Ganesh Chaturthi Naivedyam: వినాయక చవితికి ఎక్కువ మంది చేసే ప్రసాదాలు ఇవే..
31 October 2023, 19:15 IST
- Vinayaka Chavithi: వినాయక చతుర్థి నాడు వినాయకునికి పూజ చేయాలంటే ఆయనకు ఇష్టమైన వంటకాలు చేయాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో భక్తులు గణేషునికి రకరకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఎక్కువ మంది తయారు చేసే వంటకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయక చవితి ప్రసాదాలు
Vinayaka Chavithi 2022 : వినాయక చవితిని తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఉదయాన్నే లేచి ఇళ్లు శుభ్రం చేసి.. తలస్నానాలు చేసి.. కొత్తబట్టలు కట్టి.. పూజలో పాల్గొంటారు. పైగా రకరకాల నైవేద్యాలతో లంభోదరుడిని పూజిస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంచి చేసే ప్రసాదాలేంటో ఓ లుక్కేద్దామా?
ఉండ్రాళ్లు
వినాయక చవితి వచ్చిందంటే చాలు ఉండ్రాళ్లు చేయాల్సిందే. బియ్యం నూక, శనగపప్పును ఉండికించి కాస్త ఉప్పు వేసి ఉండ్రాళ్లుగా చుట్టి వినాయక పూజలో పెడతారు. వినాయకుని ఉండ్రాళ్లంటే మహా ప్రీతి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పాయసం
వినాయకుడికి ఇష్టమైనది రుచికరమైన పాయసం. కారపు పాయసం, పాల పాయసం, పూర్ణ పాయసం, తీపి పాయసం, బెళ్లం తాళికలు వంటి పాయాసాలు బాగా ఎక్కువగా చేస్తారు. అయితే తీపి పాయసం మొదటి రోజున వినాయకునికి ప్రీతికరమైనవిగా చేస్తే ఉత్తమం.
లడ్డూ లేని పూజ లేదు
వినాయక చతుర్థి పండుగ సందర్భంగా మీరు రవ్వ లడ్డు, కొబ్బరి పిండి లడ్డూ, కొబ్బరి లడ్డూ, మోతీ చూర్ లడ్డూ చేయవచ్చు. మోతీచూర్ లడ్డూను వినాయకునికి ఇష్టమైనదిగా భావిస్తూ.. చాలా మంది దానిని తయారు చేస్తారు. పైగా తెలుగు రాష్ట్రాల్లో వినాయక లడ్డూలకు ఉండే క్రేజ్ వేరు.
భక్ష్యాలు
బెల్లం, మైదాతో చేసిన తీపి రోటీనే భక్ష్యాలు అంటారు. ఉగాది కూడా వీటిని ఎక్కువగా చేస్తారు. చవితి సమయంలో కూడా నైవేద్యంగా భక్ష్యాలను సమర్పిస్తారు.
వడలు
పండుగ రోజుల్లో దేవుడిని పూజించడానికి చేసే వాటిల్లో పాయసం ముందుంటే.. వడ దాని తర్వాతే ఉంటుంది. కచ్చితంగా వడలు (కొన్నిచోట్ల గారెలు) తయారు చేసి గణనాథుడికి సమర్పిస్తారు.
శెనగలు
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పవచ్చు. దాదాపు ప్రతి మండపంలో శెనగలను నైవద్యేంగా సమర్పిస్తారు. ఎందుకంటే ఉడకబెట్టిన శెనగలు అంటే లంబోధరుడికి మహా ఇష్టమని భక్తులు భావిస్తారు.