Office makeover: ఈ మార్పులు చేస్తే.. పని ఒత్తిడి తగ్గుతుందట..
29 May 2023, 16:18 IST
Office makeover: రోజులో ఎక్కువ సేపు గడిపేది ఆఫీసు పనిలోనే. ఆ పనిచేసే వాతావరణం ఎంత బాగుంటే.. పని అంత ప్రశాంతంగా చేసుకోవచ్చు. దానికోసం కొన్ని మార్పులు చేసుకుంటే చాలు.
డెస్క్ డిజైనింగ్
పనిచేసే వాతావారణం బాగుంటే పనిచేసిన అలసట కాస్త తగ్గుతుంది. అలా అనిపించాలంటే కొన్ని మార్పులు చేయాల్సిందే. మీరు పనిచేసే డెస్క్ డిజైనింగ్, లుక్ కాస్త మార్చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఆఫీస్ అయినా ఈ మార్పులు చేసుకోవచ్చు. ఆహ్లాదంగా పని చేసుకోవచ్చు. మనసుకు అలిసిన భావన రాదు.
1. బయోఫిలిక్ డిజైన్:
మొక్కలు, నీళ్లు, ప్రకృతికి సంబంధించిన వస్తువులతో అలంకరణ చేయడమే బయోఫిలిక్ డిజైనింగ్. దీనివల్ల గాలి నాణ్యత పెరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. చాలా కంపెనీలు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. పచ్చదనాన్ని పనిచేసే వాతావరణంలో కనిపించేలా ఆఫీసులు అలంకరిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి పని చేసుకుంటే చుట్టూ చిన్న మొక్కలతో అలంకరణ చేసుకోవచ్రచు.
2. చదువుకునే ప్రాంతం:
ఆఫీసుల్లో రీడింగ్ కార్నర్స్ ఉంటున్నాయి. ఇవి పని ఒత్తిడి నుంచి బయటపడటానికి ఏర్పాటు చేసినవి. ఈ ప్రాంతాల్లో సహజ సూర్యరశ్మి పడేలా, పచ్చదనం ఉండేలా, కట్టెతో చేసిన అలంకరణ, సౌకర్యవంతంగా కూర్చునే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అలాంటి ప్రదేశం ఇంట్లో కూడా ఒకటుండాలి. బాల్కనీ అవ్వొచ్చు. ఇంకేదైనా అవ్వొచ్చు. ప్రకృతి తెలిసేలా ఉండాలి.
3. రంగుల ప్రభావం:
మంచి రంగుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. పనికి తగ్గ రంగుల్ని ఎంచుకుంటే ప్రశాంతతతో పాటూ సృజనాత్మకత పెరుగుతుంది. చాలా కంపెనీలు ఈ ప్రయత్నాలు చేసి విజయం సాధించాయి కూడా.
4. ఆర్ట్:
ఆర్ట్ వర్క్, గ్రీనరీ ఒక ప్రదేశం లుక్ పూర్తిగా మార్చేస్తాయి. స్థానికి హస్త కళలకు సంబంధించిన వస్తువులు, పెయింటింగులు మంచి ఎంపిక. వీటివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
పని ప్రదేశానికి రావాలంటే ఉద్యోగులు ఉత్సాహం చూపేలా ఉండటానికి చాలా కంపెనీలు ఇలాంటి మార్పులు చేస్తున్నాయి. ఈ చిన్న మార్పుల వల్ల ఆఫీసులో ప్రశాంత వాతావరణం ఉంటుందట. పచ్చదనం, మంచి రంగులు, ఆర్ట్ వర్క్ వల్ల పనిచేసే ప్రాంతాన్ని కళగా మార్చేయొచ్చు. ఇంట్లోనుంచి పనిచేస్తున్నా సరే.. ఈ చిన్న చిన్న ఏర్పాట్లు మీరు కూడా చేసుకుని చూడండి. డెస్క్ మీద చిన్న మొక్క, చుట్టూ నీళ్ల సౌండ్ వచ్చే చిన్న ఎలక్ట్రిక్ ఫౌంటెయిన్లు లాంటి ఏర్పాట్లు చేసుకుని చూడండి. ప్రశాంతంగా పని చేసుకోగలుగుతారు.
టాపిక్