Weight Management Tea |ఈ టీ తాగితే బరువు ఇట్టే తగ్గిపోతారు.. మీరు ట్రై చేయండి..
18 March 2022, 8:14 IST
- బరువు తగ్గాలని లేదా అదుపులో ఉంచుకోవాలని.. ప్రస్తుతం ఉన్న బరువునే కొనసాగించేందుకు అందరూ నానా తంటాలు పడుతుంటారు. కొందరు బరువు తగ్గేందుకు జిమ్‌లకు, జుంబాలకు వెళ్తుంటారు. వ్యాయామాలు ఒంటికి అవసరమైనవే అయినా.. ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం, పానీయాలు కూడా మన శరీరంపై ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. బరువును తగ్గాలనుకునేవారు కచ్చితంగా ఈ టీ చేసుకుని తాగాలని సూచిస్తున్నారు.
బరువు తగ్గేందుకు టీ
Weight Management Tea | ఉదయమే టీ తాగడం చాలా మందికి అలవాటు. కానీ టీలోని కెఫెన్వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉంటాయి. వాటిని ఎవరూ కాదనలేము. ఇలా అనారోగ్యాల బారిన పడకుండా.. శరీరానికి మంచి చేసే.. బరువును అదుపులో ఉంచే ఈ టీని మాత్రం తాగమని సిఫారుసు చేస్తున్నారు నిపుణులు. ఈ వెయిట్ మేనేజ్మెంట్ టీని రోజు తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు. మరి దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా?
కావాల్సిన పదార్థాలు
* నిమ్మకాయ రసం- 1 లేదా 2 చెంచాలు
* యాపిల్ సైడర్ వెనిగర్- 1 స్పూన్
* దాల్చిన చెక్క పొడి- 1 స్పూన్
* తేనే- 1 స్పూన్
* గోరు వెచ్చని నీరు- గ్లాస్
తయారీ విధానం
ఒక గ్లాసులో గోరు వెచ్చని నీరు తీసుకోవాలి. దానిలో నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి. దానిలో ఆపిల్ సైడర్ వెనిగర్, దాల్చిన చెక్కపొడి, తేనే వేసి బాగా కలపాలి. అంతే వేడి వేడి టీ రెడీ.
మీరు రోజు తాగే టీని దీంతో రిప్లేస్ చేసుకుంటే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. ఇది బరువును అదుపులోకి తీసుకువస్తుందని వెల్లడించారు. ఆపిల్ సైడర్ వెనిగర్ అనవసరంగా, అకారణంగా వేసే ఆకలిని అదుపులోకి తీసుకువస్తుంది. అంతే కాకుండా బరువును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. దీనిని ఉదయమే పరగడుపుతో తీసుకోవచ్చు. లేదా ఎక్కువ ఆహారాన్ని తీసుకునే ముందు ఈ టీని తాగవచ్చు అంటున్నారు.