Breast Cancer: మహిళల్లో ఎవరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ? వీరు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
20 July 2024, 8:00 IST
- Breast Cancer: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తోంది. మహిళలు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం పట్టించుకుంటారు కానీ తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. కానీ, రొమ్ము క్యాన్సర్ లక్షణాలను మాత్రం ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిందే.
రొమ్ము క్యాన్సర్ ఎవరికి వస్తుంది?
భారతదేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అధ్యయనాల ప్రకారం, ప్రతి నాలుగు నిమిషాలకు ఒక భారతీయ మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్టు తెలుస్తోంది. భారతదేశంలోని మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ ను ప్రారంభ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. మొదటి, రెండో దశలో గుర్తించినప్పుడు స్త్రీ జీవితం పూర్తిగా సురక్షితం. సరైన సమయంలో సరైన చికిత్సతో, స్త్రీ తన సాధారణ జీవితాన్ని గడపవచ్చు.
ప్రతి స్త్రీ స్వయం పరీక్షల ద్వారా రొమ్ముల్లో గడ్డల్లాంటివి ఉన్నాయేమో పరీక్షించుకోవాలి. కేవలం రొమ్ముల్లోనే కాదు, చంకల దగ్గర ఉన్న ప్రాంతంలో గడ్డలా తగిలితే దాన్ని తేలికగా తీసుకోకూడదు. ప్రతి గడ్డ క్యాన్సర్ కాకపోవచ్చు, కానీ పరీక్షలు చేయించుకుని ఆ విషయాన్ని నిర్ధారించుకుంటే మంచిది. క్యాన్సర్ గడ్డ సాధారణంగా నొప్పిలేకుండా ఉంటుంది. కానీ అవి పెరిగేకొద్దీ నొప్పిని కలిగిస్తాయి.
చనుమొనల నుండి లీకేజీ
తల్లి అయిన తర్వాత చనుమొన నుండి పాలు రావడం సహజం. కానీ తల్లి కాకపోయినా కూడా చనుమొనల నుంచి ద్రవాలు లీక్ అవుతుంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ లీక్ అనేక రకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు చనుమొన నుండి రక్తం కూడా కారుతుంది. ఇటువంటి లక్షణాలు క్యాన్సర్ లక్షణంగా పరిగణిస్తారు. కాబట్టి ఇలాంటి స్రావాలు వస్తూ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
రెండు వక్షోజాల పరిమాణంలో కొద్దిగా తేడా ఉన్నా కూడా తేలికగా తీసుకోకూడదు. అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఇది కాకుండా, రొమ్ము చుట్టు ఉన్న చర్మం ఎర్రబడటం, దానిలో దురద రావడం కూడా రొమ్ము క్యాన్సర్ సంకేతమే. చనుమొన లోపలకు కుంగిపోయినట్టు ఉన్నా కూడా అజాగ్రత్తగా ఉండకూడదు.
ఎవరికి ఎక్కువ ప్రమాదం?
రొమ్ము క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలను ప్రభావితం చేస్తోంది. గతంలో 40 ఏళ్లు దాటిన మహిళలకు ఈ ముప్పు ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చిన్న వయసులో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి అందరూ మీ రొమ్ము పరీక్షను మీ సొంతంగా చేసుకోవాలి. మీ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే, వారి వారసులు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మహిళలు 30 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి ఒకసారి మామోగ్రఫీని పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.
కారణాలు ఏమిటి?
అనేక రకాల క్యాన్సర్ల మాదిరిగానే, రొమ్ము క్యాన్సర్‌కు కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. అది అంత వేగంగా ఎందుకు వ్యాప్తి చెందుతోందో కూడా అర్థం కావడం లేదు. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి… క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయని అధ్యయనాలు నిరూపించాయి. దీనితో పాటు, జుట్టు చికిత్సలో ఉపయోగించే రసాయనాలు, సౌందర్య సాధనాలు, డియోడరెంట్లలో కనిపించే కొన్ని ప్రాణాంతక రసాయనాలు కూడా ఈ రకమైన క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయి.
రొమ్ము క్యాన్సర్ ను సకాలంలో గుర్తిస్తే సులభంగా జయించవచ్చు. రొమ్ము క్యాన్సర్ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మొదటి, రెండో దశల్లో ఈ క్యాన్సర్ ను గుర్తిస్తే నూటికి నూరు శాతం నయం చేయవచ్చు. మామోగ్రఫీ, ఎంఆర్ఐ, ఎఫ్ఎంసిజి, కొన్ని రక్త పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్ గుర్తిస్తారు. పీరియడ్స్ ఏడో రోజున మీ రొమ్మును అద్దంలో జాగ్రత్తగా చూసుకోవాలి. దీనితో పాటు ఒక చేత్తో పైకెత్తి మరో చేత్తో రొమ్ముల చుట్టూ తిప్పి ఏదైనా గడ్డ ఉందేమో చూసుకోవాలి. ఇలా ప్రతి నెలా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా గడ్డ లాంటిది కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.