Warangal IT Raids : ఓరుగల్లును తాకిన ఐటీ దాడుల సెగ, కాటన్ జిన్నింగ్ మిల్లులో సోదాలు
Warangal IT Raids : ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల సెగ ఇప్పుడు వరంగల్ నేతలను తాకింది. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ నేతలపై దాడులు చేయిస్తున్నారని పొన్నం ఆరోపించారు.
Warangal IT Raids : ఐటీ దాడుల ప్రకంపనలు ఓరుగల్లునూ తాకాయి. ఇప్పటికే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ దాడులు కలకలం రేపుతుండగా.. ఆ ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్‌ల నుంచి అధిక లావాదేవీలు జరుపుతున్న ఖాతాలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనగామ జిల్లా రఘునాథపల్లిలోని ఓ కాటన్ జిన్నింగ్ మిల్లులో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి దాదాపు నాలుగు గంటల పాటు తనిఖీ నిర్వహించి, రికార్డులన్నింటినీ పరిశీలించారు. కాగా జిన్నింగ్ మిల్లు ఓనర్‌కు ఏఏ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకేరోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు జరగడం.. ఆ వేడి కాస్త ఉమ్మడి వరంగల్ ను తాకడంతో జిల్లాలోని కొందరు నేతల్లో కంగారు మొదలైనట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ నేతల ఇండ్లపై ఐటీ దాడులను ఆ పార్టీ శ్రేణులు ఖండిస్తున్నారు. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి దాడులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ నాయకులు ఐటీ దాడులకు ఉసిగోల్పుతున్నారని ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్, బీజేపీ కుట్రలో భాగమే ఐటీ దాడులు : పొన్నం
రాష్ట్రంలో కాంగ్రెస్అభ్యర్థుల మీద బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే ఐటీ దాడులు జరుగుతున్నాయని మాజీ ఎంపీ, హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారంలో ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం చెన్నూరు కాంగ్రెస్అభ్యర్థి వివేక్‌వెంకటస్వామి ఇండ్లలో ఐటీ సోదాల విషయమై స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్కుమ్మక్కై కాంగ్రెస్‌నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. చెన్నూరు వివేక్ వెంకటస్వామి గెలుపును ఓర్వలేక రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఇందులో భాగంగానే రెండు పార్టీలు కలిసి ఐటీ దాడుల నాటకమాడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వేధింపులు, భయభ్రాంతులకు గురిచేసి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ప్రభుత్వమేనని పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ములుగులో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు
ములుగు ఎమ్మెల్యే సీతక్క తరఫున పంచేందుకు కాంగ్రెస్ నేతలు భారీగా డబ్బు తీసుకొచ్చారనే సమాచారం నియోజకవర్గంలో కలకలం రేపింది. ములుగులో ప్రచారానికి కర్ణాటక నుంచి వచ్చిన కొందరు కాంగ్రెస్ నేతలు రామప్ప గెస్ట్ హౌజ్‌లో ఉండగా.. వారు పెద్ద మొత్తంలో డబ్బులు తెచ్చినట్లు ఎలక్షన్ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్బృందాలకు సమాచారం అందింది. దీంతో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఎలక్షన్ ఆఫీసర్లు, ఫ్లయింగ్‌స్క్వాడ్ టీమ్స్, బీఆర్ఎస్ నాయకులు, పలువులు మీడియా ప్రతినిధులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆఫీసర్లంతా గెస్ట్ హౌజ్‌లో సోదాలు నిర్వహించారు. రూములతో పాటు బ్యాగులన్నింటినీ తనిఖీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన డబ్బులుగానీ, ఇతర వస్తువులేమీ లభించకపోవడంతో తప్పుడు సమాచారమని భావించి అధికారులంతా వెనుదిరిగారు.
రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు ప్రతినిధి, వరంగల్