Egg Makhani Recipe। ఎగ్ మఖానీ.. చూస్తే నోరూరుతుంది, రుచి మైమరపించేలా ఉంటుంది!
28 July 2023, 14:15 IST
- Egg Makhani Recipe: రుచికరమైన ఎగ్ మఖానీని ఇంట్లో కూడా సులభంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్ మఖానీ రెసిపీని అందిస్తున్నాం.
Egg Makhani Recipe
Quick Recipes Telugu: తక్కువ సమయంలో ఎక్కువ రుచికరంగా ఏదైనా చేసుకోవడానికి ఎగ్ రెసిపీలు మనకు మంచి ఛాయిస్ అవుతాయి. కోడిగుడ్డును ఫ్రై చేసినా, ఉడికించినా ఏం చేసినా, ఎలా చేసినా ఆ వంటకం రుచికరంగానే ఉంటుంది. చాలా సులభంగా, త్వరగా చేసుకోవచ్చు, గుడ్డు మంచి పోషకాహారం కూడా. ఇక్కడ మీకు ఎగ్ మఖానీ రెసిపీని అందిస్తున్నాం. దీనినే ఎగ్ బటర్ మసాలా అని కూడా పిలుస్తారు.
సాధారణంగా మనం ఎగ్ మఖానీని రెస్టారెంట్లలో, దాబాలోనే తింటుంటాం. పనీర్ బటర్ మసాలా లేదా బటర్ చికెన్‌ని నివారించాలనుకునే ఎగ్ మఖానీ మంచి ప్రత్యామ్నాయం. వెన్నలో కాల్చిన గుడ్డుతో దీని గ్రేవీ రుచి అద్భుతంగా ఉంటుంది. ప్లెయిన్ రైస్, రోటీ, పులావ్, జీరా రైస్, బటర్ నాన్ , బిర్యానీతో దీనిని తింటే చాలా బాగుంటుంది. ఎగ్ మఖానీని ఇంట్లో కూడా సులభంగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చో ఈ కింద సూచనలు చదవండి.
Egg Makhani / Egg Butter Masala Recipe కోసం కావలసినవి
- 4 ఉడికించిన గుడ్లు
- 2 టేబుల్ స్పూన్లు వెన్న
- 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు
- 1 కప్పు టమోటా ముక్కలు
- కొన్ని జీడిపప్పులు
- 1/2 స్పూన్ కారం పొడి
- 1/4 స్పూన్ పసుపు
- 2 లవంగాలు
- 2 ఏలకులు
- 1 స్టిక్ దాల్చిన చెక్క
- 1/2 స్పూన్ గరం మసాలా
- 1/2 స్పూన్ ధనియాల పొడి
- 1/4 టీస్పూన్ కసూరి మేతి
- 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- ఉప్పు రుచికి తగినంత
ఎగ్ బటర్ మసాలా/ ఎగ్ మఖానీ తయారీ విధానం
- ముందుగా ఒక పాన్‌లో 1 టేబుల్ స్పూన్ వెన్నను వేడి చేయండి, వెన్న కరిగి వేడయ్యాక, ఒక ఫోర్క్‌తో గుడ్లకు రంధ్రాలు చేసి వాటిని వెన్నలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. పూర్తయ్యాక పక్కన తీసి పెట్టండి.
- ఇప్పుడు అదే పాన్‌లో ఉల్లిపాయలు, జీడిపప్పు, టొమాటోలు, ఆపైన కొద్దిగా ఉప్పు వేసి మీడియం మంట మీద వేయించాలి. టమోటాలు మెత్తగా అయ్యాక కారం, పసుపు వేసి కలపాలి.
- ఇప్పుడు ఉడికిన ఈ టామోట మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ జార్ లోకి తీసుకొని, 3/4 కప్పు నీరు కలిపి, చిక్కని ప్యూరీలాగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు పాన్‌లో మరో టేబుల్ స్పూన్ వెన్న వేడి చేసి దాల్చిన చెక్క, ఏలకులు , లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి వేయించాలి.
- ఈ దశలో ఇది వరకు రుబ్బుకున్న ప్యూరీని పాన్‌లో వేసి వేయించాలి, గ్రేవీ కోసం మరికొన్ని నీళ్లు కలపండి. గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించాలి.
- ఆపైన గరం మసాలా, ధనియాల పొడి వేసి ఉడికించాలి. అనంతరం కసూరి మేతి వేసి 1 నుండి 2 నిమిషాలు ఉడికించాలి.
- చివరగా వెన్నలో వేయించిన గుడ్లు వేసి కలపాలి, స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే, ఘుమఘులాడే ఎగ్ మఖానీ రెడీ. వేడిగా తింటూ ఆనందించండి.