Festivals Significance: పండగంటే ఆచారమే కాదు.. కలతలు దూరం చేసే అనుబంధాల వేడుక
12 October 2024, 9:15 IST
Festivals Significance: భారతీయ పండగలు ఆచారం కోసమే కాదు. మానసిక ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి. పండగల్లో కలివిడితనంతో కలతలు దూరం చేస్తాయి. అనుబంధాలను, భావోద్వేగాలను పదిలంగా ఉంచే పండగల గొప్పతనాన్ని సైకాలజిస్ట్ కృష్ణభరత్ ద్వారా తెల్సుకుందాం.
పండగల ప్రాముఖ్యత
భారతదేశం పండుగలకు పుట్టినిల్లు. మన సంస్కృతిలో ప్రతి సందర్భాన్ని ఓ పండగలా చేసుకోవడం ఆనవాయితీ. భారతీయ పండుగలకు, మానసిక ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. మతాలతో సంబంధం లేకుండా దసరా , దీపావళి , రంజాన్, క్రిస్టమస్ లాంటి పండుగలు కుటుంబాల మధ్య, మనుషుల మధ్య బంధాలను బలోపేతం చేస్తున్నాయి.
నేటి తరం పండుగలు అంటే ఆచారాలు మాత్రమే అనుకుంటుంది. దాని వెనుక ఉన్న మానసిక ప్రయోజనాలను గుర్తించలేక పోతోంది. పండుగలు అంటే కేవలం ఆచార వ్యవహారాలు మాత్రమే కాదు. కుటుంబ సభ్యులు,బంధువులు, స్నేహితులు కలిసే సందర్భం. సరదాగా, సంతోషంగా గడిపే సమయం.
పండగలతో ఎన్నో ప్రయోజనాలు..
పండుగల వల్ల ఎన్నో మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. మనిషి సంతోషంగా ఉండడానికి, బంధాలను బలోపేతం చేసుకోవడానికి పండుగలు దోహదపడతాయి. పండుగల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఒకసారి చూసేద్దామా..
* పండుగలు పదిమంది కలిసే అవకాశం కల్పిస్తాయి. సామాజిక బంధాలను పటిష్ట పరుస్తాయి. వ్యక్తుల్లో సామాజిక భద్రతాభావన కలిగిస్తాయి. పండుగ సందర్భాల్లో కలిసి మాట్లాడుకోవడం ద్వారా మనుషుల మధ్య ఉండే చిన్న చిన్న పొరపొచ్చాలు సమసి పోతాయి.
* బతుకుతెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళిన వారు పండగ సందర్భాల్లో సొంత ఊరు చేరుకొని బంధువులు, స్నేహితులతో గడపడం ద్వారా వారిలో సానుకూల ఉద్వేగాలు పెంపొందుతాయి. ఇవి వ్యక్తి మూడ్ ను మారుస్తాయి, మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.
* పండుగ సందర్భాల్లో ఇంట్లోనూ, గుడిలోనూ, ప్రార్థన మందిరాలు, మసీదుల్లోనూ చేసే అలంకరణ జ్ఞానేంద్రియాలకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. రంగు రంగుల విద్యుత్ బల్బులు, పువ్వులు కంటికి ఆనందం కలిగిస్తాయి. లయబద్ధంగా సాగే భజనలు, ప్రార్థనలు చెవులకు ఇంపుగా ఉంటాయి. బంధువులు కుటుంబ సభ్యులతో ఆలింగనాలు సానుకూల స్పర్శ అనుభూతిని కలిగిస్తాయి. ఇవన్నీ కలిసి వ్యక్తులలో పాజిటివ్ మైండ్ సెట్ అభివృద్ధి చెందటానికి దోహద పడతాయి.
* పండుగల సందర్భంగా చేసే బృంద నృత్యాల లోని లయబద్ధ కదలిక, సంగీత వాయిద్యాల శబ్దాలు తాధ్యాత్మిక స్థితిని( ఫ్లో స్టేట్) కలిగిస్తాయి. ఆ క్షణాన్ని ఆస్వాదించే లక్షణాన్ని( మైండ్ ఫుల్ నెస్) పెంపొందిస్తాయి. ఇవి వ్యక్తుల్లో సానుకూల ఉద్వేగాలను పెంపొందించడంతో పాటు ఒత్తిడిని దూరం చేస్తాయి.
* పండుగ అంటేనే మానసిక ఉద్వేగాల సమాహారం. బంధువులను, చిన్ననాటి స్నేహితులను కలిసిన ఆనందం, సరదాగా కబురు చెప్పుకుంటూ తుళ్ళిపడే ఉత్సాహం, పండుగ తర్వాత వీరందరినీ విడిచి వెళుతున్నప్పుడు కలిగే కొద్దిపాటి వేదన.. ఇలా అన్ని ఉద్వేగాలను పరిచయం చేస్తుంది, భావోద్వేగాలను పరిపుష్టం చేస్తుంది.
* పండుగ సమయాల్లోని ఆధ్యాత్మిక వాతావరణం మనిషిలోని చేతన ఆలోచించే అవకాశం కల్పిస్తుంది. సృష్టిలో తను ఏంటి, తన కర్తవ్యం ఏంటి అని ప్రశ్నించుకునేలా చేస్తుంది. అది భౌతిక అంశాలపై ఆలోచన రేకెత్తిస్తుంది. "నేను "అని విర్రవీగడం కంటే "మనం" అంటూ ముందుకు పోవడమే మంచిదే అని నేర్పిస్తుంది.
ఇవండీ పండుగలతో మనకు కలిగే ప్రయోజనాలు. పండుగ అంటే ఏదో పూజ చేశామా, ప్రసాదాలు తిన్నామా అని కాకుండా వాటి వలన మనకు మానసిక, సామాజిక, భావోద్వేగ ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకుని మరింత ఉత్సాహంగా జరుపుకుందాం.. మన జీవితంలోకి ఆనందోత్సాహాలను స్వాగతిద్దాం.