Wednesday Motivation : కలలు నీవే.. కష్టం నీదే.. ఆశలు నీవే.. ఆశయం నీదే..
08 February 2023, 5:30 IST
- Wednesday Motivation : కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే జీవితంలో వెళ్లాల్సిన గమ్యానికి వెళ్లకుండా పక్కకు తప్పుకొంటారు. సరే అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే.. చిన్న విషయాలకే. కలలు గొప్పగా ఉంటాయి.. కానీ ప్రయత్నాలే.. మెుదలుకావు.
ప్రతీకాత్మక చిత్రం
కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే ప్రయత్నం చేసి ఓడిపోతే.. అది ఒక పద్ధతి.. కానీ ప్రయత్నమే మెుదలుకాకుండా.. ఓడిపోయామని ఇంట్లోనే కూర్చొంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు.. అలా చేసి ఉంటే ఇంకా బాగుండు.. అంటూ.. ఇతరులకు సూక్తులు చెప్తారు. కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే.. కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది కదా. ఈ విషయంలో ముందుగా ఓ స్టోరీ తెలుసుకోండి..
గద్ద చెప్పే జీవిత పాాఠం
ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది.. కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే.. మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్లు వచ్చేసరికి.. గోళ్లు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు.
ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది రెండు దారులే.. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం. రెండోది.. తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలిగోళ్ల మధ్యలో పెట్టుకుని.. భాధ కలిగినా నెమ్మదిగా వలిచి వేస్తుంది. ఆ తర్వాత.. ముక్కు మళ్లీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్లీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి.. ముక్కు మళ్లీ పదునుగా మారుతుంది. గోళ్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయ్.. మళ్లీ బతుకు పోరాటంలో దూకేస్తుంది.
గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి.. జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా.. పోరాడితే.. గెలుపు మీ కాళ్లకు దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే.. మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే.. మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది.
నీ రాత రాసేది ఎవరు..
నీ దారి మార్చేది ఎవరు..
కలలు నీవి.. కష్టం కూడా నీదే..
తలిచేది నువ్వు.. తలబడేది కూడా నువ్వే..
ఓటమి నీదే.. గెలుపు కూడా నీదే..
నీ ప్రయత్నం.., నీ విజయం, నీ జీవితం.. అంతే..