తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Clean Sofas: సోఫాలను పర్ఫెక్ట్ గా శుభ్రం చేసే విధానం ఇదే..

Clean Sofas: సోఫాలను పర్ఫెక్ట్ గా శుభ్రం చేసే విధానం ఇదే..

04 October 2023, 17:59 IST

google News
  • Clean Sofas: ఇంట్లో సోఫాలను శుభ్రం చేసి చాలా రోజులు అయ్యిందా? అయితే సోఫాలను శుభ్రం చేసే సరైన పద్ధతేంటో తెలుసుకుని ఫాలో అయిపోండి. 

సోఫాలు శుభ్రం చేసే పద్ధతి
సోఫాలు శుభ్రం చేసే పద్ధతి (pexels)

సోఫాలు శుభ్రం చేసే పద్ధతి

హాల్లో, బాల్కనీల్లో ఎక్కువగా సోఫాలను వేసుకుంటాం. చెప్పాలంటే చాలా ఎక్కువ సేపు వీటిల్లోనే కూర్చుని గడుపుతూ ఉంటాం. ఇక్కడే అవీ ఇవీ తింటుంటాం. పార్టీలూ వీటిల్లోనే చేసుకుంటుంటాం. కావాలంటే టీవీ చూస్తూ అలా నడుమూ వాల్చేస్తాం. ఇన్ని పనులకు ఇవి ఉపయోగిస్తాం కాబట్టి అంతే స్థాయిలో వీటిపై దుమ్ము, సూక్ష్మ జీవులు పేరుకుపోయి ఉంటాయి. ఫ్యాబ్రిక్‌ సోఫాలకైతే మరకలూ పడుతుంటాయి. తాగేప్పుడు, తిన్నప్పుడూ ఏవో ఒకటి వీటిపైన ఒలికిపోతూ ఉంటాయి. అందుకనే సోఫాలను నెలకొకసారైనా తప్పనిసరిగా డీప్‌ క్లీనింగ్‌ చేసుకోవాలి. లేకపోతే వీటిపై తేమ, సూక్ష్మ జీవుల వల్ల అవి దుర్వాసన వస్తాయి. దీంతో మన డైనింగ్‌ రూం కాస్తా చిరాకుగా తయారవుతుంది. మరి సోఫాను ఏం చేయడం ద్వారా దాన్ని డీప్‌ క్లీనింగ్‌ చేసుకోవచ్చో తెలుసుకోండి.

ఒక్కో పనికీ ఉంది ఒక్కో పనిముట్టు :

  • సోఫాలను శుభ్రం చేసుకోవడానికి అన్నింటి కంటే బాగా ఉపయోగపడే పరికరం వాక్యూమ్‌ క్లీనర్‌. ముందుగా సోఫాలో ఉండే తలగడలన్నింటినీ తీసి పక్కన పెట్టండి. పెద్ద దుమ్ము కణాలను పోగొట్టేందుకు మొదట బ్లోయర్‌ని ఉపయోగించండి. దీని నుంచి గాలి వేగంగా బయటకు వస్తుంది. కాబట్టి సోఫా ఉపరితలం పై ఉన్న దుమ్మంతా పోతుంది. తర్వాత సక్షన్‌ని ఉపయోగించి వాక్యూమ్‌ క్లీనింగ్‌ చేయండి. దీని వల్ల సోఫా లోపలివైపు ఉన్న దుమ్మంతా వాక్యూమ్‌ క్లీనర్‌ ఒడిసి పట్టుకుంటుంది.
  • ఫ్యాబ్రిక్‌ సోఫాలను కొనుక్కునేప్పుడే కవర్లు అన్నీ ఉతుక్కునేందుకు వీలుగా వచ్చేసేలా డిజైన్‌ చేయించుకోండి. అప్పుడు సోఫాను శుభ్రం చేసుకోవాలనుకున్న ప్రతి సారీ కవర్లను తీసి ఒకసారి ఉతికేసుకోవచ్చు. అలా కవర్లు తీసిన సోఫాను వాక్యూమ్‌ చేసుకుంటే సరిపోతుంది. పని తేలికవుతుంది.
  • ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా, మనకు జుట్టు ఎక్కువగా రాలిపోతున్నా.. ఆ వెంట్రుకలన్నీ వెళ్లి సోఫా గుడ్డకు అతుక్కుపోతాయి. వాటిని తీసేందుకు మార్కెట్లో లింట్‌ రోలర్‌లు అందుబాటులో ఉంటాయి. వాటితో సోఫా ఉపరితలంపై రోల్‌ చేయడం వల్ల జుట్టంతా వాటికి పట్టుకుని వచ్చేస్తుంది. దీంతో సోఫా తేలికగా శుభ్రంగా మారుతుంది.
  • మరి కొన్ని సోఫాలకైతే కవర్లు తీసేందుకు విడిగా రావు. వాటిని అలాగే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాక్యూమ్‌ చేసుకున్న తర్వాత మరి కొన్ని స్టెప్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా వీటిని ఉతకడానికి వీలు కాదు కాబట్టి వీటిపై మరకలు పడితే కష్టమే. చూసేందుకు, మెయింటెన్‌ చేసేందుకూ చిరాకుగా ఉంటుంది. అయితే వీటిపై పడిన మరకల్ని తొలగించేందుకు మార్కెట్లో కొన్ని రకాల ఫోమ్‌ స్ప్రేలు అందుబాటులో ఉంటాయి. అవి సోఫాకు తడి కాకుండా పొడిగానే మరకల్ని వదిలిస్తాయి. వాటిని ప్రయత్నించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం