Cool Places in AP: వేసవిలో విశాఖపట్నానికి వెళితే కచ్చితంగా చూడాల్సిన చల్లటి ప్రదేశాలు ఇవే
03 May 2024, 13:30 IST
- Cool Places in AP: వేసవిలో ఎంతోమంది టూర్లు ప్లాన్ చేస్తూ ఉంటారు అలా ఆంధ్రప్రదేశ్లోని విశాఖకు వెళ్లేవారు కూడా ఎంతోమంది విశాఖలో కచ్చితంగా చూడాల్సిన చల్లటి ప్రాంతాలు జాబితా ఇదిగో
లంబసింగిలోని జలపాతం
Cool Places in AP: వేసవి వస్తే నాలుగైదు రోజుల పాటు అలా ట్రిప్ వేసేవారు ఎంతోమంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నవారు ఏపీకు రావాలనుకుంటే, ఏపీలో ఉన్నవారు తెలంగాణలోని ప్రదేశాలను చూడటానికి వెళ్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలకు అయ్యే ఖర్చు తక్కువే. తెలంగాణ నుంచి ఏపీలో విశాఖకు ఓ నాలుగు రోజులు పాటు ట్రిప్ వేసుకోండి. కుటుంబంతో చూసేందుకు ఇక్కడ పచ్చటి ప్రదేశాలు, చల్లటి ప్రదేశాలు, కొండలు ఎన్నో ఉన్నాయి. వేసవిలో కూడా చల్లదనాన్ని పెంచే ప్రకృతి అందాలు విశాఖలో ఎక్కువే.
చింతపల్లె
వేసవి కాలంలో ఏపీలో చల్లగా ఉండే ప్రాంతాల్లో చింతపల్లె ఒకటి. ఇది సముద్రమట్టానికి 839 మీటర్ల ఎత్తులో ఉంటుంది. విశాఖపట్నానికి సమీపంలో ఉన్న ప్రాంతం ఇది. దీని చుట్టూ సహజమైన అడవులు ఉంటాయి. ఎన్నో జలపాతాలు, తోటలు స్వాగతం పలుకుతూ ఉంటాయి. వారం రోజులు పాటూ కుటుంబంతో సంతోషంగా ఈ చింతపల్లెలో చక్కర్లు కొట్టవచ్చు. ట్రెక్కింగ్, హైకింగ్, రాత్రిపూట క్యాంపింగ్ వంటి సౌకర్యాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. విశాఖకు వచ్చినవారు కచ్చితంగా చింతపల్లి గ్రామాన్ని చూసే వెళ్లాలి. విశాఖ ఏజెన్సీలో ఉన్న ఒక గ్రామం ఇది. శీతాకాలంలో చింతపల్లిలో కేవలం మూడు డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదు అవుతుంది.
అరకు
విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది అరకు. అరకు కాఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ కుటుంబంతో ఎంతో సంతోషంగా మీ సెలవులను గడిపేందుకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇది విశాఖపట్నం నగరానికి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక కొండ ప్రాంతం. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి చల్లగా అనిపిస్తుంది. అరకు లోయలు, బొర్రా గుహలు, ఎన్నో సినిమాలు షూటింగులకు నిలయంగా మారాయి. ఇక్కడ ఎన్నో ఫోటోషూట్లు కూడా జరుగుతాయి. అరకు వెళ్లారంటే జలపాతాలు, ఎత్తయిన వంతెనలు, గుహలు, రుచికరమైన ఆహారం పర్యాటకులకు కనువిందు చేస్తాయి. విశాఖ వెళ్లేవారు కచ్చితంగా అరకును చూడాల్సిందే. ఇక శీతాకాలంలో అరకు వెళ్లారంటే స్వర్గంలో ఉన్నట్టే అనిపిస్తుంది. మేఘాలు కళ్ళముందే తెలియాడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా శీతాకాలంలో అల్పంగా నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే నమోదు అవుతూ ఉంటుంది.
లంబసింగి
విశాఖలోని ఏజెన్సీ గ్రామాల్లో లంబసింగి ఒకటి. ఇది ఏపీలోనే అతి చల్లని ప్రదేశాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇది కూడా ఒక ఏజెన్సీ గ్రామం. సముద్రమట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందుకే ఇది చాలా కూల్‌గా ఉంటుంది. ఏపీలో ఉన్న కాశ్మీర్ గా లంబసింగి పేరు తెచ్చుకుంది. ఇక్కడ గిరిజనులు చాలా ప్రత్యేకంగా ఉంటారు. లంబసింగి ప్రాంతమంతా ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. చూడ చక్కని జలపాతాలు, లోయలు, కొండలు, పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఒక వారం రోజులు విశాఖలో ఉంటే మీరు లంబసింగి, అరకు, చింతపల్లితో పాటు ఇంకా ఎన్నో ప్రాంతాలు చూడవచ్చు. విశాఖ నగరంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. విశాఖ పోర్టు, ఆ పోర్టుకు దగ్గరలోనే ఉన్న రామకృష్ణ బీచ్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఎప్పుడూ ఈ బీచ్ జనాలతో నిండి ఉంటుంది.
విశాఖకు వెళ్తే చూడాల్సిన ప్రాంతాల జాబితా ఎక్కువే. సొంత కారు ఉంటే ఎక్కువ ప్రాంతాలను కవర్ చేయవచ్చు.