Breakfast Recipes : అమెరికన్ స్టైల్లో ఎగ్ టోస్ట్.. ఈజీ రెసిపీ..
22 June 2022, 7:36 IST
- వర్షాకాలంలో కాస్త స్పైసీగా.. కొత్తగా ఏమైనా తినాలనిపిస్తుంది. కానీ ఈజీగా చేసుకునేందుకు రెసిపీలు మీకు అందుబాటులో లేకపోవచ్చు. ఆ సమయంలో మీరు ఈ అమెరికన్ స్టైల్ ఎగ్ రెసిపీని ట్రై చేయవచ్చు. ఎక్కువ టైమ్ తీసుకోకుండా.. కొత్తగా, టేస్టీగా తినాలనుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు.
ఎగ్ రెసిపీ
Breakfast Recipes : మీరు ఎగ్ టోస్ట్‌ను ఎన్నోసార్లు మీ బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుని ఉండొచ్చు. కానీ ఈ సారి మీరు కొత్తగా.. కాస్త ఫన్నీగా ట్రై చేయాలనుకుంటే అమెరికన్ స్టైల్లో ఎగ్ ఇన్ ఎ బ్లాంకెట్ రెసిపీని ట్రై చేయవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎక్కువ సమయం కూడా తీసుకోదు. అంతేకాకుండా ఇది రుచికరమైనది.. ఆరోగ్యకరమైనది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు చుద్దాం.
కావాల్సిన పదార్థాలు
* గుడ్లు - 2
* బ్రౌన్ బ్రెడ్ - 2
* వెన్న - 2 స్పూన్స్
* చిల్లీ ఫ్లేక్ - రుచికి తగినంత
* ఒరేగానో - రుచికి తగినంత
* ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
గుండె ఆకారంలో లేదా వేరే ఇతర ఆకరంలోనైనా ఉన్న కుకీ కట్టర్‌ని తీసుకోండి. దానితో ఒక్కో బ్రెడ్ స్లైస్‌ల మధ్య భాగాన్ని కత్తిరించండి. అనంతరం పాన్‌లో 1 స్పూన్ బటర్ వేసి వేడి చేయండి. వేడి అయినా తర్వాత.. ఒక బ్రెడ్ స్లైస్‌ను బటర్‌పై ఉంచండి. మంటను తక్కువగా ఉంచి.. అది గోధుమ రంగులోకి మారేవరకు ఉంచండి. తర్వాత దానిని మరో వైపు తిప్పండి.
ఇప్పుడు గుండె ఆకారపు లేదా వేరే ఇతర ఆకారాల్లో బ్రెడ్ స్లైస్ మధ్యలో గుడ్డును నెమ్మదిగా పగలగొట్టండి. అనంతరం పాన్‌ను ఒక మూతతో కప్పి.. 3-4 నిమిషాలు ఉడికించాలి. గుడ్డు ఉడికిందో లేదో తనిఖీ చేయండి. ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత దానిని ప్లేట్‌లోకి తీసుకోండి. ఇతర బ్రెడ్ స్లైస్‌తో ఇదే ప్రక్రియను పునరావృతం చేయండి. ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానోతో సీజన్ చేయండి. వేడి వేడిగా లాగించేయండి.