Pancreatic cancer: పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సూచించే 10 లక్షణాలు ఇవే
08 January 2024, 21:53 IST
- Pancreatic cancer: పాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సూచించే 10 లక్షణాలను వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
పాంక్రియాటిక్ క్యాన్సర్‌లో కడుపు నొప్పి ఒక లక్షణం
ప్యాంక్రియాస్ అనేది కడుపు దిగువ భాగంలో ఉన్న ఒక అవయవం. జీర్ణక్రియలో, మెటబాలిజంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒక అరుదైన రకమైన క్యాన్సర్. సాధారణంగా ప్యాంక్రియాస్ నాళాల లైనింగ్‌లో ప్రారంభమవుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు అరుదుగా కనిపిస్తాయి. క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు అవి కనిపిస్తాయి. ఎందుకంటే క్లోమం శరీరం లోపల మూలల్లో ఉంటుంది. సాధారణ పరీక్షల సమయంలో ప్రారంభ కణితులను గుర్తించలేం. ధూమపానం, మధుమేహం, దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ వాపు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ, కొన్ని జన్యు సిండ్రోమ్‌లు మీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాలను పెంచుతాయి. కళ్ళు పసుపు రంగులోకి మారడం, చర్మం దురదగా ఉండడం, నిరంతర కడుపు నొప్పి, బరువు తగ్గడం వంటి సంకేతాలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను సూచిస్తాయి. వీటిని తేలికగా తీసుకోకూడదు.
మారెంగో క్యూఆర్‌జీ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ బీర్ సింగ్ సెహ్రావత్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు, లక్షణాల గురించి వివరించారు.
‘ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్న రోగులలో అత్యంత సాధారణ హెచ్చరిక సంకేతాలు నొప్పి, కామెర్లు, బరువు తగ్గడం..’ అని డాక్టర్ సెహ్రావత్ చెప్పారు.
1. Persistent abdominal pain: నిరంతరం కడుపు నొప్పి
పాంక్రియాస్ మీ కడుపు వెనకభాగంలో ఉంటుంది. ఇక్కడ వచ్చే నొప్పిని నిర్లక్ష్యం చేయరాదు. ఇది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. పాంక్రియాటిక్ క్యాన్సర్‌లో అత్యంత సాధారణంగా కనిపించే లక్షణం.
2. Back pain: వెన్ను నొప్పి
క్యాన్సర్ పాంక్రియాస్ చుట్టూ ఉన్న నరాలకు పాకినప్పుడు వెన్నునొప్పి ప్రారంభమవుతుంది. తరచుగా వెన్నునొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించడం మేలు.
3. Itchy skin: దురద
చర్మం దురదగా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి. పాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా అందులో ఒకటి. చర్మంలో బైలురుబిన్ పెరిగిన కొద్దీ దురద పెరుగుతుంది. అలాగే జాండిస్ కారణంగా చర్మం పసుపు రంగులోకి మారుతుంది.
4. Unexplained weight loss: అకారణంగా బరువు తగ్గడం
బరువు తగ్గడానికి విభిన్న కారణాలు ఉన్నాయి. మరి పాంక్రియాటిక్ క్యాన్సర్ అనే ఎందుకు అనుకోవాలి? క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ శరీరంలో సత్తువ కోల్పోతారు. బరువు కోల్పోతారు. కడుపులో ట్యూమర్ ఒత్తిడి కారణంగా మీకు ఎప్పుడూ కడుపులో నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. పాంక్రియాస్ సక్రమంగా విధులు నిర్వర్తించని పరిస్థితిలో జీర్ణక్రియకు తగిన రసం ఉత్పత్తికాదు.
5. Gastrointestinal issues: జీర్ణాశయ సమస్యలు
లైట్ కలర్‌లో, జిడ్డులా, లేదా నీళ్లలా విరేచనాలు, మలంలో విపరీతమైన దుర్వాసన ఉండడం పాంక్రియాటిక్ క్యాన్సర్‌కు లక్షణాలు. పిత్తవాహిక అడ్డుపడినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. బైలురుబిన్ మీ మలంలోకి రాకుండా అడ్డుపడుతుంది. మీ శరీరం కొవ్వులను జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది.
6. Yellowing of the skin and eyes: కళ్లు, చర్మం పచ్చగా
మీ చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారినట్లయితే మీరు విస్మరించకూడదు. కాలేయ వ్యాధి, హెపటైటిస్ వంటి పరిస్థితులు కామెర్లను కలిగించవచ్చు. ప్యాంక్రియాస్ చివరిలో ఒక చిన్న కణితి కామెర్లకు కారణం కావచ్చు.
7. Dark urine: ముదురు రంగులో మూత్రం
ముదురు రంగుంలో మూత్రం రావడం కామెర్లకు సంకేతంగా చాలా మంది అనుకుంటారు. కానీ బైలిరుబిన్ స్థాయి పెరగడం వల్ల మూత్రం రంగు బ్రౌన్ కలర్‌లోకి వెళుతుంది.
8. Sudden onset of diabetes: అకస్మాత్తుగా డయాబెటిస్ రావడం
మీరు వృద్ధాప్యంలో అకస్మాత్తుగా మధుమేహానికి గురైతే దానిని తేలిగ్గా తీసుకోకండి. పాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా ఆకస్మిక డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఇన్సులిన్ తయారు కాకుండా కణాలను దెబ్బతీస్తుంది. దీంతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
9. Blood clots: రక్తం గడ్డకట్టడం
పెద్ద సిరలో రక్తం గడ్డకడితే అది పాంక్రియాటిక్ క్యాన్సర్‌కు లక్షణం కావొచ్చు. కాలు ఎర్రగా, వాపుగా, నొప్పిగా అనిపించవచ్చు. రక్తం గడ్డకట్టినప్పుడు దానిలో కొంత భాగం మీ ఊపిరితిత్తులకు కూడా ప్రయాణించవచ్చు. దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది.
10. Unexplained fatigue: వివరించలేని అలసట
మీరు ఎటువంటి కారణం లేకుండా చాలా అలసిపోయినట్లు అనిపిస్తే, మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్‌లు కూడా మిమ్మల్ని విపరీతంగా అలసిపోయేలా చేస్తాయి. మీ సాధారణ రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయి.