Monsoon Health Guide । వర్షాకాలంలో ఈ సమస్యలు సాధారణం, వాటిని ఇలా నివారించండి!
12 July 2022, 17:49 IST
- వర్షాకాలంలో జలుబు, జ్వరంతో పాటు అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సీజన్లో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు అలాగే వాటి నివారణ చర్యల గురించి తెలుసుకోండి.
Monsoon Health Care
వర్షాకాలం రావటంతో పాటు అనేక వ్యాధులను కూడా ఈ సీజన్ మోసుకొస్తుంది. ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. అలాగే అంటువ్యాధులు, కంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఏ వయసు వారైనా వర్షాకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం తప్పదు. కాబట్టి ఈ వర్షాకాలంలో వర్షాన్ని ఆనందిస్తూనే మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే మనకు ఇష్టమైనవి తినవచ్చు, వర్షాన్ని ఎంజాయ్ చేయవచ్చు.
మరి ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి? వాటిని సులభంగా ఎలా నివారించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
చర్మ వ్యాధులు
వర్షాకాలంలో చర్మవ్యాధులు, దురద లాంటివి ఎక్కువగా వస్తాయి. మొఖంపై ముటిమలు, కాళ్లకు పగులు, అలాగే తేమ కారణంగా చర్మం చెడిపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే పలు రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకుతాయి. దీన్ని నివారించడానికి మన శరీరాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. వర్షంలో తడిసిన వెంటనే బట్టలు మార్చుకోండి. శరీర పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కంటి సమస్యలు
కంటి ఫ్లూ వర్షాకాలంలో వచ్చే ఒక సాధారణమైన సమస్య. కళ్లలో మంట, వాపు, నీరు రావడం, కళ్లు అంటుకోవడం, కళ్లలో నొప్పి మొదలైనవి దీని లక్షణాలు. దీనిని నివారించడానికి, మీ కళ్ళను ప్రతిరోజు శుభ్రమైన నీటితో కడుగుతూ ఉండాలి. తీవ్రత ఎక్కువ ఉంటే వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి.
కడుపు నొప్పి
వర్షాకాలంలో జీర్ణక్రియ బలహీనంగా ఉండటం వల్ల కడుపు నొప్పి అనేది సాధారణంగా వచ్చే సమస్య. విరేచనాలు, వాంతులు, ఈ సీజన్‌లో తరచుగా వస్తుంటాయి. దీనిని నివారించేందుకు ఈ సీజన్‌లో ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. బయట తినకండి. తేలికైన ఆహారాన్ని తినండి. వేడిగా ఉన్నప్పుడే తినండి. భోజనం చేసిన తర్వాత కొద్దిగా నడవడం అలవాటు చేసుకోండి.
మలేరియా, డెంగ్యూ/డెంగీ
వర్షాల కారణంగా నేల జలమయమవుతుంది. నీరు నిలుస్తుంది. ఈ నిలిచిన నీటిలో దోమలు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఈ దోమల వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా డెంగీ చాలా ప్రమాదకరమైనది. ఇది వచ్చినట్లు కూడా మనకు తెలియదు. ఇది రక్తంలోని ప్లేట్‌లెట్ కౌంట్‌ను వేగంగా తగ్గించే జ్వరం, ప్రాణాంతకం కూడా. కాబట్టి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమల నివారణ చర్యలు తీసుకోండి. కుండీలలో, కూలర్లలో నీరు నిల్వలేకుండా చూసుకోండి. పోషకాహారం తినండి.
ఫుడ్ పాయిజనింగ్
వర్షాకాలంలో ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. కలుషిత ఆహారం తిన్నప్పుడు కడుపులో నొప్పి, వికారం, వాంతులు అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా శరీరంలో బలహీనంగా అనిపించడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కాలంలో ఆహారంపై జాగ్రత్తలు అవసరం. సలాడ్ వంటి పచ్చి ఆహారాన్ని తినవద్దు. రోడ్డు పక్కన దొరికే చాట్ తినడం మానుకోండి. సీఫుడ్ తినకండి. మాంసాహారం తగ్గించండి. దేనినైనా బాగా ఉడికించుకొని తినండి.