Wednesday Motivation : ఓ సర్కిల్లో బతికే బదులు.. ఒంటరిగా బతకడమే మేలు..
25 January 2023, 4:00 IST
- Wednesday Motivation : ఈ రోజుల్లో ఒంటరితనం అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒంటిరిగా ఉన్నాం కదా అని ఎవరితో పడితే వాళ్లతో మాట్లాకుండా ఎంత జాగ్రత్త తీసుకుంటామో.. అలాగే మీ జీవితంలోని టాక్సిక్ వ్యక్తుల వద్దకు తిరిగి వెళ్లకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి.
కోట్ ఆఫ్ ద డే
Wednesday Motivation : కొన్నిసార్లు ఒంటరితనం మనల్ని మరీ ఒంటరిని చేసేస్తుంది. మన సొంత, రొటీన్ జీవితాల పట్ల మనం చాలా విసుగు చెందుతాము. ఇది మనకి విచారాన్ని కలిగిస్తుంది. ఆ సమయంలో మనతో పాటు వచ్చే వ్యక్తుల కోసం లేదా మనతో జీవితాంతం ఉంటామని చెప్పేవారికోసం వెతుకుతాము. కానీ మనతో ఉండాలనుకునే వ్యక్తులు టాక్సిక్ పర్సన్స్ అయితే.. మీరు వారి దగ్గరికి వెళ్లడం కాదు కదా.. చాలా దూరంగా ఉండడం నేర్చుకోవాలి.
ఒక్కోసారి ఒంటరితనం అనేది ముందు వెనుకా చూడకుండా వ్యక్తులను దగ్గర చేసేస్తుంది. ఆ సమయంలో మీరు అప్రమత్తంగా లేకుంటే.. మీ జుట్టు వారి చేతుల్లోకి మరోసారి వెళ్లిపోతుంది. దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే బాధలో, కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. అలాగే ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా తొందరపడి ఎవరి దగ్గరికి పడితే వాళ్ల దగ్గరికి వెళ్లకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి. అలాంటి వారికి దగ్గరగా ఉండడం కన్నా.. ఒంటరిగా ఉండడమే మంచిదని తెలుసుకోండి. నేటి ప్రపంచంలో మన చుట్టూ మంచి వ్యక్తులు ఉండడం చాలా కష్టం. అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటూ.. మీ మంచిని కోరుకునేవారు అయితే మీరు కచ్చితంగా వారిని వదులుకోకండి.
మీరు కష్టపడి.. పోరాడి మీ చుట్టూ ఉన్న వ్యక్తులను సంతోషపెట్టడానికి బదులుగా.. మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోగలిగే పనులు చేయండి. మీకు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండండి. మీపై మీరు నమ్మకముంచడం చాలా ముఖ్యం. కొన్ని సమయాల్లో.. ఇతరులు చెప్పే నెగిటివ్ విషయాలను వదిలేయడమే కరెక్ట్. ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. తుది నిర్ణయం కచ్చితంగా మీదై ఉండాలని గుర్తించుకోండి. ఎవరో వచ్చి చెప్పారని.. ఇంకెవరితోనో మీరు ప్యాచప్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎదుర్కొన్న పరిస్థితులను ఎప్పుడూ మరచిపోకండి. ఒకవేళ వాటిని మరచిపోయినా.. అవి నేర్పిన పాఠాలు ఎప్పుడూ మరువకండి.
మీ చుట్టూ గందరగోళాన్ని పెంచే వ్యక్తులు ఎంతోమంది ఉండొచ్చు. ఆ సమయంలో ఎవరి తోడు కోసమో వెతుక్కోకుండా.. అక్కడి నుంచి బయటపడడానికి ట్రై చేయండి. అంతమంది ఉండడం కన్నా.. మీరు ఒంటరిగా ఉండడమే ఉత్తమం. మీకు అనవసరమైన ఇబ్బందులు పెంచే వారికి దూరంగా ఉండాలా వద్దా అని ఆలోచించినప్పుడు.. వారు మీ జీవితంలో మీతో సానుకూలంగా ఉంటారో లేదో కూడా చూసుకోండి. దానికోసం మీరు కొంత సమయం తీసుకోండి. సమయమే మీకు అన్ని విషయాలు నేర్పుతుంది. దీని వల్ల ఎవరు మంచివారో.. ఎవరు మీకు విషపూరిత వ్యక్తులో కచ్చితంగా తెలుస్తుంది.