Snowfall in India । స్విట్జర్‌ల్యాండ్ కాదు.. ఇండియాలో హిమపాతం కురిసే ప్రదేశాలు బోలెడు!
17 November 2022, 21:53 IST
- Snowfall in India: హిమపాతం చూడటానికి, మంచులో ఆటలాడటానికి స్విట్జర్‌ల్యాండ్ వంటి దేశాలకు వెళ్లాల్సిన పనిలేదు, ఇండియాలోనే అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి.
Snowfall in India:
ముంచుతో ఆటలు ఆడేందుకు, అడ్వెంచర్లు చేసేందుకు మీరు శీతల దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. భారతదేశంలోనే మీరు హిమపాతాన్ని చూడగలిగే కొన్ని గమ్యస్థానాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ శీతాకాలంలో ఈ ప్రదేశాలకు వెళ్తే మీరు యూరోపియన్ దేశంలో ఉన్నట్లు అనుభూతి చెందుతారు. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ బ్యాగులు సర్దుకొని ఛలో హిమాలయా.
ఈ శీతాకాలంలో హిమపాతంను కనులారా వీక్షించి పరవశించేందుకు కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఏయే ప్రాంతాలు ఉత్తమమైనవో, ఏ నెలలో సందర్శిస్తే మంచిదో ఇక్కడ జాబితా చేశాము, చూడండి.
లేహ్, లద్దాఖ్
ఈ ప్రదేశం ' బైకర్ల తీర్థయాత్ర' గా ప్రసిద్ధి చెందింది, లేహ్ దాని చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. బైక్ రైడింగ్ చేస్తూ హిమపాతం ఆస్వాదించగలిగే ప్రదేశం ఇదే. భారీ హిమపాతాన్ని అనుభవించడానికి మీరు నుబ్రా వ్యాలీ నుంచి పాంగోంగ్ సరస్సులను సందర్శించవచ్చు.
ముస్సోరీ, ఉత్తరాఖండ్
ఈ ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అని కూడా పిలుస్తారు, ఈ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం డెహ్రాడూన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య ఇక్కడకు వెళ్తే హిమపాతాన్ని చూడవచ్చు.
చోప్తా, ఉత్తరాఖండ్
ఇక్కడ హిమపాతం నవంబర్ నెలలో మొదలై మార్చి వరకు ఉంటుంది. చలికాలంలో చోప్తాలోని ఉత్తమమైనవి చూడవచ్చు కాబట్టి ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రదేశాన్ని సందర్శించే అవకాశాన్ని కోల్పోకండి.
మనాలి, హిమాచల్ ప్రదేశ్
మీరు మొదటిసారి మనాలిని సందర్శిస్తున్నట్లయితే, మీ హృదయాన్ని అక్కడే వదిలి వేస్తారు. ఈ ప్రదేశం నుంచి తిరిగి వెళ్లాలని మీకు అస్సలు అనిపించదు, అంత అద్భుతంగా ఉంటుంది మంచుతో ఈ ప్రదేశం.
ఔలి, ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్‌లోని ఔలి ఈ చిన్న పట్టణం భారతదేశంలోని ప్రధాన స్కీ రిసార్ట్ గమ్యస్థానాలలో ఒకటి. ఈ ప్రాంతం అంతటా శంఖాకార అడవులు, విశాలమైన పచ్చికభూములు విస్తరించి ఉన్నాయి. మంచుకురిసే వేళలో ఇక్కడ ప్రకృతి సౌందర్యాలు మహాద్భుతంగా కనిపిస్తాయి.
గుల్మార్గ్, జమ్మూ- కాశ్మీర్
జమ్మూ -కాశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంత అందాల గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. తన సహజ సౌందర్యంతో మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే ఈ ప్రదేశం పశ్చిమ హిమాలయాలలోని పీర్ పంజాల్ శ్రేణిలో ఉంది. గుల్మార్గ్ సందర్శించడానికి ఉత్తమ సమయం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య ఉంటుంది.
హిమపాతం చూసేందుదుకు జమ్మూ -కాశ్మీర్‌లోనే మరొక ప్రసిద్ధ గమ్యస్థానం సోన్‌మార్గ్. శీతాకాలంలో ఈ ప్రదేశం మీకు గొప్ప అనుభవాలను అందిస్తుంది. మీరు సంవత్సరంలో ఏ సమయంలోనైనా సోన్‌మార్గ్‌ని సందర్శించవచ్చు, అయితే హిమపాతం చూడాలనుకుంటే నవంబర్ `నుంచి ఏప్రిల్ మధ్య సందర్శించాలి.
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్
భారతదేశానికి ఈశాన్యంగా, చైనా సరిహద్దుకు దగ్గరగా ఉండే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హిమపాతం వీక్షించవచ్చు, ఇక్కడ హిమపాతం నవంబర్ నుంచి మొదలై నుండి మే వరకు కొనసాగుతుంది. అయితే నవంబర్ చివరి వారాలు- డిసెంబర్ మొదటి వారాల మధ్య భారీ హిమపాతం ఆస్వాదించడానికి మంచి సమయం.