Tuesday Motivation: ఎలన్ మస్క్ నుండి నారాయణమూర్తి వరకు విజయవంతమైన బిలియనీర్ల నుండి నేర్చుకోవాల్సిన అలవాట్లు ఇవే
19 November 2024, 5:30 IST
- Tuesday Motivation: విజయం అనేది ఒక రోజులో, ఒక వారంలో వచ్చేది కాదు. దాని వెనకాల ఎంతో కష్టం ఉంది. ఎలన్ మస్క్, నారాయణమూర్తి, రతన్ టాటా వంటి వారిని చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది.
మోటివేషనల్ స్టోరీ
ఒక వ్యక్తిని గొప్ప వాడిని చేయాలన్నా, అధముడిని చేయాలన్నా... ఆ శక్తి అతని అలవాట్లకే ఉంది. మీ అలవాట్లే మిమ్మల్ని జీవితాన్ని నడిపిస్తాయి. మీకు మంచి అలవాట్లు ఉంటే మీరు ఆనందంగా జీవిస్తారు. విజయాన్ని అందుకుంటారు. చెడు అలవాట్లు ఉంటే మీ జీవితం ఎక్కడో చోట ఆగిపోతుంది. చెడు పేరుతో మీరు మిగిలిపోతారు. ఎలన్ మస్క్, నారాయణమూర్తి, రతన్ టాటా వంటి బిలియనీర్లు అంతా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి తమకున్న మంచి అలవాట్లతో ఎదిగిన వారే. వారి నుంచి మనం ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు.
ఎలన్ మస్క్
ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిలియనీర్లలో ఒకరు ఎలన్ మస్క్. ప్రతిరోజూ చేయాల్సిన పనులను ముందే మ్యాప్ చేసి పెట్టుకుంటారు. మరింత ఉత్పాదకత కలిగి ఉండేలా చూస్తారు. సమయాన్ని ఏ మాత్రం వృధా చేయరు. ఏ రోజు చేయాల్సిన పనులను ఆ రోజే చేస్తారు. అత్యంత ముఖ్యమైన సమావేశాలను రోజు మొదలయ్యే ప్రారంభంలోనే పూర్తి చేస్తారు.
నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. ఈయన ఎక్కువ పని గంటలను సమర్థిస్తూ ఉంటారు. ఎక్కువ పని చేస్తే ఎక్కువ విజయం అందుకోవచ్చు అని చెబుతారు. ఏదైనా సాధించాలంటే కష్టానికి ప్రత్యామ్నాయం లేదని అంటారు. కష్టపడితే జీవితంలో ఏదీ సాధించలేమని చెబుతారు. ఆ కష్టమే తనను బిలియనీర్‌ను చేసిందని అంటారు.
బిల్ గేట్స్
బిల్ గేట్స్ బిలియనీరే కాదు.. తాను సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం పరోపకారానికి ఉపయోగిస్తున్నారు. అతను చదువుకు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువ. ప్రపంచంలో ఎంతోమందిని విద్యావంతులుగా మార్చేందుకు తన వంతు సాయాన్ని చేస్తూనే ఉన్నారు. చదువు అనేది ప్రపంచ దృష్టి కోణాన్ని మారుస్తుందని అంటారు. చదువే... జ్ఞానాన్ని అందిస్తుందని చెబుతారు. అందుకే చదువు కోసమే ఆయన ఎంతో ఖర్చు పెడతారు.
జెఫ్ బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడుగానే మనకు జెఫ్ బెజోస్ తెలుసు. ఆయన ప్రతిరోజూ ఉదయం ఐదున్నరకే తన పనిని మొదలుపెడతారు. అలాగే రాత్రి చాలా త్వరగా పనిని ముగించి నిద్రపోతారు. ఉదయాన త్వరగా లేవడం, రాత్రి త్వరగా పడుకోవడం అనేది ఆరోగ్యంతో పాటు చురుకుదనాన్ని అందిస్తుందని ఆయన చెబుతారు. పొద్దున్నే లేచి పనులు ప్రారంభించడం వల్ల లక్ష్యానికి తగినట్టు పనిచేయగలమని అంటారు.
మార్క్ జుకర్ బర్గ్
ఫేస్‌బుక్ సీఈఓగా చాలా చిన్న వయసులోనే సక్సెస్ అయిన వ్యక్తి మార్క్ జుకర్ బర్గ్. అతను ఎంత డబ్బులు ఉన్నా సాధారణ జీవితాన్ని జీవిస్తాడు. అనవసరంగా ఖర్చు చేయడు. చాలా తెలివిగా ఖర్చు చేస్తాడు. అతనికి పొదుపు చేయడం అంటే ఎంతో ఇష్టం. అలాగే పెట్టుబడి కూడా జాగ్రత్తగా పెడతాడు. మీరు కూడా డబ్బును ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం మాని, పొదుపుగా ఉండేందుకు ప్రయత్నించండి.
వారెన్ బఫెట్
ప్రపంచంలోని బిలినియర్లలో వారెన్ బఫెట్ ఒకరు. జీవితంలో ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పరచుకోవడం ఎంతో ముఖ్యమని చెబుతారు. స్నేహితులు బలవంతం పెట్టారని, పిల్లలు అడిగారను చెడు అలవాట్లను నేర్చుకోవాల్సిన అవసరం, వారికి నేర్పాల్సిన అవసరం లేదు. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి పనికీ ఒక సరిహద్దును గీసుకోవడం ఎంతో ముఖ్యమని అంటారు వారెన్ బఫెట్.