triglycerides levels | ట్రైగ్లిజరైడ్స్ వల్ల నష్టమేంటి? ఎలా తగ్గించుకోవాలి?
06 April 2023, 11:18 IST
triglycerides levels | లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీరు కొలెస్ట్రాల్ లెవల్స్‌తో పాటు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయి కూడా చూసి ఉంటారు. చెడు కొలెస్ట్రాల్ ఎంత ప్రమాదకరమో ట్రైగ్లిజరైడ్స్ కూడా అంతే ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ట్రైగ్లిజరైడ్స్ వల్ల హాని ఏంటి? ఏం తింటే తగ్గుతాయి? ఏం తినకూడదు?
ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామం తప్పనిసరి
పరిగడుపున ఇచ్చే రక్త నమూనా ద్వారా మనం లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ఫలితాలను పొందవచ్చు. ఇందులో కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో పాటు ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ కూడా వస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ అంటే రక్తంలో ఉండే ఫ్యాట్ మాలిక్యుల్స్. లెవెల్స్ 150 మి.గ్రా./డెసిలీటర్ వరకు ఉంటే పరవాలేదు. 150 నుంచి 199 మధ్య ఉంటే బార్డర్ లెవల్ హై అని చెబుతారు. 200 పైన ఉంటే అధికంగా ఉన్నాయని అర్థం. 500, ఆ పై ఉంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం.
ఎందుకు ఎక్కువగా ఉంటాయి?
25 ఏళ్ల తరువాత ప్రతి ఒక్కరూ ట్రైగ్లిజరైడ్స్ చెక్ చేసుకోవాలి. మన రక్తంలో ఇవి పెరగడానికి కారణాలేంటంటే మనం తీసుకునే ఆహారం ఒకటైతే, లివర్ ద్వారా ఉత్పన్నమవడం మరొకటి. ముఖ్యంగా డయాబెటిస్ బారిన పడ్డ వారిలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి.
మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. కార్బొహైడ్రేట్స్ రెండు రకాలు. ఒకటి సాధారణ కార్బొహైడ్రేట్స్, రెండోది సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్. సంక్లిష్ట కార్బొహైడ్రేట్స్ శరీరానికి నిదానంగా శక్తినిస్తాయి. కానీ సింపుల్ కార్బొహైడ్రేట్స్ లేదా రీఫైన్‌డ్ కార్బొహైడ్రేట్స్‌లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిని వెంటనే పెంచేస్తాయి. జంక్ ఫుడ్.. బర్గర్లు, పాస్తా, ప్యాకేజ్డ్ డ్రింక్స్ వంటి రీఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ తీసుకోవద్దని వైద్యులు ఇందుకే చెబుతారు.
మద్యం తీసుకునే వారిలో, పొగ తాగే వారిలో కూడా ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి ఇతరులతో పోల్చితే ఎక్కువగా ఉంటుంది. మన శరీరం గ్లూకోజును, ట్రైగ్లిజరైడ్స్‌ను శక్తిరూపంలోకి మార్చుకుంటుంది. కానీ ట్రైగ్లిజరైడ్స్ అంత తేలికగా శక్తిగా మారవు. చెడు కొలెస్ట్రాల్ రూపంలోకి మారుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగేందుకు కారణమవుతాయి.
పెరిగితే నష్టం ఇలా..
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల పాంక్రియాటైటిస్ వస్తుంది. గుండె జబ్బులు కూడా వస్తాయి. ట్రైగ్లిజరైడ్స్‌తో పాటు చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ అని వైద్యులు చెబుతున్నారు. ట్రైగ్లిజరైడ్ కొవ్వులు పెరగడానికి మద్యపానం, పొగ తాగడం, కాలేయ జబ్బులు, ఊబకాయం వంటి అనేక అంశాలు కారణమవుతాయి. అందువల్ల ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్చుకుంటే చాలా వరకు ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయని చెబుతున్నారు.
ఔషధాలు వాడడం కంటే కూడా జీవనశైలి మార్చడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ఫిష్ ఆయిల్‌లో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని, ఇవి ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయని చెబుతున్నారు. చేపలు ఆహారంగా తీసుకునే వారిలో కూడా ఇవి తక్కువగా ఉంటున్నాయని అధ్యయనాల్లో తేలింది. మాంసాహారంలో సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటున్నందున వాటిని తగ్గించాలని చెబుతున్నారు.
అలాగే సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే రీఫైన్డ్, ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తగ్గించాలి. హై ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకోవాలి. బాదాం వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. తప్పనిసరిగా 35 నుంచి 45 నిమిషాలు ఏరోబిక్ వ్యాయామం చేయాలి. బరువును అదుపులో ఉంచాలి. స్మోకింగ్ మానేయాలి. మద్యం మానేయాలి. డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవాలి. రాగులు, సజ్జలు, కొర్రలు వంటి తృణ ధాన్యాలు మన డైట్‌లొ చేర్చుకోవాలి. నూనె వినియోగం తగ్గించాలి. కొవ్వులు, చక్కెరలు ఉన్న ఆహారాన్ని విస్మరించాలి. ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తే చెడు కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.