Heat Stroke Symptoms : హీట్ స్ట్రోక్ లక్షణాలేంటి.. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?
10 April 2024, 10:30 IST
- Heat Stroke Symptoms In Telugu : వేసవి వచ్చిందంటే వడ దెబ్బతో చాలా మంది ఇబ్బంది పడుతారు. అయితే మీరు కొన్ని రకాల చర్యలు తీసుకుంటే సమస్య పెద్దది కాకుండా చూసుకోవచ్చు.
హీట్ స్ట్రోక్ లక్షణాలు
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వేసవి తాపం మండిపోతోంది. రానున్న రోజుల్లో ఎండల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విపరీతమైన వేడి కారణంగా, వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో ఒకటి హీట్ స్ట్రోక్. శరీరం ఎక్కువ వేడిని తట్టుకోలేనప్పుడు హీట్ స్ట్రోక్ వస్తుంది.
సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్, 37 డిగ్రీల సెల్సియస్. సూర్యరశ్మికి ఎక్కువసేపు గురికావడం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరిగి 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించి ఉన్నప్పుడు హీట్‌స్ట్రోక్ వస్తుంది. తీవ్రమైన వేడి సమయంలో పొడి వాతావరణం కారణంగా కొన్నిసార్లు చెమట పట్టదు. శరీరం యొక్క చెమట తొలగింపు వ్యవస్థ పని చేయడంలో విఫలమైతే, శరీరం వేడెక్కుతుంది. హీట్ స్ట్రోక్ వస్తుంది. దీంతో కొంత మంది స్పృహతప్పి కిందపడిపోతారు. మరికొందరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు హీట్ స్ట్రోక్ మరణానికి కూడా దారితీయవచ్చు.
హీట్ స్ట్రోక్ లక్షణాలు ఏంటి?
అధిక లేదా తక్కువ రక్తపోటు
వాంతులు, వికారం, మూర్ఛ, వేగవంతమైన శ్వాస, మైకం
గందరగోళంగా అనిపించడం, విపరీతమైన చెమట, శ్వాస ఆడకపోవుట
చెమట పట్టకుండా పొడి చర్మం,
లేత లేదా ఎరుపు చర్మం
తక్కువ మూత్రవిసర్జన.
హీట్ స్ట్రోక్ నుంచి ఎలా రక్షించుకోవాలి?
సాధారణ రోజుల కంటే నీరు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. కార్బోనేటేడ్ చక్కెర పానీయాలు, స్టోర్లలో లభించే పానీయాలను తీసుకోవద్దు. మీ శరీరం నుండి చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. మీరు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఉష్ణోగ్రతను నియంత్రించే మీ శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వీలైతే ఇంట్లోనే జ్యూస్ చేసి తాగొచ్చు.. లేదా మజ్జిగ తాగొచ్చు.
ఎండ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వదులుగా ఉన్న కాటన్ బట్టలు, టోపీని ధరించి బయటకు వెళ్లడం మంచిది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోండి.
మీ ఇంటిని చల్లగా ఉంచడానికి ఎయిర్ కండిషనింగ్ మరియు ఫ్యాన్లను ఉపయోగించండి. బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి. వేడి వాతావరణంలో బహిరంగ వ్యాయామం, ఇతర తీవ్రమైన, కఠినమైన శారీరక శ్రమను నివారించండి. మీరు ఎండలో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది అనిపిస్తే.. మిగతా పనులను పక్కన పెట్టండి. నీడ లేదా చల్లని ప్రాంతానికి వెళ్లండి. తలనొప్పి, గందరగోళం, మూర్ఛను అనుభవిస్తే వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడం మంచిది.
వేసవిలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు చూస్తారు. బయటకు వెళ్లేముందు కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. ముఖానికి మాస్క్ ధరించండి. కళ్ల జోడు పెట్టుకోవాలి. చెవులకు, ముక్కును ఎండలో వెళ్లినప్పుడు సురక్షితంగా చూసుకోవాలి. వడదెబ్బ తాకితే తట్టుకోవడం కష్టం. ఇంటి దగ్గర బయటకు వెళ్లినప్పుడు కూడా గొడుగును తీసుకెళ్లండి. వేడి గాలులు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది.