Dum Tea Recipe । మీరు ఎప్పుడైనా దమ్ టీ తాగారా? ఏక్ దమ్ కడక్.. బొట్టు బొట్టులోనూ ఆనందం!
08 January 2023, 17:14 IST
- Dum Tea Recipe: దమ్ బిర్యానీ రుచి మీ అందరికి తెలుసు, మరి దమ్ టీ రుచిని ఎప్పుడైనా చూశారా? ఇక్కడ దమ్ టీ రెసిపీ ఉంది, ట్రై చేయండి.
Dum Tea Recipe
మనందరికీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో ఫుడ్ డెలివరీ యాప్స్ అందించే గణాంకాలు చూస్తేనే అర్థం అవుతుంది. ఒక్కరోజులోనే రోజుకి లక్షల ఆర్డర్లు వెళ్తాయి, ఇవి కాకుండా ఆఫ్ లైన్ ఆర్డర్లు, వండుకుని తినేది వేరే. ఎందుకంటే దమ్ బిర్యానీ రుచిలోనే ఉంటుంది దాని దమ్ము. అలాగే కొంతమంది నరాల్లో రక్తానికి బదులుగా ఇరానీ చాయ్ ప్రవహిస్తుందని చెప్పడంలో అతిషయోక్తి కాదేమో. దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ లకు ఉండేటువంటి క్రేజ్ అలాంటిది.
మరి మీరెప్పుడైనా దమ్ చాయ్ రుచిని చూశారా? ఇప్పుడు ఇంటర్నెట్లో ఇదొక ట్రెండ్. దమ్ బిర్యానీలాగే ఈ దమ్ టీని కూడా మసాలా దినుసులు కలిపి ఆవిరి మీద ఉడికిస్తారు. కానీ ఇది చేసుకోవడం చాలా సులభం, ఎక్కువ సమయం కూడా పట్టదు. దమ్ టీని మీరు తాగాలనుకుంటే ఏమేం పదార్థాలు అవసరం అవుతాయి, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. ఈ కింద దమ్ టీ రెసిపీ అందించాం, ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు దమ్ టీని తయారు చేసుకోవచ్చు.
Dum Tea Recipe కోసం కావలసినవి
- 2 కప్పు పాలు
- టీ పొడి ఒకటిన్నర టీస్పూన్
- తాజా అల్లం రెండు చిన్న ముక్కలు
- 4 లవంగాలు
- 2 ఏలకులు
- 2 దాల్చినచెక్క చిన్న ముక్కలు
- 4-5 తులసి ఆకులు
- 2 స్పూన్ల పంచదార
దమ్ టీ ఎలా తయారు చేయాలి?
- ముందుగా ఒక చిన్న స్టీల్ గ్లాస్ తీసుకొని దాని మూతపై శుభ్రమైన కాటన్ గుడ్డను గట్టిగా చుట్టాలి.
- ఇప్పుడు ఆ గుడ్డపై టీపొడి, పంచదార వేసి, ఆ తర్వాత మిగతా పదార్థాలను వేయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెలో కొన్ని 1 కప్పు నీళ్లు మరిగించండి.
- మరుగుతున్న నీటిలో స్టీల్ గ్లాసు ఉంచి మూతపెట్టండి, కొన్ని నిమిషాలు ఉడికించండి.
- గిన్నెలో తయారయ్యే ఆవిరితో స్టీల్ గ్లాసులో చుక్కచుక్కలుగా డికాషన్ ఫిల్టర్ అవుతుంది.
- ఇప్పుడు ఒక కప్పు వేడి పాలలో ఈ ఫిల్టర్ అయిన డికాషన్ కలిపితే అదే దమ్ టీ.
ఒకసారి ఇలా దమ్ టీ మీరూ తయారు చేసుకోండి, రుచిని ఆస్వాదించండి.