం సహాయపడుతాయి.

2. వ్యాయామం

వ్యాయామం చేయడం వల్ల మీ కీళ్లపై అధిక బరువు తగ్గుతుంది. అలాగే వాటిని చుట్టుముట్టి ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది. మీ ఫిట్‌నెస్ స్థాయికి అనువైన కార్యకలాపాలలో పాల్గొనండి. మీరు ఇంతకు ముందెన్నడూ వ్యాయామం చేయకపోతే, నెమ్మదిగా ప్రారంభించండి. మీరు సిద్ధమవుతున్న కొద్దీ క్రమంగా తీవ్రతను పెంచండి.

3. హాని జరగకుండా కాపాడుకోండి.

మీరు క్రీడలు ఆడుతున్నప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు మీ కీళ్లు గాయపడే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి మీ మృదులాస్థిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. గాయపడినప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోండి.

4. మీ కీళ్లను జాగ్రత్తగా చూసుకోండి

భారీ శిక్షణ, స్క్వాటింగ్ (కుర్చీ వేయడం), మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం వంటి పనులు మోకాలి కీళ్లపై ప్రభావం చూపుతాయి. ఇది మోకాలి ఆర్థరైటిస్‌కు 5 రెట్లు ఎక్కువ కారణమవుతుంది.

5. ధూమపానం మానేయండి

ధూమపానం మానేయడం వల్ల గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా కీళ్లనొప్పులు రాకుండా కాపాడుతుంది.

6. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించండి

ఆర్థరైటిస్, మధుమేహం సహజీవన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్ ఉన్నవారిలో మధుమేహం ఉండే అవకాశం 61 శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల శరీరం నిరంతరం ఇన్‌ఫ్లమేషన్ కలిగి ఉంటుంది. కీళ్లలో రియాక్టివ్ ఆక్సిజన్ అభివృద్ధి చెందుతుంది. ఇది ఇన్‌ఫ్లమేటరీ ప్రోటీన్లయిన సైటోకిన్స్ ఉత్పత్తిని పెంచుతుంది.

ఆర్థరైటిస్ తీవ్రతరం కాకుండా ఎలా ఆపాలి

జాగింగ్, టెన్నిస్ వంటి అధిక-ప్రభావ కార్యకలాపాలకు బదులుగా స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి తక్కువ-ప్రభావ కార్యకలాపాలను చేయండి. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయండి.

- ప్రభావిత ప్రాంతంలో హాట్ ప్యాక్ లేదా ఐస్ ప్యాక్ అప్లై చేయాలి.

- బలం, చలనాన్ని మెరుగుపరిచే ఫిజికల్ థెరపీ వ్యాయామాలు చేయాలి.      

- షాక్ అబ్సర్బర్స్ కలిగి ఉన్న షూ ధరించాలి.

- వైద్యుల సలహా మేరకు కొన్ని ఔషధాలు తీసుకోవాలి.

మోకాలి ఆర్థరైటిస్ విషయంలో ఏమి చేయాలి

‘మోకాలి ఆర్థరైటిస్‌లో మందులు, ఫిజియోథెరపీ ఉపయోగపడవు. ఈ రోగులు పూర్తిగా కోలుకోవడానికి జాయింట్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్లు చేయించుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు రోగులు శస్త్రచికిత్స జరిగిన రోజే నడిచేందుకు వీలున్న శస్త్రచికిత్సలు. కొన్ని వారాలలోనే వాకర్ లేకుండా నడవగలుగుతారు. అధునాతన శస్త్రచికిత్స, అనస్థీషియా పద్ధతులతో అటువంటి శస్త్రచికిత్సలలో సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి’ అని డాక్టర్ కుమారస్వామి చెప్పారు.

టాపిక్

తదుపరి వ్యాసం