తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు?

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు?

Haritha Chappa HT Telugu

09 May 2024, 18:00 IST

    • Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని పురాణాలు చెబుతూ ఉంటాయి. ఇలా ఈ రోజున బంగారం ఎందుకు కొనాలి? ఈ ఆచారం ఎందుకు మొదలైంది?
అక్షయ తృతీయ
అక్షయ తృతీయ (Unsplash)

అక్షయ తృతీయ

Akshaya Tritiya 2024: ప్రతి ఏడాది వచ్చే అత్యంత శుభ సమయం అక్షయ తృతీయ. అక్షయ తృతీయను దేశవ్యాప్తంగా చాలా వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ వేడుకను అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయలో వస్తుంది. వ్యాపారం వంటి శుభకార్యాలను ప్రారంభించేందుకు అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా ఉంది అక్షయ తృతీయ. అక్షయ అంటే శాశ్వతమైనది, నాశనం కానిది అని అర్థం. అందుకే ఈ రోజున విలువైన లోహాలు, ఆస్తులను కొనుగోలు చేస్తారు ప్రజలు. వాటి విలువ పెరుగుతూనే ఉంటుందని వారి నమ్మకం.

అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలను కొనుగోలు చేసే సంప్రదాయం భారతీయ ప్రజల్లో ఉంది. పంచాంగం ప్రకారం ఈ ఏడాది మే 10న అక్షయ తృతీయ వచ్చింది. మే 10న ఉదయం 5:33 గంటల నుంచి మధ్యాహ్నం 12:18 గంటల వరకు పూజా ముహూర్తం ఉంది.

అక్షయ తృతీయకు బంగారం ఎందుకు కొంటారు?

అక్షయ తృతీయ పర్వదినం వెనుక ఒక కథ ఉంది. కుబేరుడికి శివుడు, బ్రహ్మ అనుగ్రహం లభించిందని, సంపదను పరిరక్షించే బాధ్యతను ఆయనకు అప్పగించారని చెప్పుకుంటారు. అందువల్ల కుబేరుడి పేరుతో బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే విలువ పెరుగుతుందని నమ్ముతారు.

ఇదే రోజున శ్రీకృష్ణుడు… వనవాసంలో ఉన్న పాండవులను సందర్శించాడనే కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆ రోజున ద్రౌపది విందు ఏర్పాటు చేయనందుకు అతని కాళ్ల మీద పడి క్షమించమని కోరిందని చెబుతారు. శ్రీకృష్ణ భగవానుడు ఆమెను ఆశీర్వదించి, గిన్నె నుంచి నుండి ఒక మెతుకును తీసుకొని అక్షయపాత్రను ద్రౌపదికి ఇచ్చినట్టు కథనం. అక్షయ పాత్ర నుంచి వచ్చే ఆహారానికి అంతు ఉండదు. కోరినప్పుడల్లా అక్షయ పాత్ర అడిగినవన్నీ అందిస్తూనే ఉంటుంది. అందువల్ల, ప్రజలు ఈ రోజున బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయడం ప్రారంభించినట్టు చెబుతారు. అక్షయ తృతీయ రోజు కొన్న వస్తువుల విలువ ఎప్పటికీ తగ్గదని నమ్ముతారు. ఈ రోజున ఏది కొన్నా అది ప్రజలకు ఎల్లప్పుడూ ప్రయోజనం చేకూరుస్తుందని నమ్ముతారు.

అక్షయ తృతీయ నాడు చేసే పనులు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తుందని అంటారు. ఈరోజున గంగా, యమునా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తే మంచిదని చెబుతారు. నీరు, ఆహారం, దుస్తువులు వంటి ఈ రోజున దానం చేస్తే చాలా శుభప్రదం. అక్షయ తృతీయ రోజున పార్వతీ దేవికి పెరుగు, పాలు, గోధుమలు, శెనగలు, చెరకు, బంగారం, పాయసం వంటి వాటితో పూజిస్తే మంచిది. సత్య యుగం, త్రేతా యుగం వంటివి అక్షయ తృతీయ రోజునే ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. ద్వాపరయుగం కూడా ఈ రోజునే ముగిసిందని నమ్మకం.

టాపిక్

తదుపరి వ్యాసం