తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vegetarians In India: మన దేశ జనాభాలో ఎంతమంది శాఖాహారులున్నారో తెలుసా? ఇదిగో కొత్త నివేదిక

Vegetarians in India: మన దేశ జనాభాలో ఎంతమంది శాఖాహారులున్నారో తెలుసా? ఇదిగో కొత్త నివేదిక

HT Telugu Desk HT Telugu

05 December 2023, 16:31 IST

google News
    • Vegetarians in India: ఇండియాలో శాకాహారం తింటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజా నివేదిక ప్రకారం ఏ దేశంలో శాకాహారులు అధికంగా ఉన్నారో తెలుసుకుందాం.
ఇండియాలో శాఖాహారుల సంఖ్య పెరుగుతోంది
ఇండియాలో శాఖాహారుల సంఖ్య పెరుగుతోంది (Pixabay)

ఇండియాలో శాఖాహారుల సంఖ్య పెరుగుతోంది

Vegetarians in India: మాంసాహారంతో పోలిస్తే శాకాహారం ఆరోగ్యకరమైనదిగా ఎప్పటి నుంచో పరిగణిస్తున్నారు.అందుకే ప్రపంచంలో శాకాహారం వైపు మళ్లుతున్న జనాభా సంఖ్య కూడా పెరుగుతోంది. పర్యావరణానికి, శరీరానికి... రెండింటికీ శాఖాహారం మేలు చేస్తుంది. అందుకే ఎంతోమంది మాంసాహారాన్ని తినడం మానేసి పూర్తి శాకాహారులుగా మారుతున్నారు. అయితే ప్రపంచంలో శాకాహారులు అధికంగా ఉన్న దేశాలు ఏవో తెలుసుకునేందుకు ఏటా ‘వరల్డ్ అట్లాస్’ సంస్థ సర్వేను చేపడుతుంది. తాజాగా ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది.

మొదట స్థానం మనదే

శాకాహారులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాను రూపొందించింది వరల్డ్ అట్లాస్. ఆ నివేదిక ప్రకారం శాకాహారులను అత్యధికంగా కలిగి ఉన్న దేశం మనదే. భారతదేశ జనాభాలో 38 శాతం మంది పూర్తి శాకాహారులుగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మాంసాన్ని తక్కువగా వినియోగిస్తున్న దేశం కూడా మనదే. తాజా నివేదిక ప్రకారం శాకాహారుల సంఖ్య పెరగడానికి ఆర్థికపరమైన అంశాలు, మాంసం పట్ల పెరిగిన వ్యతిరేకత, నమ్మకాలు, మతం... వంటివన్నీ ప్రభావం చూపించవచ్చని చెబుతున్నారు అధ్యయనకర్తలు.

ఇక భారతదేశం తర్వాత శాకాహారులను అధికంగా కలిగి ఉన్న దేశం ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ జనాభాలో 13 శాతం మంది శాకాహారులుగా ఉన్నారు. ఇజ్రాయిల్‌లో శాకాహారులు పెరగడానికి కారణం ‘జుడాయిజం’. ఈ మతపరమైన జీవనశైలి కారణంగానే ఇజ్రాయిల్‌లో శాకాహారుల సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో తైవాన్, ఇటలీ ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో కూడా శాఖాహారాలు తినే వారి సంఖ్య అధికంగానే ఉంది.

గుండెకు మేలు

శాకాహారం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రపంచంలో ఎంతోమంది నమ్ముతున్నారు. అందుకే మాంసాహారం పై విముఖత పెరుగుతూ వస్తున్నట్టు గుర్తించారు. శాకాహారం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రక్తపోటు తగ్గుతుంది.. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయే సమస్య ఉండదు.

అదే మాంసాహారం తింటే ట్రై గ్లిజరైడ్స్ పెరిగిపోవడం,చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వంటివి జరుగుతాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శాఖాహారం పర్యావరణానికి ఎంతో సహాయపడుతుంది. శాఖాహారం ముఖ్యంగా మొక్కల ఆధారత ఆహారమే కాబట్టి కార్బన్ ఉద్గారాలను పెంచదు. అదే మాంసం ఆధారిత ఆహారాలు అయితే కార్బన్ ఉద్గారాలను రెండున్నర రెట్లు పెంచుతాయి. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది.

శాకాహారం తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. అధ్యయనాల ప్రకారం శాఖాహారాన్ని తినేవారు మధుమేహం బారిన పడే అవకాశం 35% నుండి 53% వరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు మాంసాహారాన్ని తగ్గించడం చాలా మంచిది.

శాఖాహారం తినడం వల్ల బరువు కూడా పెరగరు. బరువును నిర్వహించడంలో ఇది ఉత్తమ ఆహారం. మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎంత తిన్నా కొవ్వు, క్యాలరీలు అధికంగా చేరవు. కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు. మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా శాఖాహారం సహకరిస్తుంది. అల్జీమర్స్, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి వాటిని రాకుండా చేస్తుంది. చిత్తవైకల్యాన్ని అడ్డుకోవడంలో శాఖాహారం ముందుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

తదుపరి వ్యాసం