తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Travel Therapy: 60లో ఇరవైలా ఉండేందుకు ట్రావెలింగ్ థెరపీలా పనిచేస్తుందట

Travel therapy: 60లో ఇరవైలా ఉండేందుకు ట్రావెలింగ్ థెరపీలా పనిచేస్తుందట

23 February 2023, 19:47 IST

google News
    • Travel therapy: 60లలో ఇరవైలా ఉండాలంటే ట్రావెలింగ్ మంచి థెరపీలా పనిచేస్తుందట. ట్రావెలింగ్ రంగంలో ఉన్న నిపుణుల సలహా ఇక్కడ చూడండి.
ట్రావెలింగ్‌తో సీనియర్ సిటిజెన్లకు అద్భుతమైన ప్రయోజనాలు
ట్రావెలింగ్‌తో సీనియర్ సిటిజెన్లకు అద్భుతమైన ప్రయోజనాలు (Unsplash)

ట్రావెలింగ్‌తో సీనియర్ సిటిజెన్లకు అద్భుతమైన ప్రయోజనాలు

ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి. ఏ వయస్సులో ఉన్న వారైనా ట్రావెలింగ్ అంటే ఇష్టపడనివారు ఉండరు. సీనియర్ సిటిజెన్లకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా నలుగురితో కలవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుంది. తద్వారా తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోగలుగుతారు. ట్రావెలింగ్ అంటే సుదూర ప్రాంతాలను సందర్శించడం వరకు మాత్రమే పరిమితం కాదు. ఒక వ్యక్తి దృక్కోణం మార్చే సామర్థ్యం ట్రావెలింగ్‌ ఇస్తుంది. ట్రావెలింగ్‌ను ఒక థెరపీగా పరిగణనలోకి తీసుకోవచ్చు. సీనియర్ సిటిజెన్లు వారి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వారి భయాలను వీడేందుకు ట్రావెలింగ్ సహాయపడుతుంది. ట్రావెలింగ్ అనుభవాలు ఒక థెరపీ ఇచ్చే ప్రయోజనాన్ని ఇస్తాయి.

సీనియర్ వరల్డ్ సంస్థ కో ఫౌండర్ ఎం.పి.దీపూ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ సిటిజెన్లు ట్రావెల్ చేయడం వల్ల ఉండే అద్భుతమైన ప్రయోజనాలను వివరించారు.

ఒత్తిడి దూరం అవుతుంది..

ఒంటరి జీవితం చాలా మంది సీనియర్ సిటిజెన్లలో ఒత్తిడి కలిగిస్తుంది. తమ కెరీర్‌లో కష్టపడి, కుటుంబ సభ్యుల ఉన్నతి కోసం అహరహం శ్రమించి 60వ వడిలోకి వచ్చే సరికి పూర్తిగా అలసిపోతారు. ఒంటరి తనం అనుభవిస్తారు. ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ట్రావెలింగ్ జీవితం మీద దృక్పథాన్ని మారుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. డిమెన్షియా ముప్పును, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.

ట్రావెలింగ్ ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తుంది. అందువల్ల సీనియర్ సిటిజెన్లు వారి గ్రహణ శక్తి కాపాడుకోవచ్చు. గుండె పోట్లకు ఆస్కారం తగ్గుతుంది. వారి ఆయువును మరింత పెంచుతుంది.

టూర్లు సీనియర్ సిటిజెన్లలో రిలాక్సేషన్, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచడం ద్వారా వారిలో దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్తమా, ఆర్థరైటిస్‌ పరిస్థితిని మెరుగుపరుస్తుందని అధ్యయనాల్లో రుజువైంది.

తమ వయస్సు ఉన్న వారితో కలిసి సామాజిక కార్యకలాపాల్లో సీనియర్ సిటిజెన్లు పాలు పంచుకోవడం వల్ల వారి మధ్య బంధం బలపడుతుంది. ముఖ్యంగా సాహసోపేతమైన కార్యకలాపాలు వారి గ్రహణ శక్తిని మెరుగుపరుస్తాయి.

జీవితంలో పదవీ విరమణ అనంతర వయస్సు సెకెండ్ ఇన్నింగ్స్ లాంటిది. ఈ సమయంలో వారు ఆనందించడం, వారు కలలు గన్న టూర్లను ఇప్పుడు పూర్తి చేయడం వారికి అవసరం. వారి శేష జీవితానికి వన్నె తెస్తుంది. శారీరక, మానసిక, భావోద్వేగపరమైన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

తదుపరి వ్యాసం