Pattanam Pakodi: కరకరలాడే పట్నం పకోడీలు.. చెన్నై స్పెషల్ ట్రావెల్ స్నాక్
10 August 2024, 15:30 IST
Pattanam Pakodi: పట్నం పకోడీ రెసిపీని ఎప్పుడైనా ప్రయత్నించారా? రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ తమిళనాడు స్నాక్ రెసిపీ తయారు చాలా సులభం. దాని ప్రత్యేకత, తయారీ విధానం ఏంటో తెల్సుకోండి.
పట్నం పకోడీ
పట్నం పకోడీ తమిళుల వంటకం. ఇక్కడ పట్నం అంటే చెన్నై. దీని పాతపేరు మద్రాసు పట్టణం. అప్పట్లో తాంజావూర్ నుంచి చెన్నైకి చేరుకోవాలంటే రైళ్లో ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే వాళ్ల వెంట తినడానికి ఈ పకోడీని తీసుకెళ్లేవారు. ఇలా క్రమంగా పట్టణ ప్రయాణానికి తీసుకెళ్లే స్నాక్ అవ్వడంతో పట్నం పకోడీ అని పేరొచ్చేసింది. ఇవి మామూలు ఉల్లిపకోడీ కన్నా ఇంకా క్రంచీగా ఉంటాయి. రాత్రంతా ఉంచినా సాగినట్లు అవ్వవు. వీటి తయారీ సులభమే. అదెలాగో చూడండి.
పట్నం పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు శనగపిండి
సగం కప్పు పుట్నాలపొడి
2 చెంచాల బియ్యం పిండి
1 చెంచా సన్నం రవ్వ
2 పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు
1 చిన్న ఉల్లిపాయ, సన్నం ముక్కలు
అంగుళం అల్లం ముక్క, సన్నటి ముక్కలు
1 కరివేపాకు రెమ్మ, సన్నటి తరుగు
గుప్పెడు జీడిపప్పు పలుకులు
1 చెంచా బటర్ లేదా నెయ్యి
పావు టీస్పూన్ బేకింగ్ సోడా
సగం చెంచా ఉప్పు
సగం టీస్పూన్ పసుపు
1 చెంచా కారం
చిటికెడు ఇంగువ
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
గుప్పెడు కొత్తిమీర తరుగు
పట్నం పకోడీ తయారీ విధానం:
1. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో బేకింగ్ సోడా, నెయ్యి లేదా బటర్ వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా క్రీమీగా అయ్యేంత వరకు కలుపుకోవాలి.
2. దీంట్లోనే బియ్యం పిండి, శనగపిండి, పుట్నాల పిండి వేసి ఒకసారి కలపాలి.
3. ఇప్పుడు నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసుకుని మరోసారి పొడిగానే కలపాలి.
4. నీళ్లు కొద్దిగా చిలకరిస్తూ పిండి గట్టిగా తడపాలి. అస్సలు జారుడుగా ఉండకూడదు. పిండితో ఉండలు చేసేంత గట్టిగా ఉండాలి.
5. చివరగా జీడిపప్పు పలుకులు కూడా వేసి పకోడీలు వేసుకోవాలి.
6. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. మీడియం మంట మీద పెట్టి చిన్న చిన్నగా పకోడీలు వేసుకోవాలి. మీడియం మంట మీద రంగు మారేంత వరకు వీటిని అన్ని వైపులా వేయించుకుంటే సరిపోతుంది. పట్నం పకోడీ రెడీ అయినట్లే.
మామూలుగా పకోడీలంటే చాలా ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసి వేసుకుంటాం. కానీ ఈ పకోడీల్లో ఒక ఉల్లిపాయ వాడినా చాలు. ఉల్లిపాయ ముక్కల వల్ల తేమ చేరి పకోడీలు సాగినట్లు అవుతాయి. ఈ పకోడీలు ఒక పూటంతా క్రిస్పీగా ఉంటాయి. చాలా చోట్ల అసలు ఉల్లిపాయలే వాడకుండా వీటిని చేస్తారు. బదులుగా ఎక్కువగా జీడిపప్పు వేసుకోవచ్చు.
టాపిక్