Betel Leaf Hair Mask : తమలపాకులతో హెయిర్ మాస్క్‌లు.. జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు
16 September 2023, 9:30 IST
- Betel Leaf Hair Mask : ఈ కాలంలో జుట్టు సమస్యలు సాధారణమైపోయాయి. కానీ అలానే లైట్ తీసుకుంటే.. మెుదటికి మోసం వస్తుంది. మెుత్తం జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి. జుట్టును సంరక్షించుకోవాలి.
జుట్టు పెరుగుదలకు తమలపాకు
పండుగలు, పెళ్లిళ్లు, వేడుకల్లో తమలపాకులను భగవంతుని గౌరవ సూచకంగా సమర్పిస్తారు. విందు తర్వాత తమలపాకులు తీసుకుంటారు. అయితే ఈ తమలపాకు మీ జుట్టు సమస్యలకు మందు అని మీకు తెలుసా? జుట్టు రాలడం, వాల్యూమ్ కోల్పోవడం, చుండ్రు సమస్య వంటి వివిధ జుట్టు సమస్యలను పరిష్కరించడంలో తమలపాకు మీకు సహాయపడుతుంది.
తమలపాకులను ఉపయోగించడం జుట్టు పెరుగుదలకు ఉత్తమమైన ఇంటి నివారణలలో ఒకటి. జుట్టు పెరుగుదలకు తమలపాకును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. తమలపాకులో జుట్టుకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉన్నందున జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది అధిక తేమను కలిగి ఉంటుంది. పొడి, పెళుసైన జుట్టును నివారిస్తుంది. తమలపాకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను, ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
తమలపాకు మీ స్కాల్ప్ ఆరోగ్యంగా, ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఇవి చుండ్రును నియంత్రించడంలో ఉపయోగపడతాయి. తమలపాకు జుట్టును స్ట్రెయిట్ చేస్తుంది. జుట్టును మందంగా, పొడవుగా చేస్తుంది.
తమలపాకులలో పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్లు A, B1, B2, C.. ఇతర ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అనేక యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే తమలపాకును ఎలా ఉపయోగించాలో చూద్దాం..
తమలపాకు, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్
4-5 తమలపాకులు, కొబ్బరి నూనె 1-2 టేబుల్ స్పూన్లు, 1 టీస్పూన్ కాస్టర్ ఆయిల్ తీసుకోవాలి. తమలపాకులను గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక గిన్నెలో పేస్ట్, కొబ్బరి నూనె, కాస్టర్ ఆయిల్, కొన్ని చుక్కల నీరు జోడించండి. బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత, 30 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి.
తమలపాకు, నువ్వుల నూనె హెయిర్ మాస్క్
4-5 తమలపాకులు, నువ్వుల నూనె 1-2 స్పూన్, కొబ్బరి నూనె 1 tsp, కొన్ని నీటి చుక్కలు తీసుకోవాలి. తమలపాకులను నువ్వులు, కొబ్బరి నూనెతో కలిపి రుబ్బుకోవాలి. పేస్ట్ చేయడానికి కొన్ని చుక్కల నీటిని కూడా జోడించవచ్చు. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని మీ తలకు సరిగ్గా అప్లై చేయండి. అరగంట అలాగే వదిలేయండి. తరువాత జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి.
తమలపాకు, నెయ్యి హెయిర్ మాస్క్
4-5 తమలపాకులు, నెయ్యి 1-2 టేబుల్ స్పూన్, తేనె 1 టీస్పూన్, కొన్ని నీటి చుక్కలు తీసుకోవాలి. తమలపాకు, నీళ్లు, నెయ్యి, తేనె కలిపి గ్రైండర్‌లో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. హెయిర్ మాస్క్ సిద్ధం అవుతుంది. ఆ హెయిర్ మాస్క్‌ని మీ జుట్టుకు అప్లై చేసి 5-7 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయండి. జుట్టును షవర్ క్యాప్‌తో కప్పి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత జుట్టును షాంపూతో కడగాలి.