తెలుగు న్యూస్  /  Lifestyle  /  Why, Spotting Pala Pitta Bird Is Believed Auspicious On Dusshera?

నీలివర్ణంతో తళుక్కునే మెరిసే పాలపిట్టకు ఎన్నో ప్రాముఖ్యతలు, దసరా రోజు కనిపిస్తే?

Manda Vikas HT Telugu

28 February 2022, 18:07 IST

    • పాలపిట్టను ఇండియన్ రోలర్, నీలకంఠ పక్షి ఇలా ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లతో కూడా పిలుస్తారు. విజయదశమి రోజున ఉదయం వేళ కానీ, సాయంత్రం పూట కానీ లేదా ఏ సమయంలోనైనా పాలపిట్ట కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు.
Palapitta Bird
Palapitta Bird (Stock Photo)

Palapitta Bird

హిందువుల ముఖ్యమైన పండగల్లో దసరా పండగ ఒకటి. ఈ రోజున పాలపిట్టను చూడటం అనాది కాలం నుంచి ఒక అనవాయితీగా వస్తుంది. పాలపిట్టను ఇండియన్ రోలర్, నీలకంఠ పక్షి ఇలా ప్రాంతాన్ని బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు. విజయదశమి రోజున ఉదయం వేళ కానీ, సాయంత్రం పూట కానీ ఏ సమయంలోనైనా పాలపిట్ట కనిపిస్తే అదొక అదృష్టంగా భావిస్తారు. దీనివల్ల రాబోయే కాలంలో అన్నీ శుభాలే జరుగుతాయని చాలా మంది బలంగా నమ్ముతారు. దసరాను అతిపెద్ద పండుగగా జరుపుకునే తెలంగాణ రాష్ట్రం సహా, ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రజలు దసరా పండగరోజు పాలపిట్టను చూసేందుకు ఎంతో ఉత్సాహం కనబరుస్తారు.

పాలపిట్టనే ఎందుకు చూస్తారు

దశమి రోజున పాలపిట్టను చూడటం వెనక ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముడు లంకకు వెళ్లే సమయంలో ఆయనకు ఈ పాలపిట్ట ఎదురవుతుంది, దీనిని రాముడు అప్పుడు శుభశకునంగా భావించారని చెప్తారు . అనంతరం రాముడు యుద్ధంలో రావణసంహారం చేసి లంకను జయించే రామాయణ గాధ మనకు తెలిసిందే.

మరొక కథ-

 బ్రాహ్మణ సంహారం పాపం అని మన హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. రావణుడు బ్రాహ్మణుడే కాక శివునికి మహాభక్తుడు కూడా. శ్రీరాముడు రావణుడిని సంహరించినప్పుడు, ఆయనకు బ్రాహ్మణ హత్య పాపం అంటుకుంటుంది. దీంతో ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి శ్రీరాముడు తన అనుజుడు లక్ష్మణుడితో కలిసి ముల్లోకాలను ఏలే శివుడ్ని పూజిస్తారు. ఈ సమయంలో శివుడు నీలకంఠ పక్షిగా భూమిపైకి వచ్చి, శ్రీరాముడ్ని రాముడ్ని పాప విముక్తిడిని చేశాడు అనే కథ ప్రచారంలో ఉంది.

పాండవులు వనవాసం ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా వారికి పాలపిట్ట ఎదురుపడిందట. ఆ రోజు విజయదశమి కావడం, అప్పట్నించీ పాండవులకు అన్నీ విజయాలే కలిగాయని చెప్తారు.

పాలపిట్ట పరమశివుని ప్రతిరూపం

ఇలా ఒక్కొక్క కథ పాలపిట్ట ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దీనిని ఆ పరమశివుని ప్రతిరూపంగా భావిస్తారు, భూమి మీదకు వచ్చిన దేవదూతగా భావిస్తారు. దసరా రోజు పాలపిట్ట కనిపించినపుడు దానికి వినమ్రంగా నమస్కరించి ఏదైనా కోరుకుంటే అంతా శుభం జరుగుతుందనే నమ్మకం ఉంది. దీనిని దసరా నాడు పాలపిట్ట దర్శనం ఒక సంప్రదాయంగా వస్తుంది.

గోధుమ, నీలివర్ణ మేలవింపుతో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పక్షిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపక్షిగా గుర్తించి తగిన గౌరవమిచ్చింది. ఒక్క తెలంగాణకే కాక, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, కర్ణాటక, బీహార్ రాష్ట్రాలకు కూడా తమ రాష్ట్రపక్షిగా పాలపిట్టకు గుర్తింపు ఉంది.

రైతునేస్తం ఈ పక్షి

మైదాన ప్రదేశాలలో, పంట పొలాల్లో, పండ్ల తోటలు, ఉద్యానవనాలలో తిరుగాడే ఈ పక్షి పంటకు పట్టిన తెగుళ్లను, తోటలకు నష్టం చేకూర్చే క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. రైతులకు, పంటలకు ఈ పక్షి పరోక్షంగా లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి దీనిని ఎకో ఫ్రెండ్లీ పక్షి, రైతునేస్తంగా కూడా అభివర్ణిస్తారు.

అయితే ఇన్ని ప్రాముఖ్యతలు కలిగిన నీలకంఠ పక్షి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కొందరు పంజరాల్లో బంధించి క్యాష్ చేసుకుంటున్నారని ఫిర్యాదులు చేయటంతో ప్రభుత్వాలు స్పందించి వీటిని బంధించడంపై నిషేధం విధించాయి. 

 చివరగా చెప్పేదేంటంటే పాలపిట్టను స్వేచ్ఛగా ఎగురనిద్దాం, అవి ఎగురుతూ అప్పుడప్పుడు తళుక్కున మెరిసినపుడే చూసే మన కళ్లకు అందం, ఆనందం.