తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alcohol: మీరు ఈ క్షణమే తాగడం మానేస్తే మీ శరీరంలో ఏం జరుగుతుంది?

Alcohol: మీరు ఈ క్షణమే తాగడం మానేస్తే మీ శరీరంలో ఏం జరుగుతుంది?

27 July 2024, 14:30 IST

google News
  • Alcohol: ఆల్కహాల్ మానేయాలి అనుకుంటున్నారా? అయితే మీ శరీరంలో ఏమేం మార్పులు జరుగుతాయో వివరంగా తెల్సుకోండి.

ఆల్కహాల్ మానేస్తే ఏమవుతుంది
ఆల్కహాల్ మానేస్తే ఏమవుతుంది (freepik)

ఆల్కహాల్ మానేస్తే ఏమవుతుంది

ఆల్కహాల్ తాగడం మానేస్తే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా. మెదడు నుంచి బీపీ దాకా.. అన్ని విషయాల్లో విపరీతమైన మార్పులు వస్తాయి. అదెలాగో చూడండి.

ఆల్కహల్ మానేస్తే జరిగేవివే:

1. పోషకాల శోషణ:

ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం విటమిన్లు, ఫోలేట్లను శోషించకుండా అడ్డుకుంటుంది. ఆల్కహాల్ తాగడం మానేస్తే మీరు తినే ఆహారం నుంచి పోషకాలను పెంచుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది.

2. మధుమేహం స్థాయులు:

ఆల్కహాల్ సేవించడం వల్ల శరీరంలో మధుమేహ స్థాయుల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, శక్తిలో తగ్గుదల, తరచూ ఏదైనా తినాలనే ఆలోచనలు దీనివల్ల పెరుగుతాయి. ఆల్కహాల్ తాగడం మానేస్తే శరీరంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. జీవక్రియ పెరగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలు రావు.

3. వెయిట్ లాస్:

ఆల్కహాల్ బరువు పెరిగేలా చేస్తుంది. జీవక్రియకు అంతరాయ కలిగిస్తుంది. దీన్ని మానేయడం వల్ల బరువు తగ్గుతారు. సరైన ఆహారం తీసుకుంటారు. శరీర పోషణ పెరుగుతుంది.

4. నిద్ర:

ఆల్కహాల్ తాగడం వల్ల మత్తుగా అనిపిస్తుందేమో. కానీ సహజంగా నిద్ర పోయే క్రమాన్ని మాత్రం అది డిస్టర్బ్ చేస్తుంది. ఆల్కహాల్ మానేస్తే మంచి నిద్ర క్రమం అలవాటవుతుంది. దీర్ఘ నిద్రలోకి జారుకోగలగుతారు. ఉదయాన్నే తాజాగా, ఉత్సాహంగా అనిపిస్తుంది.

5. క్లియర్ చర్మం:

ఆల్కహాల్ చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. చర్మంలో సహజ నూనెల్ని ఇది తగ్గిస్తుంది. దానివల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. ఇన్ఫ్లమేషన్ సమస్యలు, తొందరగా వయసు బారినట్లు చర్మం కనిపించడం లాంటి సమస్యలు వస్తాయి. ఆల్కహాల్ తాగడం మానేస్తే చర్మంలో వచ్చే మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ముఖం చాలా ప్రకాశవంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. అంటే కాకుండా యాక్నె, ఎగ్జీమా లాంటి సమస్యలూ రాకుండా చర్మం ఆరోగ్యవంతం అవుతుంది.

6. జీర్ణక్రియ:

ఆల్కహాల్ వల్ల జీర్ణసంబంధిత అనేక వ్యాధులు రావచ్చు. యాసిడ్ రిఫ్లక్స్, గ్రాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు.. ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయి. ఆల్కహాల్ మానేయగానే మీ జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ఎన్నో మంచి మార్పులు చూడగలుగుతారు. ఆల్కహాల్ లో ఉండే టాక్సిన్లు, ఇతర కారకాలు ఇక మీ కడుపులోకి చేరవు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. పేగు ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.

7. గుండె ఆరోగ్యం:

ఆల్కహాల్ సేవించడం వల్ల గుండె వేగం, రక్త పోటు తాత్కాళికంగా పెరగొచ్చు. ఆల్కహాల్ మానేయగానే మీ గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. అవయవాలకు రక్త సరఫరా చేయడానికి ఎక్కువ ఒత్తిడికి లోనుకాదు. దీనివల్ల రక్త పోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

8. భావోద్వేగాలు:

ఆల్కహాల్ తాగడం వల్ల భావోద్వేగాల మీద నియంత్రణ తగ్గుతుంది. డిప్రెషన్, ఆందోళన ఎక్కువవుతాయి. ఆల్కహాల్ మానేస్తే మీలో సంయమనం పెరుగుతుంది. జీవితంలో వచ్చే ఒడుదుడుగులను చక్కగా ఎదుర్కోగలుగుతారు. దీనివల్ల అసలైన ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు.

9. మోమోరీ:

కాగ్నిటివ్ ఫంక్షన్స్లో మార్పు, జ్ఞాపక శక్తి తగ్గడం, దృష్టి పెట్టలేకపోవడం, ఆలోచనల్లో స్పష్టత లోపించడం లాంటి వన్నీ ఆల్కహాల్ వల్ల వచ్చే మార్పులు. ఆల్కహాల్ తాగడం మానేస్తే మీ మెదడులో ఊహించని మార్పులొస్తాయి. ఆల్కహాల్ తాగకపోతే మెదడు పదునవుతుంది. కష్టమైన పనులు కూడా సింపుల్ గా చేయగలుగుతారు. అన్ని పనుల్లో సంయమనం పాటించగలుగుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం