తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అబద్ధం.. అంతా అబద్ధం.. మీ చుట్టూ ఇలాగే జరుగుతోందా?

అబద్ధం.. అంతా అబద్ధం.. మీ చుట్టూ ఇలాగే జరుగుతోందా?

HT Telugu Desk HT Telugu

05 April 2023, 9:34 IST

google News
    • pseudologia fantastica: కొంతమంది ఏ ప్రయోజనం లేకుండానే, అసలు వారికి తెలియకుండానే ఆసంకల్పితంగా, అలవోకగా అబద్ధాలు చెప్పేస్తారని మీకు తెలుసా.. అదొక మానసిక అపసవ్యత అని తెలుసా?.. దీనినే సూడోలిజియా ఫెంటాస్టికా లేదా కంపల్సివ్ లైయింగ్ అంటారు.
అలవోకగా అబద్ధాలు చెప్పడం ఒక మానసిక అపసవ్యత (ప్రతీకాత్మక చిత్రం)
అలవోకగా అబద్ధాలు చెప్పడం ఒక మానసిక అపసవ్యత (ప్రతీకాత్మక చిత్రం) (pexels)

అలవోకగా అబద్ధాలు చెప్పడం ఒక మానసిక అపసవ్యత (ప్రతీకాత్మక చిత్రం)

దొండ పండు లాంటి పెదవే నీది..

అబద్ధం.. అంతా అబద్ధం

పాల మీగడంటి నుదురే నీది

అబద్ధం..

పూల తీగ లాంటి నడుమే నీది.

అబద్ధం.. అంతా అబద్దం

ఈ పాట గుర్తుందా..అప్పుడెప్పుడో వచ్చిన " పెళ్ళాం ఊరెళితే" సినిమాలో ఉంది. పాటలో హీరో తన భార్యను పొగుడుతూ ఉంటే ఇవన్నీ అబద్ధాలే అంటూ ఆమె అంటూ ఉంటుంది. భార్యను ప్రసన్నం చేసుకోవడం కోసం అబద్దం చెప్పడంలో కొంత అర్థం ఉంది. కానీ కొంతమంది ఏ ప్రయోజనం లేకుండానే, అసలు వారికి తెలియకుండానే ఆసం కల్పితంగా, అలవోకగా అబద్ధాలు చెప్పేస్తారని మీకు తెలుసా.. అదొక మానసిక అపసవ్యత అని తెలుసా?. ఎస్.. కొంతమంది అలాగే ఉంటారు. అయిన దానికి, కాని దానికి అబద్దాలు చెప్పేస్తుంటారు. దీన్నే సైకాలజీలో సూడోలిజియా ఫెంటాస్టికా లేదా కంపల్సివ్ లైయింగ్ అంటారు.

అవసరానికో అబద్ధం..

ఏ సందర్భంలోనూ అబద్ధం చెప్పని సత్య హరిశ్చంద్రులను ఊహించడం కొంచెం కష్టమే. నిత్య జీవితంలో సందర్భం బట్టి అబద్దాలు చెప్తూనే ఉంటాం. అలా అని ప్రతి ఒక్క అబద్ధము ఎదుటి వరకు హాని చేసేదిగా ఏమీ ఉండదు. పరిస్థితులు చక్కదిద్దడానికో, ఎదుటి వారికి ధైర్యం చెప్పడానికో, వారి మనసు గాయపడకుండా ఉండటానికో అబద్ధాలు చెప్తూ ఉంటాం. వీటితో అంత ప్రమాదం లేదుగానీ, కొన్ని అబద్ధాలతో కొంపలే మునిగిపోతాయి. అలాంటి వాటి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

అబద్ధం అనేక రకాలు..

చాలామంది అబద్ధం అంటే ఒక్కటే అనుకుంటూ ఉంటారు. కాదండోయ్.. అందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. రకరకాల అబద్ధాలను రంగులతో వర్ణించారు. అవేంటో చూద్దామా..

తెలుపు( వైట్) అబద్ధాలు: ఎదుటివారి మనసు గాయపడకుండా సందర్భానుసారంగా చెప్పే అబద్ధాలు

నలుపు ( బ్లాక్ ) అబద్దాలు: తాము ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసమో, కోరుకున్న దాన్ని దక్కించుకోవడానికి కోసమో చెప్పే అబద్ధం

బూడిద (గ్రే ) అబద్ధాలు: ఇతరులకు సాయం చేయడానికి, ఆపద నుంచి తమని తాము రక్షించుకోవడానికి చెప్పే అబద్ధం

ఎరుపు (రెడ్ ) అబద్ధాలు: ఎదుటివారికి హాని చేయడానికి, వారిపై పగ తీర్చుకోవడానికి చెప్పే అబద్ధాలు.

ఇవీ అబద్ధాల రకాలు. మొదటి మూడు రకాల అబద్ధాలతో అంతగా వచ్చే నష్టమేమీ లేదు కానీ, ఈ నాలుగో రకం అబద్ధం చూశారూ దాంతో మహా డేంజర్. ఇలాంటి అబద్దాలు చెప్పే వారి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి సుమా.

ఓ లెక్క ఉంది..

ఓ సినిమాలో హీరో " నాకు కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది" అంటూ ఉంటాడు. ఆయన తిక్క సంగతి, దానికో లెక్క సంగతి ఏమోగానీ, మనం చెప్పే అబద్ధాలకు మాత్రం ఓ లెక్క ఉందండోయ్. సగటున ఓ మనిషి రోజుకి నాలుగు అబద్ధాలు చెప్తాడని పరిశోధనల సారాంశం. ఈ లెక్కన ఏడాదికి 1,460 అబద్ధాలు, 60 ఏళ్లు వచ్చే సరికి 87,600 అబద్ధాలు చెప్తారంట. ఈ అబద్ధాలు చెప్పడంలో మగ మహారాజులు కొంచెం ముందంజలో ఉన్నారండోయ్. మగవాళ్ళు రోజుకి సగటున ఆరు అబద్ధాలు చెప్తే, ఆడవాళ్లు కేవలం మూడు మాత్రమే చెప్తారు అంట. అంటే సత్యహరిచంద్రల కంటే, హరిచంద్రమణులే ఎక్కువ అన్న మాట.

పసి కట్టడం ఎలా..

ఇదంతా చదివేసి అయ్యో అందరూ అబద్ధాలు చెప్పే వారేనా, వారు అబద్ధం చెప్తుంటే కనిపెట్టడం ఎలా అనే సందేహం మీకు కలగొచ్చు. దానికో మార్గం ఉంది. ఎదుటివారు అబద్ధం చెబుతున్నారు అనే విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా పసికట్టవచ్చు. అందులో కొన్ని ఇవి.

- మీతో మాట్లాడేటప్పుడు ఎదుటివారు వారి జుట్టుతో ఆడుకుంటూ ఉన్నా, పెదవులు టచ్ చేస్తూ ఉన్నా అబద్దం చెప్తున్నారేమో అని కొంచెం అనుమానించాల్సిందే.

- విషయాన్ని సమగ్రంగా కాకుండా, ముక్కలు ముక్కలుగా చెప్పడం, విషయం లోతుల్లోకి వెళ్లకపోవడం వంటివి చేస్తూ ఉంటే అనుమానించాల్సిందే.

- ప్రశ్నలను పదే, పదే రిపీట్ చేయడం, మాటల ద్వారా ఉద్వేగాలతో ఆడుకోవడం చేస్తుంటే అబద్ధాలు చెప్తున్నారేమోనని శంకించక తప్పదు.

అసలు కారణం ఇది..

అవసరార్థం అబద్దం చెప్పడం అంటే సరేలే అనుకోవచ్చు. కానీ అలవాటుగా అబద్ధం చెప్పడం మాత్రం మానసిక అపసవ్యత అని చెప్పాలి. సోడాల్జియా ఫెంటాస్టికా లేదా కంపల్సివ్ లయింగ్ రుగ్మత ఉన్నవారు ఏ ప్రయోజనం లేకుండా అబద్ధాలు చెప్తారు. అసలు అబద్ధం చెప్తున్నామన్న స్పృహ కూడా వారికి ఉండదు. సంభాషణలో అలవోకగా అబద్దాలు వచ్చేస్తూ ఉంటాయి వారికి.

కొసమెరుపు ఏమిటంటే, అబద్దాలను చాలా అందంగానూ, ఎదుటి వారు ఇట్టే నమ్మేసే విధంగాను, వారు అబద్ధం చెపుతున్నారని ఎవరైనా చెప్పినా కూడా నమ్మలేనంత విధంగానూ చెప్పే నైపుణ్యం వీరి సొంతం. అవాస్తవాలను, అబద్దాలను కలగలిపి జరిగిన ఘటనలను తారుమారు చేసి తమకు అనుకూలంగా మలుచుకోవడంలో వీరు దిట్టలు. ఈ రుగ్మత సాధారణంగా 16 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది, అయితే 22 ఏళ్ల వరకు గుర్తించలేము. ఈ కంపల్సివ్ లయింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ ను పెంచుకునే మార్గంగాను, ఎదుటివారిని ఆకర్షించడానికి, అధికారం చేతికించుకోవడానికి డిఫెన్స్ మెకానిజం ప్రక్రియగా చెప్పవచ్చు.

అసలు వీరు ఎందుకు ఇలా అలవోకగా అబద్ధాలు చెబుతూ ఉంటారంటే, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

- బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్ వంటి మూర్తిమత్వ రుగ్మతలు ఉన్నవాళ్లు కంపల్సివ్ లయింగ్ బారిన పడే అవకాశం ఉంది.

- చిన్నతనంలో అబ్యూజ్‌కు గురైన వారు ఎదుటివారి నిరాదరణ, శిక్షలు తప్పించుకోవడానికి.

- ఇతరులను, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి. దీన్నే సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అంటారు.

- త్వరిత పరిష్కారం కోసం. దీన్ని ఇంపల్సివ్ కంట్రోల్ అంటారు.

- ఎదుటి వారి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా , ఎంపతి లేకుండా ఉండేవారు కంపల్సివ్ లయింగ్ బారిన పడే అవకాశం ఉంది.

ఇవండీ అబద్ధాల సంగతులు. నిత్య జీవితంలో అవసరార్థం అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పడం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే కంపల్సివ్ లైయింగ్ బారిన పడితే వ్యక్తి విశ్వసనీయత, సమగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ సోడాల్జియా ఫెంటాస్టికా ఉన్నవారు మానసిక నిపుణులను సంప్రదిస్తే మంచిది. వారు సైకో థెరఫీ ద్వారా ఈ అపసవ్యతను తగ్గించగలుగుతారు.

- బి.కృష్ణ, సైకాలజిస్ట్

ఏపీఏ ఇండియా అధ్యక్షుడు

ఫోన్ : 99854 28261

సైకాలజిస్ట్ బి.కృష్ణ

టాపిక్

తదుపరి వ్యాసం