Parenting tips: పిల్లల విషయంలో నాన్నల కన్నా తల్లులు ఉత్తమంగా చేసే పనులు ఇవే
16 December 2023, 16:00 IST
- Parenting tips: తల్లిదండ్రులు పిల్లలే లోకంగా జీవిస్తారు. పిల్లలకు చెందిన విషయాల్లో కొన్నింటిలో తండ్రుల కన్నా తల్లులే ఉత్తమంగా ఆలోచిస్తారు.
తల్లీ పిల్లల అనుబంధం
Parenting tips: పిల్లల పెరుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం. తల్లిదండ్రులు ఇద్దరూ క్రమశిక్షణగా ఉంటేనే వారి ఆధ్వర్యంలో పెరిగే పిల్లలు కూడా ఆ లక్షణాలను తెచ్చుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి బలాలు, నైపుణ్యాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహించే విధంగా ఉండాలి. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులిద్దరిలో తల్లే ఉత్తమంగా ఉంటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. అలాగే కొన్ని విషయాల్లో తండ్రులతో పోలిస్తే తల్లులే పిల్లలను చక్కగా చూసుకుంటారని తేలింది. ఏ అంశాల్లో తల్లులు పిల్లలను తండ్రుల కన్నా ఉత్తమంగా చూసుకుంటారో తెలుసుకుందాం.
1. పిల్లలకు పోషణ విషయంలో పుట్టిన క్షణం నుంచి పెద్దయ్యే వరకు భావోద్వేగాలపరంగా మద్దతు ఇచ్చేది తల్లి మాత్రమే. తల్లికి ఆ సామర్థ్యం ఎక్కువ. ఓదార్పు, సంరక్షణ, భావోద్వేగాల విషయంలో తల్లిని మించి ఎవరూ పిల్లలను చూడలేరు. తల్లీ బిడ్డల మధ్య లోతైన భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఆ బంధం భద్రతను, ప్రేమను పిల్లలకు అందిస్తుంది. తండ్రి ఎంతగా ప్రయత్నించినా తల్లి ఇచ్చే భావోద్వేగ మద్దతును ఇవ్వలేరు.
2. తల్లులు పిల్లల విషయంలో అసాధారణమైన మల్టీ టాస్కింగ్ టాలెంటును కలిగి ఉంటారు. ఇంటి పనులతో పాటు పిల్లల పనులు చక్కగా చేస్తారు. ఏకకాలంలో వారు ఎన్నో పనులను చేయగలరు. అది పిల్లలను ఎంతో ఆకర్షిస్తుంది.
3. తల్లులు భావోద్వేగాలపరంగా తెలివైన వారు. వారు పిల్లల భావాలను అర్థం చేసుకుంటారు. పరిస్థితులకు తగినట్టు ప్రతిస్పందిస్తారు. వారిలో కలిగే సున్నితమైన మార్పులను కూడా అర్థం చేసుకొని వారిని ఓదారుస్తారు. వారి మధ్య ఉండే భావోద్వేగాలు బలమైన బంధాలను నిర్మించడంలో సహాయపడతాయి. తల్లి వల్లే పిల్లల్లో ఆరోగ్యకరమైన భావోద్వేగాల అభివృద్ధి జరుగుతుంది.
4. తల్లికి శక్తివంతమైన అంతర్దృష్టి ఉంటుంది. పిల్లల్లో కలిగే ఆందోళనను ముందే పసిగట్టగల అసాధారణ సామర్థ్యం తల్లికి ఉంటుంది. తండ్రికి ఇలాంటి సామర్థ్యం ఉండదు. ఈ విషయంలో తల్లులు పిల్లల సమస్యలను పరిష్కరించగలుగుతారు. వారికి అవసరమైన మద్దతును సంరక్షణను ఇస్తారు.
5. తండ్రులతో పోలిస్తే తల్లులు ఇంటి వాతావరణాన్ని ఆనందంగా ఉంచగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇంటిని చక్కగా అలంకరించి రుచికరమైన భోజనం వండడం, పిల్లలను ఇంటి వాతావరణానికి అలవాటు చేయడం వంటివి చేయగలరు. వారికి ఇంటిపై శ్రద్ధను, ప్రేమను పెంచే పనులు చేయగలరు.
6. పేరెంటింగ్ అనేది అంత సులువు కాదు. సవాలతో నిండిన ప్రయాణం. తల్లులు ఎంతో సహకారం, ఓర్పును ప్రదర్శిస్తారు. కానీ తండ్రుల్లో ఇది కొరవడుతుంది. పిల్లలకు అవసరమైనప్పుడు మార్గ నిర్దేశం చేయడంలో, వారి రోజువారీ పనులను నిర్వహించుకోవడంలో, వారు కష్టాలను ఎదుర్కొనే దృఢత్వాన్ని అందించడంలో తల్లుల సహకారం ఎక్కువ.
7. జీవితంలో బతికేందుకు అవసరమైన జీవన నైపుణ్యాలను పెంపొందించే విషయంలో పిల్లలకు తల్లులు ప్రాథమిక విద్యావేత్తలుగా ఉంటారు. షూలేస్ కట్టుకోవడం దగ్గర నుంచి భోజనం తినే వరకు అన్ని విషయాలు పిల్లలకు నేర్పించడంలో తల్లులదే కీలక పాత్ర. ఈ అంశాలను తల్లుల నుంచే పిల్లలు చక్కగా నేర్చుకోగలుగుతారు.
టాపిక్