సిజేరియన్ తర్వాత ఎన్ని రోజులు శృంగారానికి దూరంగా ఉండాలి?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
01 October 2024, 11:33 IST
సిజేరియన్ (సి సెక్షన్) డెలివరీ తర్వాత శృంగారంలో పాల్గోనడం గురించి అనేక సందేహాలుంటాయి. సి సెక్షన్ తర్వాత సెక్స్ విషయంలో.. ఇద్దరికీ ఓపిక, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, శరీరంపై శ్రద్ధ అవసరం. సిజేరియన్ తర్వాత సౌకర్యవంతమైన సెక్స్ కోసం కొన్ని విషయాలమీద అవగాహన ఉండాలి.
సిజేరియన్ తర్వాత సెక్స్ విషయంలో జాగ్రత్తలు
శిశువు జన్మించిన తర్వాత ఆ ఆనందంతోనే తల్లిదండ్రులిద్దరూ సంబరాల్లో మునిగిపోతారు. సి సెక్షన్ లేదా సిజేరియన్ డెలివరీ తర్వాత ప్రసవానంతర జీవితానికి తగ్గట్లు సర్దుబాటు చేసుకోవడం మీదే దృష్టంతా ఉంటుంది. దాన్నుంచి కోలుకున్నాక శృంగారం గురించి అనేక సందేహాలు మొదలవుతాయి. సి సెక్షన్ తర్వాత ఎప్పటినుంచి సెక్స్‌లో పాల్గొనచ్చు, ఏమైనా ఇబ్బందులుంటాయా అనే సందేహాలుంటాయి. ఆ విషయాలన్నీ తెల్సుకోండి.
సిజేరియన్ డెలివరీలో..:
సిజేరియన్ సెక్షన్ (సి-సెక్షన్) డెలివరీ అనేది ఒక శస్త్రచికిత్స. దీనిలో తల్లి పొత్తి కడుపు, గర్భాశయంలో చేసిన కోత ద్వారా ప్రసవం అవుతుంది. ప్రసవం సమయంలో బిడ్డకు, తల్లికి ప్రమాదం కల్గించే పరిస్థితులు ఏర్పడితే నార్మల్ డిలివరీకి బదులుగా సి సెక్షన్ ను అత్యవసరంగా చేస్తారు.
సిజేరియన్ డెలివరీ తర్వాత శృంగారం:
గైనకాలజిస్టు సలహా ప్రకారం.. డెలివరీ తర్వాత కనీసం ఆరు వారాలు శృంగారంలో పాల్గొనకూడదు. సిజేరియన్ ద్వారా అయిన గాయం నయం కావడానికి, గర్భాశయ ముఖ ద్వారం మామూలు స్థితికి రావడానికి ఈ సమయం అవసరం. అయితే ప్రసవ సమయంలో ఏవైనా సమస్యలు ఉండి ఉంటే కనీసం 8 నుంచి 10 వారాల వరకు శృంగారానికి దూరంగా ఉండటం మేలు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఈ జాగ్రత్తలు అవసరం:
1. సమయం తీసుకోండి:
ఆరు వారాలు నుంచి ఎనిమిది వారాలు అనే సమయం సి సెక్షన్ నుంచి కోలుకోడానికి అవసరం. కానీ శారీరకంగా, మానసికంగా సిద్ధం అవ్వడానికి మరికొంత సమయం పడుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీలో ప్రచురించిన నివేదిక ప్రకారం సిజేరియన్ తర్వాత యాభై శాతం మహిళలు ఆరు వారాల్లో శృంగారంలో పాల్గొనడం ప్రారంభించారట. కాబట్టి ఈ సమయం ఒక్కొక్కరికి మారుతూ ఉంటుంది. కాబట్టి శరీరంతో పాటే మానసికి సంసిద్ధత చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.
2. వైద్యుల సలహా:
ఆరు నుంచి ఎనిమిది వారాల ప్రసవానంతర సమయంలో శరీరం దాదాపుగా కోలుకుంటుంది. ఈ సమయంలోనే దాదాపుగా వైద్యులు చెకప్ కోసం రమ్మని చెబుతారు. సి సెక్షన్ వల్ల అయిన గాయం కోలుకుందా లేదా అని చెక్ చేస్తారు. ఆరోగ్యాన్ని ఒకసారి పరిశీలిస్తారు. ఈ సమయంలో హాస్పిటల్ వెళ్లినప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అని కనుక్కోండి. మీ ఆరోగ్యాన్ని బట్టి వాళ్లు మీకు సలహా ఇస్తారు.
3. లూబ్రికేషన్:
హార్మన్లలో మార్పులు రావడం సహజం. కాబట్టి కొందరిలో యోని పొడిబారే సమస్య రావచ్చు. ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే నొప్పి ఎక్కువుంటుంది. అసౌకర్యం ఉంటుంది. కాబట్టి వాటర్ బేస్డ్ లూబ్రికెంట్ వాడటం మంచిది.
సెక్స్ వల్ల ఏమైనా సమస్యలు రావచ్చా?
కొంతమందిలో ఇన్ఫెక్షన్లు రావడం, లేదంటే బ్లీడింగ్ అవ్వచ్చు. వైద్య సలహా తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. సీ సెక్షన్ గాయం నయం అయిన తర్వాత సెక్స్ లో పాల్గొనడం పూర్తిగా సురక్షితమే. భావప్రాప్తి పొందినప్పుడు కడుపులో నొప్పి లాంటివి రావచ్చు. మెల్లిగా ఈ సమస్య తగ్గిపోతుంది. కానీ అసౌకర్యం ఎక్కువుంటే వైద్యులని సంప్రదించాల్సిందే.