American Dream Car | ప్రపంచంలోనే అతి పొడవైన కారు.. మరో గిన్నిస్ రికార్డు!
11 March 2022, 16:20 IST
- ఈ కారులో కూర్చుడానికే సీట్లే కాదు.. ఈతకొట్టడానికి స్విమ్మింగ్ పూల్, పడుకోటానికి ఒక పెద్ద వాటర్ బెడ్, ఆడుకోవడానికి మినీ-గోల్ఫ్ కోర్స్, ఎగిరిపోవడానికి ఒక హెలిప్యాడ్ ఇలా ఒకటేమిటి? ఎన్నో సౌకర్యాలున్నాయి. ఒకరుఇద్దరు కాదు ఏకంగా 75 మంది ఈ కారులో ప్రయాణించవచ్చు.
The American Dream Car
New York | జోరుగా కారులో షికారుకి పోతే ఎలా ఉంటుంది? వేరే ఏదో కారులో ఎలా ఉంటుందో కానీ, ఇలాంటి ఒక కారులో షికారు చేస్తే మాత్రం కచ్చితంగా ఎంతో హుషారుగా ఉంటుంది. ఎందుకంటే ఈ కారులో కూర్చుడానికే సీట్లే కాదు.. ఈతకొట్టడానికి స్విమ్మింగ్ పూల్, పడుకోటానికి ఒక పెద్ద వాటర్ బెడ్, ఆడుకోవడానికి మినీ-గోల్ఫ్ కోర్స్, ఎగిరిపోవడానికి ఒక హెలిప్యాడ్ ఇలా ఒకటేమిటి? ఎన్నో సౌకర్యాలున్నాయి. ఒకరుఇద్దరు కాదు ఏకంగా 75 మంది ఈ కారులో ప్రయాణించవచ్చు.
ఏందయ్యా ఇదీ.. అది కారేనా లేక కారు ఆకారంలో ఉన్న ఏదైనా పెద్ద నౌక అనుకుంటున్నారా? కచ్చితంగా రోడ్డు మీద ప్రయాణించే కారే. ఈ కారు ఏకంగా 100 అడుగుల పొడవు ఉంటుంది. దీనికి 'ది అమెరికా డ్రీమ్' అని పేరుపెట్టారు. ప్రపంచంలోనే అతిపొడవైన కారుగా ఇది గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి రెండు సార్లు ఎక్కింది.
నిజానికి ఈ కారు 1986లోనే ప్రపంచంలోనే అతిపొడవైన కారుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందింది. అప్పుడు దీని పొడవు సుమారు 60 అడుగులు ఉండేది. అప్పట్నించీ దీనిని వివిధ కార్యక్రమాల కోసం, ముఖ్యంగా సినిమాల కోసం ఉపయోగించేవారు. ఇలా కొన్ని రోజులు బాగానే నడిచినా ఇక దీనికి కూడా సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అద్దెకు తీసుకునేవారు లేక యజమానులకు దీని నిర్వహణ ఖర్చు భారంగా మారింది. అంతేకాకుండా ఈ కారు పొడవు కారణంగా ట్రాఫిక్ జాంలు, ఎక్కడా పార్క్ చేయడానికి సరైన స్థలం లేకపోవడంతో దీనిని ఓ మూలన ఉంచేశారు. దీంతో దీని ఖ్యాతి తుప్పుపట్టిపోయి, శిథిలావస్తకు చేరింది.
మళ్లీ చాలా ఏళ్ల తర్వాత న్యూ యార్క్‌కు చెందిన ఒక మ్యూజియం వారు టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఈ కారును కొనిగోలు చేసి మరమ్మత్తులు చేయడంతో మళ్లీ పునరుజ్జీవం పోసుకుంది. ఈ సారి ఈ కారు మరింత పొడుగైంది, మరోసారి గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది.
ఇక కారును చూసిన కొంత మంది నెటిజన్స్ ఆశ్చర్యంతో కూడిన సంతోషం వల్ల కలిగిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇలాంటి లాంగెస్ట్ కారులో లాంగ్ డ్రైవ్ పోవాలి అని ఒకరు, ఇలాంటి కారులో రోడ్డు మీద వెళ్తే మా బాబుగారి రోడ్డు అనొచ్చు అని ఒకరు ఇలా రకరకాలుగా పలురకాల కమెంట్స్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది మరి..!
Watch Here: